ఉధృతంగా కృష్ణమ్మ... మహోగ్రంగా గోదారి  | Srisailam Project Heavy Flood Water To Krishna | Sakshi
Sakshi News home page

ఉధృతంగా కృష్ణమ్మ... మహోగ్రంగా గోదారి 

Published Sat, Aug 18 2018 1:05 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

Srisailam Project Heavy Flood Water To Krishna - Sakshi

నిండు కుండలా ఉన్న శ్రీశైలం రిజర్వాయర్‌

సాక్షి, హైదరాబాద్‌ : కృష్ణమ్మ వరద ఉధృతి కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. శ్రీశైలం వాస్తవ నిల్వ 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నిల్వలు 181.832 టీఎంసీలకు చేరుకున్నాయి. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 3,19,106 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల, పవర్‌ హౌస్‌ల ద్వారా నాగార్జునసాగర్‌కు 1,04,392 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగుతుందన్న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అంచనాల నేపథ్యంలో.. శనివారం శ్రీశైలం జలాశయం నిండే అవకాశం ఉంది. శనివారం లేదా ఆదివారం శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి.

మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్నవర్షాలకు పెన్‌గంగ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు నదులు ఉప్పొంగడంతో గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. శుక్రవారం భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం 47.80 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 48.4 అడుగులకు చేరడంతో అక్కడా మొదటి ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. బ్యారేజీ 175 గేట్లు ఎత్తేసి 12,10,870 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. గోదావరికి ఈ సీజన్‌లో ఇప్పటివరకూ వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శనివారం రాత్రికి గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

కృష్ణమ్మ ఉరకలు 
పశ్చిమ కనుమల్లో కురిసిన వర్షాలకు కృష్ణాలో వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టిలోకి 1.40 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్‌లోకి 1.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. ఇప్పటికే ఆ జలాశయాల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాశయాల్లోకి శనివారం వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. జూరాల ప్రాజెక్టులోకి 1.62 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.70 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు తుంగభద్రలో వరద ఉధృతి తగ్గింది. 1.60 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 1.30 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, తుంగభద్ర జలాశయాల నుంచి విడుదల చేసిన జలాలు శ్రీశైలం జలాశయాన్ని చేరుతున్నాయి. గత ఆరు రోజులతో పోల్చితే శుక్రవారం ప్రకాశం బ్యారేజీలోకి వరద ప్రవాహం తగ్గింది. బ్యారేజీలోకి 12,196 క్యూసెక్కులు చేరుతుండగా.. 8,752 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేసి మిగతా 3,444 క్యూసెక్కులను కడలిలోకి వదిలారు. 

ఉప్పొంగిన ఉప నదులు 
గతేడాది గోదావరికి గరిష్టంగా వచ్చిన వరద ప్రవాహం 5,66,324 క్యూసెక్కులు మాత్రమే. ఈ ఏడాది నది పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉప నదులు ఉప్పొంగడంతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. పెన్‌గంగ, శబరి, ఇంద్రావతి నదుల నుంచి రికార్డు స్థాయిలో వరద ప్రవాహం గోదావరికి చేరుతోంది. దాంతో శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి.. గంటగంటకూ వరద ఉధృతి పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం రెండు గంటలకు భద్రాచలం వద్ద వరద మట్టం 47.80 అడుగులకు చేరింది. ఈ వరద ధవళేశ్వరం బ్యారేజీకి చేరుతోంది.

ఉదయం 6 గంటలకు 7,47,252 క్యూసెక్కుల ప్రవాహం వస్తే, సాయంత్రం 6 గంటలకు అది 12,10,870 క్యూసెక్కులకు చేరింది. 2016 జూలై 13న ధవళేశ్వరం బ్యారేజీకి 14,70,903 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ఆ తర్వాత ఇదే గరిష్టం. వర్షాలు తెరిపి ఇవ్వడంతో భద్రాచలం వద్ద వరద నీటిమట్టం 47.4 అడుగులకు తగ్గింది. శనివారం రాత్రికి వరద తగ్గుముఖం పడుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. గురువారం ఉదయం ఆరు గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకూ 64.07 టీఎంసీల గోదావరి జలాలు కడలిపాలయ్యాయి. 

వంశధారలో తగ్గిన వరద 
ఒడిషాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వంశధార నదిలో వరద ఉధృతి తగ్గింది. దీంతో నదీ తీర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు గొట్టా బ్యారేజీలోకి 57,367 క్యూసెక్కులు రాగా.. సాయంత్రం ఆరు గంటలకు 24,940 క్యూసెక్కులకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగావళిలోనూ వరద ఉధృతి తగ్గడంతో తోటపల్లి బ్యారేజీ నుంచి విడుదల చేసే వరద ప్రవాహాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement