Sileru Power Project
-
సరిలేరు నీకెవ్వరు.. వెలుగుల సీలేరు
సీలేరు: సీలేరు విద్యుత్ కేంద్రం..50 ఏళ్ల చరిత్ర.. నిరాటంకంగా విద్యుత్ కాంతులు..ఇప్పటికీ నంబర్ వన్..అదే వెలుగు..అదే ఖ్యాతి. విద్యుత్ కేంద్రాలలో సరిలేరు నీకెవ్వరు అన్నట్టు దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ప్రకృతి సేదదీరిన పచ్చని అడవుల్లో ఒక్కొక్క నీటి బొట్టు ఒకచోట చేరి కొండలు, వాగుల నుంచి జాలువారి నీటి ప్రవాహంలా మారి బలిమెల నదిగా పేరు పొందింది. ఒకచోట నుంచి మరో ప్రాంతానికి పచ్చని కొండల మధ్య నుంచి ఒంపుసొంపులుగా ప్రవహిస్తూ ప్రతి ఊరు, ప్రతి గొంతును తడుపుతూ ఏటా లక్షలాది రైతుల ఆనందానికి చిరునవ్వుగా సీలేరు నది ప్రసిద్ధి చెందింది. 50 ఏళ్ల ముందు స్వదేశీ, విదేశీ పరిజ్ఞానంతో కారడవుల్లో విద్యుత్ కేంద్రాలను నిర్మించి నీటితో విద్యుత్ ఉత్పత్తి తయారయ్యేలా గొప్ప చరిత్రను సృష్టించి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిరంతరం అందిస్తోంది. మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రం స్వాతంత్య్రం వచ్చాక సీలేరు నదిపై 1955 ఆగస్టు నెలలో మొట్టమొదటి సారిగా మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇందులో ఆరు యూనిట్లు ఉన్నాయి. తొలుత మూడు యూనిట్లు ప్రారంభించి, తర్వాత మిగిలిన యూనిట్లను ఏర్పాటు చేసి 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది ఏపీ, ఒడిశా ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో ఉత్పత్తి అయిన విద్యుత్ ఇరు రాష్ట్రాలు సమానంగా పంచుకుని 220 కేవీ లైన్ల ద్వారా ఒడిశాకు సరఫరా అవగా ఏపీ వాటా పెందుర్తి కూడా చేరుతోంది. సీలేరు: 240 మెగావాట్లు ఆంధ్రప్రదేశ్‌లో మాచ్‌ఖండ్ తర్వాత 1960లో సీలేరు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. ఒకటి, రెండు యూనిట్లు స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. 1964లో 3,4 యూనిట్లు విదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. ఇక్కడ 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 220 కేవీ లైన్ల ద్వారా గాజువాకకు, మరో లైన్ ద్వారా తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరుకు చేరుతుంది. డొంకరాయి: 25 మెగావాట్స్ సీలేరు నుంచి విద్యుత్ ఉత్పత్తి అయిన అనంతరం విడుదలైన నీటితో డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇది 1972లో నిర్మించారు. ఈ విద్యుత్ కేంద్రానికి పైన డొంకరాయి డ్యామ్‌ను కూడా అప్పట్లోనే నిర్మించారు. ఇక్కడ నీరు వృథా కాకుండా రెండు మార్గాల్లో నీరు విడుదలయ్యే విధంగా అప్పటి ఇంజనీర్లు నిర్మించడం విశేషం. మోతుగూడెం(పొల్లూరు): 460 మెగావాట్స్ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు మాదంటే మాది అంటూ గొడవలు పడిన విద్యుత్ కేంద్రం ఇది. 1976లో నిర్మించిన ఈ జలవిద్యుత్ కేంద్రంలో ఒకేసారి నాలుగు యూనిట్లు నిర్మించారు. ఒక్కో యూనిట్ 115 మెగావాట్ల చొప్పున మొత్తం 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఇదే ప్రాజెక్టులో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.537 కోట్ల వ్యయంతో రెండు యూనిట్లు నిర్మించి మరో 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. సీలేరు నది ఇరు రాష్ట్రాలకు సిరి సీలేరు విద్యుత్ కాంప్లెక్సు పరిధిలోని జలవిద్యుత్ కేంద్రాలు, జలాశయాలకు నేటికి గొప్ప చరిత్ర ఉంది. పత్రికల్లో ఎన్నో కథనాలు, ఎన్నో రికార్డులు, అవార్డులు వచ్చాయి. బలిమెల నది బలిమెలలో పుట్టి గోదావరి వరకు చేరుతుంది. ఏపీ, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఐడల్ విద్యుత్ కేంద్రాలకు నీటిని విడుదల చేయడంలో బలిమెల నదే కీలకం. రెండు రాష్ట్రాల విద్యుత్, వ్యవసాయ, తాగునీటి అవసరాలకు ఇక్కడ నుంచే నీటిని సరఫరా చేస్తారు. బలిమెల 32 కిలోమీటర్ల విస్తరణలో ఉంది. శతకోటి ఘనపుటడుగుల నీటి సామర్ధ్యంతో ఉంటుంది. ముందుగా మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అయిన అనంతరం నీరు 86 కిలోమీటర్లు కొండల మధ్య ప్రవహించి బలిమెలలోకి చేరుతోంది. ఇరు రాష్ట్రాలు నీటిని సమానంగా పంచుకుంటారు. ఏపీ వాటాగా ఉన్న నీరు 18 కిలోమీటర్లు ప్రవహించి గుంటవాడలోకి చేరుతోంది. సీలేరులో విద్యుత్ ఉత్పత్తి అనంతరం పవర్ కెనాల్ ద్వారా 30 కిలోమీటర్లు ప్రవహించి గుంటవాడ జలాశయంలోకి చేరుతోంది. డొంకరాయిలో విద్యుత్ తయారై రెండు మార్గాల్లో నీటి విడుదల జరుగుతోంది. రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయిన, గోదావరి పంటలకు నీరు కావాల్సి ఉన్న మెయిన్ డ్యాం ద్వారా నీరు విడుదల చేస్తారు. అలా కాకుండా విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదలైన నీరు కెనాల్ ద్వారా ఏవీపీ డ్యామ్‌కు చేరుతుంది. అక్కడ నుంచి మోతుగూడెం విద్యుత్ కేంద్రానికి చేరుకుని 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి 38 కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చే నీటిని కలుపుకుని శబరి నదిలో కలుస్తోంది. అక్కడ నుంచి గోదావరిలోకి చేరుతోంది. గ్రిడ్‌కు విద్యుత్ అందించడంలో సీలేరుదే ఘనత విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడంలో సీలేరు కాంప్లెక్సుకు నేటికి ఓ రికార్డు ఉంది. 50 ఏళ్లు పూర్తయినా విద్యుత్ ఉత్పత్తిలో నంబర్ వన్‌గా నిలుస్తోంది. ఇక్కడ నిరాటంకంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పటికి 50 శాతం విద్యుత్ సీలేరు నుంచే అందుతుంది. ఇటీవల సీలేరును సందర్శించినప్పుడు ఇక్కడ విద్యుత్ కేంద్రాల గొప్పతనం మరింత తెలుసుకున్నాం. – బి.శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ జెన్కో ఇంజనీర్లు, కార్మికుల కృషి వల్లే .. 50 ఏళ్లకు ముందు ఇంజనీర్లు, కార్మికులు, ఉద్యోగుల కృషి ఈ విద్యుత్ కేంద్రాల ఘనత. ప్రతి ఏటా డిస్పాచ్ అధికారులు ఇచ్చిన లక్ష్యాలను మించి సమయానికి తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించిన ఘనత ఈ విద్యుత్ కేంద్రాలకు ఉంది. ప్రతి ఏటా సీలేరు నుంచి గోదావరి పంట భూములకు నీరు అందిస్తున్నాం. – రాంబాబు, చీఫ్ ఇంజనీర్, మోతుగూడెం అధికారుల ప్రశంసలు మర్చిపోలేను సీలేరు విద్యుత్ కేంద్రంలో ఉద్యోగం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ విద్యుత్కేంద్రాలు కన్నతల్లిలాంటివి. ఇక్కడ ఉద్యోగం చేయడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడంపై అధికారుల ప్రశంసలు మర్చిపోలేను. – రమేష్‌కుమార్, ఏడీ, జలవిద్యుత్ కేంద్రం, సీలేరు. -
సీలేరు.. లక్ష్యంలో సరిలేరు!
రంపచోడవరం/మోతుగూడెం: సీలేరు జలవిద్యుత్ కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తిలో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాయి. ఐదేళ్లుగా లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. సీలేరు కాంప్లెక్స్ పరిధిలో మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాలున్నాయి. వీటి ఉత్పత్తి లక్ష్యాలను ఏటా కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) నిర్దేశిస్తుంది. సీలేరు కాంప్లెక్స్‌లోని నాలుగు జలవిద్యుత్ కేంద్రాలకు 2020–21లో 2,074.98 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం కాగా, మార్చి నెలాఖరుకు 2,705.36 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. మొత్తం నాలుగు విద్యుత్ కేంద్రాలు పరస్పరం పోటీ పడినట్టుగా అధిక ఉత్పత్తి సాధించాయి. అంతేకాదు.. ఈ కేంద్రాల ద్వారా ఈ ఏడాది గోదావరి డెల్టాకు 45 టీఎంసీల నీటిని కూడా అందించారు. గత ఏడాది నీటి సమస్యతో పాటు యూనిట్లు తరచూ మొరాయించిప్పటికీ విద్యుత్ ఉత్పత్తిలో లక్ష్యాన్ని సాధించడం విశేషం. ఈ ఏడాది పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంతో పాటు డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలోని యూనిట్లు మొరాయించాయి. స్థానిక ఇంజనీర్ల కృషితో పాటు కార్మికులు యూనిట్ల మరమ్మతులో జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ ఈ లక్ష్యాలను సాధించారు. రాష్ట్రంలోని అన్ని జలవిద్యుత్ కేంద్రాల ద్వారా రోజుకు 9.18 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా ఒక్క సీలేరు కాంప్లెక్స్‌లోనే డిమాండ్‌కు అనుగుణంగా రోజుకు 7 నుంచి 8 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతోంది. నాగార్జున సాగర్, టెయిల్ పాండ్, పెన్నా అహోబిలం, చెట్టుపేట మినీ జలవిద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. సమష్టి కృషితోనే సాధ్యం డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. నీటి వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ గోదావరి డెల్టాకు అవసరమైన నీటిని విడుదల చేస్తూ, లోడ్ డిస్పాచ్ సెంటర్ ఆదేశాల మేరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. స్థానిక ఇంజనీర్లు, సిబ్బంది కృషితో లక్ష్యాన్ని సాధించాం. – ఎం.గౌరీపతి,చీఫ్ ఇంజనీర్, సీలేరు కాంప్లెక్స్, మోతుగూడెం, తూర్పు గోదావరి జిల్లా సాంకేతిక సమస్యలు అధిగమించాం.. ఈ నాలుగు జలవిద్యుత్ కేంద్రాల్లోని యూనిట్లు ఏటా మొరాయిస్తున్నా.. ఎప్పటికప్పుడు సాంకేతిక సమస్యలను గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి, విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాలను అందుకోగలిగాం. నాలుగు జలవిద్యుత్ కేంద్రాల యూనిట్ల ఆధునికీకరణకు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాం. త్వరలోనే అనుమతులు లభిస్తే యూనిట్ల ఆధునికీకరణకు చర్యలు చేపడతాం. – కె.బాలకృష్ణ, డీఈ (ఎలక్ట్రికల్), ఆపరేషన్, మెయింటెనెన్స్ -
పవర్ కెనాల్‌కు గండి:విద్యుత్‌కు అంతరాయం
సాక్షి, అమరావతి: సీలేరు ఏజెన్సీలో భారీ వర్షాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డొంకరాయి, దిగువ సీలేరు మధ్య విద్యుత్ కెనాల్‌కు గండి పడటంతో ఇబ్బందులు తలెత్తినట్లు విద్యుత్ శాఖ పేర్కొంది. భారీ వర్షాలు కారణంగా జెన్కో నిర్వహిస్తున్న మరమ్మతులకు ఆటంకం ఏర్పడింది. 300 నుంచి 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పతికి అంతరాయం కలిగింది. వీలైనంత త్వరగా విద్యుత్ కెనాల్ మరమ్మతులు పూర్తి చేస్తామని జెన్ కో తెలిపింది. -
సీలేరు విద్యుత్ లెక్క తేల్చండి
* గోదావరి నది యాజమాన్య బోర్డు ముందు తెలంగాణ వాదన * సమగ్ర సమాచారాన్ని తమకు ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ * సీలేరు విద్యుత్ కేంద్రాన్ని బోర్డు పరిధిలో చేర్చాలని విజ్ఞప్తి * విద్యుత్ కేంద్రాలపై బోర్డుకు అధికారం లేదన్న ఏపీ * తొలి సమావేశంలో ఎటూ తేల్చని బోర్డు * పూర్తిస్థాయి అధ్యయనం అవసరమన్న బోర్డు చైర్మన్ * ఇరు రాష్ట్రాల ఈఎన్సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు * సమగ్ర నివేదిక రూపొందించాలని సూచన.. 2 వారాల గడువు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాల వినియోగంతో దిగువ సీలేరు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తవుతున్న విద్యుత్ లెక్కలను ముందుగా తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం గోదావరి నది యాజమాన్య బోర్డు ముందు పట్టుబట్టింది. సీలేరు నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా విద్యుత్‌ను ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జాప్యానికి కారణాలు బయటపెట్టాలని డిమాండ్ చేసింది. సీలేరు జలాశయం నుంచి నీటి విడుదల, విద్యుత్ ఉత్పత్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేలా ఏపీని ఆదేశించాలని కోరింది. సీలేరు విద్యుత్ కేంద్రాన్ని బోర్డు పరిధిలోకి తేవాలని విన్నవించింది. మరోవైపు బోర్డు కేవలం జల వివాదాలకే పరిమితమని, దానికి విద్యుత్ కేంద్రాలతో సంబంధం లేదని ఏపీ ప్రభుత్వం వాదించింది. తెలంగాణ, ఏపీ మధ్య గోదావరి నదీ జలాల వివాదాలను పరిష్కరించేందుకు ఏర్పాటైన బోర్డు సమావేశం బుధవారమిక్కడి కేంద్ర జల సంఘం కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో బోర్డు చైర్మన్ ఎ.మహేంద్రన్, సభ్య కార్యదర్శి జి.చంద్రశేఖర్ అయ్యర్, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషీ, ఈఎన్సీ మురళీధర్, ఏపీ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, జెన్కో అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు సాగగా... మూడున్నర గంటల పాటు సీలేరు జల విద్యుత్ కేంద్రాల అంశంపైనే ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. సీలేరు విద్యుత్‌పై ఎవరి వాదనలు ఏమిటంటే... ఆంధ్రప్రదేశ్: గోదావరి బోర్డు రెండు రాష్ట్రాల మధ్య కేవలం జల వివాదాలకు సంబంధించిన అంశాలకే పరిమితం. సీలేరు జల విద్యుత్ కేంద్రాలతో బోర్డుకు సంబంధం లేదు. బోర్డుకు నియంత్రణ అధికారం అప్పగించడానికి సిద్ధంగా లేం. విద్యుత్‌పై కేంద్రానికే అధికారం ఉంటుంది. విద్యుత్ షెడ్యూలింగ్ కూడా కేంద్రమే చూసుకుంటుంది. అందులో రాష్ట్రం పాత్ర ఏమీ ఉండదు. సీలేరు జలాశయాల నుంచి నీటి విడుదలకు, విద్యుత్ అంశానికి లింకు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. తెలంగాణ: సీలేరులో 470 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే వీలుంది. ఈ విద్యుత్‌ను 58:42 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీలు పంచుకోవాలని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నా అదేమీ జరగడం లేదు. సీలేరులో విద్యుదుత్పత్తి, వాడకం, తెలంగాణ వాటాపై ఏపీ ప్రభుత్వం ఏమీ తేల్చడం లేదు. ఇప్పటికే ఏపీ రాయలసీమ, విజయవాడ థర్మల్ కేంద్రాల నుంచి 900 మెగావాట్ల మేర విద్యుత్‌ను నిలిపివేయడంతో తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రమైంది. ఇలాంటి సమయంలో సీలేరు విద్యుత్ వాటా తెలంగాణకు చాలా ముఖ్యం. కానీ దాన్ని ఏపీ లెక్కచేయడం లేదు. ఈ దృష్ట్యా జల విద్యుత్ కేంద్రాలన్నీ బోర్డు పరిధిలోకి తెచ్చి, దాని నియంత్రణలోనే పనిచేసేలా చూడాలి. విద్యుత్ లెక్కలు ఇవ్వని కారణంగా విద్యుత్ గ్రిడ్‌లోనూ సమస్యలు వస్తున్నాయి. సీలేరు నుంచి ఎంత నీరు విడుదల చేస్తున్నారు? ఎంత విద్యుదుత్పత్తి చేస్తున్నారన్న సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలి. ఉత్పత్తి ఎంతో తెలిస్తే వచ్చే వాటా మేరకు వినియోగానికి ప్రణాళికలు తయారు చేసుకుంటాం. సీలేరుకు ఆయకట్టు, తాగునీరు లేదు కాబట్టి ప్రాజెక్టు తప్పకుండా బోర్డు పరిధిలో చేర్చాల్సిందే. గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టులు ఏమీ లేనందున తెలంగాణలోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలో చేర్చాల్సిన అవసరం లేదని తెలంగాణ వాదించింది. అన్ని ప్రాజెక్టులను చేర్చాల్సిందేనని ఏపీ వాదించింది. బోర్డు పరిధిలో చేర్చాల్సిన ప్రాజెక్టులపై నివేదిక ఇచ్చే బాధ్యతను వర్కింగ్ గ్రూపునకు బోర్డు అప్పగించింది. అధ్యయనం అవసరం: సీలేరు వివాదంపై నిర్ణయం తీసుకోవడానికి పూర్తి స్థాయి అధ్యయనం అవసరమని బోర్డు చైర్మన్ మహేంద్రన్ పేర్కొన్నారు. ‘‘ఇరు రాష్ట్రాల వాదనలపై అధ్యయనం చేసి పూర్తి సమాచారంతో నివేదిక ఇచ్చే బాధ్యతలను వర్కింగ్ గ్రూపునకు అప్పగిద్దాం. బోర్డు సభ్య కార్యదర్శి, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేద్దాం. విద్యుత్‌పై సమగ్ర నివేదిక సమర్పించడానికి వీలుగా రెండు వారాల గడువు ఇద్దాం. నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుందాం..’’ అని ఆయన సమావేశంలో సూచించారు. బోర్డు నిర్ణయాలు ఇవీ.. భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాజెక్టుల నీటి విడుదల తీరు తెన్నులను నిర్దేశించే ప్రోటోకాల్‌లను తయారు చేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల వారీగా ‘వాటర్ ప్రొటోకాల్’లను రూపొందించాలి. ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు చర్చించుకొని సమగ్ర ప్రొటోకాల్‌లను బోర్డు ముందు ఉంచాలి. బోర్డు స్వరూపం, సిబ్బంది నియామకం, నిర్వహణ వ్యయం, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా ఏర్పాట్లు, సాంకేతిక అంశాలు.. తదితరాలపై సమగ్ర నివేదికను సమర్పించే బాధ్యతను వర్కింగ్ గ్రూపునకు అప్పగించారు. గోదావరిపై కొత్త ప్రాజెక్టుల కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు తయారు చేయడానికి కూడా కేంద్ర జల సంఘం, బోర్డు నుంచి అనుమతులు తీసుకోవాలి.