Telemetry
-
తుంగభద్రపై ఐదు టెలిమెట్రీ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆయకట్టుకు రావాల్సిన జలాలకు మార్గంమధ్యలోనే గండి పడుతోంది. 19.5 టీఎంసీలు రావాల్సి ఉండగా, ఏటా 5 టీఎంసీలకు మించి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ కాల్వకు వస్తున్న జలాలను శాస్త్రీయ పద్ధతిలో లెక్కించడానికి ఐదు చోట్లలో టెలీమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న అభిప్రాయానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సబ్ కమిటీ వచి్చంది. కృష్ణా బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై మెంబర్ కన్వీనర్‌గా, ఏపీ, తెలంగాణ నుంచి ఒక్కో ఇంజనీర్ సభ్యులుగా ఉన్న బోర్డు సబ్ కమిటీ ఇటీవల సుంకేశుల, ఆర్డీఎస్, జూరాల ప్రాజెక్టులను సందర్శించింది. ఈ నేపథ్యంలో తుంగభద్ర జలాశయం నుంచి ఆర్డీఎస్ కాల్వకు నీళ్లు విడుదల చేసే రెగ్యులేటర్ వద్ద, కర్ణాటకలో 43 కి.మీ ప్రయాణించి తెలంగాణ సరిహద్దులకు ఆర్డీఎస్ కాల్వ చేరుకునే పాయింట్ వద్ద, తుమ్మిళ్ల ఎత్తిపోతల దగ్గర, సుంకేశుల జలాశయంతో పాటు ఈ జలాశయం నుంచి కేసీ కాల్వకు నీటి సరఫరా చేసే రెగ్యులేటర్ వద్ద టెలిమెట్రీ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా సూచిస్తూ సబ్ కమిటీ త్వరలో కృష్ణా బోర్డుకు నివేదిక సమర్పించనుంది. దీంతో తుంగభద్ర డ్యాం నుంచి ఎన్ని నీళ్లు ఆర్డీఎస్ కాల్వకు విడుదల చేస్తున్నారు? అందులో ఎన్ని నీళ్లు రాష్ట్ర సరిహద్దులకు చేరుతున్నాయి? తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా తుంగభద్ర నది నుంచి ఏ మేరకు నీళ్లను ఆర్డీఎస్ కాల్వకు మళ్లిస్తున్నారు? సుంకేశుల జలాశయానికి ఎన్ని నీళ్లు వస్తున్నాయి ? సుంకేశుల నుంచి ఏ మేరకు నీటిని కేసీ కాల్వకు తరలిస్తున్నారు ? అన్న విషయాలపై స్పష్టత రానుంది. త్వరలో జరగనున్న తుంగభద్ర బోర్డు సమావేశంలో ఈ సబ్ కమిటీ సిఫారసుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
విక్రమ్ ధ్వంసం కాలేదు
బెంగళూరు/కరాచీ: చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్’ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని పక్కకు ఒరిగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. అయితే ఈ ఘటనలో ల్యాండర్ ధ్వంసం కాలేదని వెల్లడించింది. విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొంది. ఈ విషయమై ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ.. ‘చంద్రుడిని ఢీకొన్న విక్రమ్ ముక్కలు కాలేదు. ఓ పక్కకు పడిపోయి ఉంది. దక్షిణ ధ్రువంలో మేం ల్యాండర్‌ను దించాలనుకున్నచోటుకు చాలా దగ్గరలో విక్రమ్ ఉన్నట్లు గుర్తించాం. విక్రమ్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇస్రోలో ఓ బృందం అవిశ్రాంతంగా పనిచేస్తోంది’ అని చెప్పారు. ఇస్రో జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా జూలై 22న చంద్రయాన్–2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈనెల 7న తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ జాబిల్లివైపు పయనమైంది. చంద్రుడికి 2.1 కి.మీ ఎత్తులో విక్రమ్ ఉండగా, కమాండ్ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఇస్రోకు పాక్ వ్యోమగామి మద్దతు.. విక్రమ్ వైఫల్యంపై పాక్ సైన్స్, టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి ఎగతాళి చేసిన వేళ పాకిస్తాన్ నుంచే ఇస్రోకు మద్దతు లభించింది. చంద్రయాన్–2 ప్రయోగం గొప్ప ముందడుగని పాక్ తొలి మహిళా వ్యోమగామి నమీరా సలీం ప్రశంసించారు. ‘చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు చంద్రయాన్–2తో చారిత్రాత్మక ప్రయోగం చేపట్టిన ఇస్రోను అభినందిస్తున్నా. ఈ ప్రయోగంతో దక్షిణాసియా మాత్రమే కాదు.. అంతర్జాతీయ అంతరిక్ష పరిశ్రమ కూడా గర్వపడేలా ఇస్రో చేసింది’ అని కితాబిచ్చారు. పారిశ్రామికవేత్త రిచర్డ్ బ్రాన్సన్కు చెందిన ‘వర్జిన్ గెలాక్టిక్’ అనే సంస్థ ప్రయోగించిన వాహకనౌక ద్వారా అంతరిక్షంలో విహరించిన నమీరా ఈ ఘనత సాధించిన తొలి పాకిస్తానీ. -
తెలంగాణకు 1.5.. ఏపీకి 6.5
-
మనకు 1.5.. ఏపీకి 6.5
సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో 8 టీఎంసీల నీటిని పంపిణీ చేసిన కృష్ణా బోర్డు సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న 8 టీఎంసీల నీటిని కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలకు పంచింది. అందులో తెలంగాణకు 1.5 టీఎంసీలు, ఏపీకి 6.5 టీఎంసీలు కేటాయించింది. తెలంగాణకు కేటాయించిన నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించగా.. ఏపీకి కేటాయించిన దానిలో సాగర్ కుడి కాల్వకు 2.5 టీఎంసీలు, కృష్ణా డెల్టా వ్యవస్థ కింది అవసరాలకు 4 టీఎంసీలు ఇచ్చింది. మే నెల చివరి వరకు ఈ నీటిని వినియోగించుకోవాలని సూచిస్తూ.. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ శుక్ర వారం రాత్రి ఇరు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లకు లేఖలు రాశారు. సాగర్‌లో 502 అడు గులు, శ్రీశైలంలో 765 అడుగుల దిగువ వరకు నీటిని తీసుకునేందుకు అంగీకరిం చారు. ఈ మేరకు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. నీటి విడుదలపై ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో త్రిసభ్య కమిటీ భేటీ ఉండదని నీటి పారుదల వర్గాలు పేర్కొన్నాయి. టెలీమెట్రీపై వెనక్కి తగ్గిన బోర్డు... టెలీమెట్రీ పరికరాల విషయంగా రాష్ట్రం లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో బోర్డు వెనక్కి తగ్గింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యు లేటర్ దిగువన 600 మీటర్ల వద్ద టెలీమెట్రీకి ప్రతిపాదించగా.. దాన్ని శ్రీశైలం కుడి కాల్వ కింద 12.26 కిలోమీటర్ పాయింట్‌కు మార్చా లన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కుడి కాల్వ కింద 12.26 కిలోమీటర్ వరకు మధ్య లో 4,500 ఎకరాలకు నీళ్లిచ్చే ఎత్తిపోతల పథ కాలను ఏపీ నిర్వహిస్తోందని.. బంకచర్ల వరకు తాగునీటి పథకాలు సైతం ఉన్నాయని తెలంగాణ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇక సాగర్ ఎడమ గట్టు కాల్వలపై ఏపీ, తెలంగాణ సరిహద్దులో 101.36 కిలోమీటర్ వద్ద ప్రతిపాదించిన పరికరాల ఏర్పాటును 102.63 కిలోమీటర్‌కు మార్చాలన్న నిర్ణయా న్నీ వెనక్కి తీసుకుంది. అలా చేస్తే ఏపీ పరిధి లోని నూతిపాడు కింద రెండు ఎత్తిపోతల పథకాల నీటి వినియోగం లెక్కలోకి రాదని రాష్ట్రం స్పష్టం చేసింది. అభిప్రాయాలు చెప్పండి... కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నియంత్రణపై బోర్డు రూపొందించిన వర్కింగ్ మ్యాన్యువల్‌పై ఇరు రాష్ట్రాలు తమ అభిప్రాయాలు, అభ్యంతరా లు తెలపాలని బోర్డు మరోమారు కోరింది. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు, అందుకు అనుగుణంగా జారీ అయిన జీవోలు, రూపొందించిన నిబంధనల మేరకు నీటి వినియోగం ఉండేలా నియంత్రణలు ఉంటాయని బోర్డు తెలుపగా.. తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేసిన తర్వాత, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక బోర్డు కేవలం వాటి నిర్వహణను మాత్రమే చూడాలని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ కేటాయించిన ఎన్‌బ్లాక్ కేటాయింపులకు అనుగుణంగానే పంపిణీ జరగాలని, అంతకుమించి ఇతర ప్రత్యామ్నాయాలు వేటినీ ఒప్పుకోబోమని స్పష్టం చేసింది. అయితే దీనిపై లిఖితపూ ర్వకంగా అభిప్రాయాలు తెలపాల్సి ఉంది. ఇక నీటి వినియోగ ప్రోటోకాల్, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు నీటి విడుదల తదితర అంశాల పైనా బోర్డు పలు వివరణలు కోరింది. -
వర్షాలకు ముందే టెలిమెట్రీ
ఇరు రాష్ట్రాల ప్రాజెక్టుల పరిధిలో సమానంగా ఏర్పాటు లేఖలు రాసిన కృష్ణా బోర్డు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేయనున్న టెలిమెట్రీ పరికరాలను వర్షాల సమయానికి ముందే సిద్ధం చేయనున్నట్లు కృష్ణాబోర్డు తెలిపింది. రెండు రాష్ట్రాల్లోనూ సమాన సంఖ్యలో వీటిని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు అంగీకరించిన 18 చోట్ల టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు స్థితిగతులు, మరో 29 చోట్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనల అంశాన్ని తెలుపుతూ బోర్డు బుధవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. జూరాల పరిధిలో 7 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉండగా 6 చోట్ల అమర్చడం పూర్తయిందని, మరోచోట పనులు జరుగుతున్నాయని... సాగర్ పరిధిలో 3 చోట్ల త్వరలో పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోందని తెలిపింది. శ్రీశైలంలో మాత్రం 4 చోట్ల ఏర్పాటుకు పరిశీలన జరుగుతోందని పేర్కొంది. వీటికి అదనంగా తెలంగాణలో మరో 12 చోట్ల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని.. అందులో 2 చోట్ల ఓకే చేయగా, మరో 10 చోట్ల ఏర్పాటుపై రాష్ట్రాల సమ్మతి మేరకు నిర్ణయం చేస్తామని తెలిపింది. ఇక కొత్తగా 29 చోట్ల పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉందని, రాష్ట్రాలు అంగీకరించగానే పనులు మొదలు పెడతామని పేర్కొంది. 505 అడుగుల మట్టం ఉంచాలి.. నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని ఇచ్చేందుకు వీలుగా ప్రాజెక్టులో 505 అడుగుల కనీస మట్టంలో నీటి నిల్వలు ఉంచాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం శాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డుకు లేఖ రాశారు. శ్రీశైలం నుంచి 8.2 టీఎంసీల మేర నీరు సాగర్‌కు రావాల్సి ఉందని.. అది విడుదల చేస్తేనే సాగర్ నుంచి ఏపీ అవసరాలకు నీటి విడుదల సాధ్యమవుతుందని అందులో పేర్కొన్నారు. ఈ దృష్ట్యా సాగర్‌కు నీటి విడుదల జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై బోర్డు ఏపీ అభిప్రాయాన్ని కోరింది. -
టెలీమెట్రీపై కొత్త సందేహాలు!
పూర్తి స్థాయి నీటి విడుదల సామర్థ్యాన్ని గుర్తించలేని వ్యవస్థ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగ, విడుదల లెక్కలు పక్కాగా ఉండేలా ప్రధాన ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేస్తున్న టెలీమెట్రీ పరికరాల పనితీరుపై సందేహాలు రేకెత్తుతున్నాయి. ప్రాజెక్టు నుంచి కాల్వలకు నీటి తరలించే సమయంలో సరైన విడుదల (డిశ్చార్జి) లెక్కలను అవి నమోదు చేయడం లేదని వాదనలు వినవస్తున్నా యి. ఇందుకు బలం చేకూరుస్తూ పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలీమెట్రీ పరికరాలు పూర్తి స్థాయి డిశ్చార్జిలను చూపడం లేదంటూ లేఖ రాయడం చర్చనీయాం శంగా మారింది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 47 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, అందులో తొలి విడతగా రూ.4 కోట్ల వ్యయంతో జూరాల, శ్రీశైలం, సాగర్‌లలో 18 చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఇందులో పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలీమెట్రీ వ్యవస్థ ప్రవాహాలను సరిగా నమోదు చేయడం లేదని కృష్ణాబోర్డు గుర్తించింది. దాంతో అక్కడ ప్రవాహాలను లెక్కించాలంటే ఆటోమెటిక్ సెన్సర్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఏపీలకు రాష్ట్రాలకు సూచించింది. అప్పుడే సరైన నీటి విడుదల లెక్కలు వస్తాయని పేర్కొంది. -
మిగిలింది 64 టీఎంసీలే!
► ఈ నీటినే జూన్ వరకు సర్దుకోవాల్సిందే ► తెలంగాణ, ఏపీలకు స్పష్టం చేసిన కృష్ణా బోర్డు ► రెండో విడతలో 13 చోట్ల టెలీమెట్రీ ఏర్పాటుకు ప్రతిపాదనలు ►జనవరి తర్వాతి నీటి అవసరాలపై త్వరలో సమావేశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ లోని నాగా ర్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు వినియోగం పోగా మరో 64 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉందని కృష్ణా బోర్డు తేల్చింది. ఆ నీటినే ఇరు రాష్ట్రాలు వచ్చే జూన్ వరకు సర్దుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణా లో గత నెల నుంచి జరిగిన వినియోగం, మిగిలిన నీటి లెక్కలను తెలుపుతూ.. బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ బుధవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. గత నెలలో సాగర్, శ్రీశైలంలలో కలిపి 129.96 టీఎంసీల మేర నీరుండగా.. తెలంగాణ 19.56 టీఎంసీ లు, ఏపీ 39.75 టీఎంసీలు వాడుకున్నాయని అందులో వివరించారు. అవి పోగా 70.64 టీఎంసీల నీరుండాల్సి ఉందని.. కానీ 64.53 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయని, మిగతా 6 టీఎంసీల నీరు లెక్కల్లోకి రాలేదని పేర్కొంది. మొత్తంగా మిగిలిన 64 టీఎంసీల లభ్యత నీటినే ఇరు రాష్ట్రాలు మళ్లీ వర్షాలు కురిసేదాకా తాగునీటి కోసం ఉపయోగించాల్సి ఉంటుందని వివరించింది. మరో 13 చోట్ల టెలీమెట్రీ.. కృష్ణా జలాల వినియోగ, విడుదల లెక్కలు పక్కాగా ఉండేలా, ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల్లో తేడాలు రాకుండా టెలీమెట్రీ పరికరాలను అమర్చనున్న విషయం తెలిసిందే. నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల సహా ప్రధాన ప్రాజెక్టుల వద్ద 18 చోట్ల టెలీమెట్రీ పరికరాలను అమర్చేందుకు ఇప్పటికే కసరత్తు చేస్తున్న కృష్ణా బోర్డు... రెండో విడతగా మరో 13 చోట్ల వాటిని అమర్చాలని ప్రతిపాదించింది. పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, కృష్ణా డెల్టా కింద టెలీమెట్రీ పరికరాలను అమర్చాలని సూచిస్తూ మరో లేఖ రాసింది. ఇందులో పులిచింతల డ్యామ్, పులిచింతల డౌన్ స్ట్రీమ్, మున్నేరు పరీవాహకం, ప్రకాశం బ్యారేజీ, డౌన్ స్ట్రీమ్, కృష్ణా కుడి, ఎడమ కాల్వలు, గుంటూరు చానల్, పోలవరం రైట్ మెయిన్ కెనాల్, పాలేరు, మూసీ పరీవాహకం, నాగార్జునసాగర్ టెయిల్పాండ్ల కింద పరికరాలను అమర్చాలని భావిస్తున్నామని.. గత వారం కృష్ణా డెల్టా, ప్రకాశం బ్యారేజీ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపింది. అధికంగా వాడుకున్నారు.. ఇక 2016–17లో ఇరు రాష్ట్రాల నీటి వినియోగంపైనా బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మరో లేఖ రాసినట్లు తెలిసింది. తాము చేసిన కేటాయింపుల కంటే సాగర్, శ్రీశైలంలో ఇరు రాష్ట్రాలు అధిక వాటా వినియోగించుకున్నాయని అందులో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు గతంలో కృష్ణాబోర్డు చేసిన నీటి కేటాయింపులు జనవరి 20 వరకే ఉన్న నేపథ్యంలో.. తర్వాతి నీటి అవసరాలను నిర్ణయించేందుకు, టెలీమెట్రీ నిధుల విడుదల అంశాలను చర్చించేందుకు సంక్రాంతి తర్వాత బోర్డు సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
శ్రీశైలంలో టెలీమెట్రిపై బోర్డు దృష్టి
- 29న ప్రాజెక్టు పరిధిలో పర్యటన సాక్షి, హైదరాబాద్ :కృష్ణా నదీ జలాల వినియోగ, విడుదల లెక్కలు పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 29న శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో పర్యటించాలని నిర్ణయించింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల్లో చుక్క నీటికి కూడా తేడాలు రాకుండా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద టెలీమెట్రీ విధానాన్ని తీసుకువచ్చేందుకు సిధ్దమైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని ఇరు రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు గురువారం బోర్డు ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. సాగర్, శ్రీశైలం సహా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా, కల్వకుర్తి, సాగర్ కుడి, ఎడమ కాల్వలు, ఏఎంఆర్పీ సహా మొత్తంగా 14 పాయింట్లలో రిజర్వాయర్ల లెవల్, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో ప్రవాహాలను గణించేందుకు వీలుగా టెలీమెట్రో విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే సాగర్ పరిధిలో తన పర్యటన ముగించింది. రెండో విడతగా శ్రీశైలం పరిధిలో పర్యటించి ఎక్కడెక్కడ టెలీమెట్రీని అమలు చేయాలన్న దానిపై ఓ అంచనాకు రానుంది. ఇరు రాష్ట్రాలు సమ్మతిస్తే ఈ ఏడాది నుంచే నీటి ప్రవాహ లెక్కలను పక్కాగా తేలుస్తామని, టెలీమెట్రీ ఆధారంగా వినియోగం, పంపకాలపై నిర్దిష్ట అంచనాకు వస్తామని లేఖలో వెల్లడించింది.