సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆయకట్టుకు రావాల్సిన జలాలకు మార్గంమధ్యలోనే గండి పడుతోంది. 19.5 టీఎంసీలు రావాల్సి ఉండగా, ఏటా 5 టీఎంసీలకు మించి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ కాల్వకు వస్తున్న జలాలను శాస్త్రీయ పద్ధతిలో లెక్కించడానికి ఐదు చోట్లలో టెలీమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న అభిప్రాయానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సబ్ కమిటీ వచి్చంది. కృష్ణా బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై మెంబర్ కన్వీనర్‌గా, ఏపీ, తెలంగాణ నుంచి ఒక్కో ఇంజనీర్ సభ్యులుగా ఉన్న బోర్డు సబ్ కమిటీ ఇటీవల సుంకేశుల, ఆర్డీఎస్, జూరాల ప్రాజెక్టులను సందర్శించింది.
ఈ నేపథ్యంలో తుంగభద్ర జలాశయం నుంచి ఆర్డీఎస్ కాల్వకు నీళ్లు విడుదల చేసే రెగ్యులేటర్ వద్ద, కర్ణాటకలో 43 కి.మీ ప్రయాణించి తెలంగాణ సరిహద్దులకు ఆర్డీఎస్ కాల్వ చేరుకునే పాయింట్ వద్ద, తుమ్మిళ్ల ఎత్తిపోతల దగ్గర, సుంకేశుల జలాశయంతో పాటు ఈ జలాశయం నుంచి కేసీ కాల్వకు నీటి సరఫరా చేసే రెగ్యులేటర్ వద్ద టెలిమెట్రీ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా సూచిస్తూ సబ్ కమిటీ త్వరలో కృష్ణా బోర్డుకు నివేదిక సమర్పించనుంది.
దీంతో తుంగభద్ర డ్యాం నుంచి ఎన్ని నీళ్లు ఆర్డీఎస్ కాల్వకు విడుదల చేస్తున్నారు? అందులో ఎన్ని నీళ్లు రాష్ట్ర సరిహద్దులకు చేరుతున్నాయి? తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా తుంగభద్ర నది నుంచి ఏ మేరకు నీళ్లను ఆర్డీఎస్ కాల్వకు మళ్లిస్తున్నారు? సుంకేశుల జలాశయానికి ఎన్ని నీళ్లు వస్తున్నాయి ? సుంకేశుల నుంచి ఏ మేరకు నీటిని కేసీ కాల్వకు తరలిస్తున్నారు ? అన్న విషయాలపై స్పష్టత రానుంది. త్వరలో జరగనున్న తుంగభద్ర బోర్డు సమావేశంలో ఈ సబ్ కమిటీ సిఫారసుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment