-శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి భారీగా చేరుతున్న నీరు
-2.28లక్షల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో
-శ్రీశైలం నుంచి సాగర్‌కు 9వేల క్యూసెక్కులు విడదల
-ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి తగ్గిన ప్రవాహాలు
సాక్షి, హైదరాబాద్
ఆలస్యంగా అయినా శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు స్థానిక ప్రవాహాలు తోడవడంతో ప్రాజెక్టుల్లో నీటి జోరు కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వచ్చి చేరిన ప్రవాహాలతో శ్రీశైలంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. మూడు రోజుల్లోనే శ్రీశైలానికి సుమారు 50టీఎంసీల నీరు రాగా,2.28లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. అయితే ఎగువ కర్ణాటకలోని నారాయణపూర్, ఆల్మట్టి సహా రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టులకు క్రమంగా ఇన్‌ఫ్లోలు తగ్గుతుండటంతో శ్రీశైలానికి వరద కొద్దిమేర తగ్గే అవకాశాలున్నాయని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది.
శ్రీశైలంలోకి 50టీఎంసీల నీరు..
కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి వచ్చిన నీటినంతా దిగువకే వదిలేస్తుండటంతో గడిచిన నాలుగు రోజులుగా శ్రీశైలంలో ప్రవాహాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. నాలుగు రోజుల కింద 12వేల క్యూసెక్కుల మేర నీటి ప్రవాహాలుండగా ఆ తర్వాతి నుంచి 2లక్షలకు పైగా ప్రవాహాలు వస్తున్నాయి. ఆదివారం సైత ం 2,28,189 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు వాస్తవ నీటి మట్టం 215.8టీఎంసీలు కాగా ప్రస్తుతం 95టీఎంసీల మేర నీరు చేరింది.
ఆదివారం రాత్రికి ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. మూడు రోజుల కిందట కేవలం ప్రాజెక్టులో 45 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా ఉధృతంగా వచ్చిన ప్రవాహాల కారణంగా 50 టీఎంసీల కొత్త నీరు చేరినట్లయింది. కాగా శ్రీశైలానికి ఆశించినంత నీరు వస్తున్న నేపథ్యంలో నాగార్జున కుడి కాల్వ కింద కృష్ణా పుష్కరాల అవసరాలకు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాలన్న బోర్డు ఆదేశాల నేపథ్యంలో ఏపీ రంగంలోకి దిగింది. ఆదివారం నుంచి 9,386 క్యూసెక్కుల నీటిని దిగువ సాగర్‌కు వదులుతోంది.
ఎగువన తగ్గిన ప్రవాహాలు..
ఎగువ కర్ణాటకలో వ ర్షాలు తగ్గుముఖం పట్టేయడంతో ఆల్మట్టి, నారాయణఫూర్లో ప్రవాహాలు తగ్గాయి. నాలుగు రోజుల కిందట వరకు 2లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు ఉండగా ఆదివారం అవి 1.62లక్షలకు తగ్గాయి. ఆల్మట్టి వాస్తవ నీటి మట్టం 1705అడుగులు కాగా ప్రస్తుతం 1700 అడుగులకు నీరు చేరింది. 129.7టీఎంసీలకు గానూ 108.08 టీఎంసీ నీటి లభ్యత ఉంది. ప్రాజెక్టులోకి 1,62,706 క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగుతుండ గా అంతే నీటిని దిగువ నారాయణపూర్‌కు వదులుతున్నారు. నారాయణపూర్ సైతం నిండుగా ఉండటంతో ప్రాజెకు టనుంచి 1,62,466 టీఎంసీల నీటిని దిగువ కు వదులుతున్నారు. ఆ నీరంతా దిగువన జూరాలకు వస్తోంది. జూరాల సైతం నిండుగా ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా శ్రీశైలానికి వదులుతున్నారు.