సాక్షి, అమరావతి: ఇంట్లో కావాల్సినంత వెలుతురు ఉంటుంది.. కానీ విద్యుత్ దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. బయటి నుంచి చల్లగాలి శరీరాన్ని తాకుతున్నా.. ఫ్యాన్లు, ఏసీలు ఆపడానికి ఇష్టపడం. ఈ విధంగా విద్యుత్ పొదుపులో మనం చేస్తున్న చిన్నపాటి నిర్లక్ష్యమే భవిష్యత్ తరాలకు తీవ్ర ఇబ్బందులు తీసుకువచ్చే ప్రమాదముంది. వచ్చే 39 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి వనరులు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మేలుకోకపోతే విద్యుత్ వెలుగులకు దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ పొదుపుతో పాటు పర్యావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ సహా అనేక దేశాలు విద్యుత్ పొదుపు చర్యలకు నడుం బిగించాయి. మన దేశంలో ఈ బృహత్తర యజ్ఞానికి ఆంధ్రప్రదేశ్ పెద్దపీట వేసి.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రత్యామ్నాయ ప్రాజెక్టులు చేపట్టింది. అలాగే జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా గురువారం నుంచి ఈ నెల 20 వరకు వారోత్సవాలను నిర్వహిస్తోంది.
భవిష్యత్ తరాల కోసం..
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టిస్తోంది. అలాగే భవిష్యత్‌లో విద్యుత్ కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ముందస్తు ప్రణాళికల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. భవిష్యత్ విద్యుత్ అవసరాలకు ఇవి అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేందుకు 7 వేల మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి తీసుకుంటోంది.
మన దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి తోడ్పాటునందిస్తున్న మొదటి పది రాష్ట్రాల్లో ఏపీ స్థానం సంపాదించింది. ఇప్పటికే 4.76 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఏపీ.. 42 ఇంధన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో, గ్రీన్ హైడ్రోజన్, బయో డీజిల్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఇంధన భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసిస్తున్నాయి. అయితే విద్యుత్ వెలుగులను భావితరాలకు అందించడానికి నేటి తరం కూడా తమ వంతు బాధ్యతగా విద్యుత్ పొదుపు పాటించాల్సిన అవసరముంది. ఆ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఇంధన పరిరక్షణ వారోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది.
బొగ్గు కొరతతో తిప్పలు..
ఇటీవల రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల అణు విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. చైనా, ఆ్రస్టేలియాలో బొగ్గు కొరత వల్ల పలు దేశాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జపాన్‌లోనూ విద్యుత్ సంక్షోభం నెలకొంది. శీతాకాలంలోనైనా వెచ్చదనాన్నిచ్చే దుస్తులు ఉపయోగించాలని.. హీటర్లకు వాడే విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని అక్కడి ప్రభుత్వం తాజాగా ఆదేశాలిచ్చింది.
అమెరికాలో గతేడాది కంటే 15 శాతం విద్యుత్ వినియోగంతో పాటు సహజ ఇంధన ధరలు పెరగడంతో అక్కడ ప్రతి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు విద్యుత్ బకాయి చెల్లించలేని పరిస్థితి వచ్చింది. భారత్‌లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం థర్మల్ నుంచే వస్తోంది. అలాంటి థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత వల్ల ఇబ్బందులు తప్పడం లేదు.
ఈపీడీసీఎల్‌కు ఈఈఎస్‌ఎల్ ప్రశంసలు
సాక్షి, విశాఖపట్నం: ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.3,265.47 కోట్ల విలువైన 5,062.48 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ఆదర్శంగా నిలిచింది. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సమీక్షలో ఈపీడీసీఎల్‌ను ఎనర్జీ ఎఫీషియన్సీ సర్విస్ లిమిటెడ్ సీఈవో విశాల్‌కపూర్ ప్రశంసించారు. అలాగే 2018–19 నాటికి 6.68 శాతంగా ఉన్న నష్టాలను.. 2023–24 సెపె్టంబర్ నాటికి 5.14 శాతానికి తగ్గించుకుంది.
ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వి తేజ్ మాట్లాడుతూ.. ‘ఇంధన పొదుపు సామర్థ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రవేశపెట్టిన పాలసీని అమలుచేస్తూ విజయాలు సాధిస్తున్నాం. పరిశ్రమలు, భవన నిర్మాణ రంగం, మున్సిపల్, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధన పొదుపు ఎక్కువగా జరిగేలా చూస్తున్నాం. రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాం. వినియోగదారులు చేస్తున్న ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తున్నాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment