సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది జలాల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంలో జోక్యానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు నిరాకరించింది. దీనిపై ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ప్రతినిధులు కూర్చొని చర్చించుకోవాలని, నీటి వినియోగంపై రాష్ట్రాల అవగాహన మేరకు తాము పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటామని సూచించింది. నీటి వినియోగం లెక్కలు సమర్పించకపోవడం, బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులపై స్పష్టత లేకపోవడం, శ్రీశైలం విషయంలో తామిచ్చిన ఆదేశాల ధిక్కరణ తదితరాల అంశాల నేపథ్యంలో.. ఇరు రాష్ట్రాల మధ్య జోక్యంపై బోర్డు చేతులెత్తేసింది. బోర్డు నిర్ణయాన్ని కాదని కేంద్రం అనుమతితో తెలం గాణ ప్రభుత్వం శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులకన్నా దిగువన కూడా విద్యుదుత్పత్తి చేస్తోంది. దీంతో ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు బోర్డు సానుకూలత వ్యక్తం చేయలేదు.
శ్రీశైలం నీటి వాడకంపై నవంబర్ 15 తర్వాత చర్చిద్దామని చెప్పినా... ఇంతవరకు ఎలాంటి సమావేశం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద నీటి విడుదలపై స్పష్టత ఇవ్వాలని ఇటీవల రెండు రాష్ట్రాలు కృష్ణా బోర్డును కోరాయి. దీనిపై పార్లమెంట్ సమావేశాల వరకు సమావేశం ఏర్పాటు సాధ్యం కాదని తెలిపిన బోర్డు... తాజాగా శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాలు ఒక అవగాహనకు రావాలని, అలా వస్తేనే సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేసినట్లు తెలిసింది. రాష్ట్రాల అవగాహన మేరకు నీటి వాడకంపై పర్యవేక్షణ, నియంత్రణ చేస్తామని, అంతేతప్ప అనవసర జోక్యం చేసుకోలేమని తెలిపినట్లు బోర్డు వర్గాల సమాచారం. బోర్డు తాజా నిర్ణ యం నేపథ్యంలో... ఉమ్మడి సమావేశం నిర్వహణపై ఇరు రాష్ట్రాలు తర్జనభర్జన పడుతున్నాయి.
మీరే తేల్చుకోండి!
Published Sat, Dec 13 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM
Advertisement