శ్రీశైలంలో టెలీమెట్రిపై బోర్డు దృష్టి
Published Wed, Aug 24 2016 6:54 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
- 29న ప్రాజెక్టు పరిధిలో పర్యటన
సాక్షి, హైదరాబాద్ :కృష్ణా నదీ జలాల వినియోగ, విడుదల లెక్కలు పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 29న శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో పర్యటించాలని నిర్ణయించింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల్లో చుక్క నీటికి కూడా తేడాలు రాకుండా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద టెలీమెట్రీ విధానాన్ని తీసుకువచ్చేందుకు సిధ్దమైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని ఇరు రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు గురువారం బోర్డు ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది.
సాగర్, శ్రీశైలం సహా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా, కల్వకుర్తి, సాగర్ కుడి, ఎడమ కాల్వలు, ఏఎంఆర్‌పీ సహా మొత్తంగా 14 పాయింట్లలో రిజర్వాయర్ల లెవల్, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో ప్రవాహాలను గణించేందుకు వీలుగా టెలీమెట్రో విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే సాగర్ పరిధిలో తన పర్యటన ముగించింది. రెండో విడతగా శ్రీశైలం పరిధిలో పర్యటించి ఎక్కడెక్కడ టెలీమెట్రీని అమలు చేయాలన్న దానిపై ఓ అంచనాకు రానుంది. ఇరు రాష్ట్రాలు సమ్మతిస్తే ఈ ఏడాది నుంచే నీటి ప్రవాహ లెక్కలను పక్కాగా తేలుస్తామని, టెలీమెట్రీ ఆధారంగా వినియోగం, పంపకాలపై నిర్దిష్ట అంచనాకు వస్తామని లేఖలో వెల్లడించింది.
Advertisement