వర్షాలకు ముందే టెలిమెట్రీ
ఇరు రాష్ట్రాల ప్రాజెక్టుల పరిధిలో సమానంగా ఏర్పాటు
లేఖలు రాసిన కృష్ణా బోర్డు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేయనున్న టెలిమెట్రీ పరికరాలను వర్షాల సమయానికి ముందే సిద్ధం చేయనున్నట్లు కృష్ణాబోర్డు తెలిపింది. రెండు రాష్ట్రాల్లోనూ సమాన సంఖ్యలో వీటిని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు అంగీకరించిన 18 చోట్ల టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు స్థితిగతులు, మరో 29 చోట్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనల అంశాన్ని తెలుపుతూ బోర్డు బుధవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది.
జూరాల పరిధిలో 7 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉండగా 6 చోట్ల అమర్చడం పూర్తయిందని, మరోచోట పనులు జరుగుతున్నాయని... సాగర్ పరిధిలో 3 చోట్ల త్వరలో పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోందని తెలిపింది. శ్రీశైలంలో మాత్రం 4 చోట్ల ఏర్పాటుకు పరిశీలన జరుగుతోందని పేర్కొంది. వీటికి అదనంగా తెలంగాణలో మరో 12 చోట్ల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని.. అందులో 2 చోట్ల ఓకే చేయగా, మరో 10 చోట్ల ఏర్పాటుపై రాష్ట్రాల సమ్మతి మేరకు నిర్ణయం చేస్తామని తెలిపింది. ఇక కొత్తగా 29 చోట్ల పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉందని, రాష్ట్రాలు అంగీకరించగానే పనులు మొదలు పెడతామని పేర్కొంది.
505 అడుగుల మట్టం ఉంచాలి..
నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని ఇచ్చేందుకు వీలుగా ప్రాజెక్టులో 505 అడుగుల కనీస మట్టంలో నీటి నిల్వలు ఉంచాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం శాఖ ఈఎన్‌సీ మురళీధర్ బోర్డుకు లేఖ రాశారు. శ్రీశైలం నుంచి 8.2 టీఎంసీల మేర నీరు సాగర్‌కు రావాల్సి ఉందని.. అది విడుదల చేస్తేనే సాగర్ నుంచి ఏపీ అవసరాలకు నీటి విడుదల సాధ్యమవుతుందని అందులో పేర్కొన్నారు. ఈ దృష్ట్యా సాగర్‌కు నీటి విడుదల జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై బోర్డు ఏపీ అభిప్రాయాన్ని కోరింది.