* నేడు హైదరాబాద్‌లో కృష్ణా రివర్ బోర్డు భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కృష్ణా నది యాజమాన్య మండలి సోమవారం ఇక్కడ భేటీ కానుంది. కేంద్ర జల సంఘం కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి బోర్డు చైర్మన్ పాండ్యా, సభ్యుడు గుప్తాతో పాటు ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు హాజరుకానున్నారు. కృష్ణా నదిలో నీటి లభ్యత, దాని ఆధారంగా ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, వినియోగం తదితర అంశాలపై బోర్డు సమగ్ర వివరాలు సేకరించనుంది.
దీంతో పాటు బోర్డు నియంత్రణలో ఉంచాల్సిన ప్రాజెక్టులు, బోర్డు పర్యవేక్షణలో మాత్రమే ఉంచాల్సిన ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల నుంచి వ చ్చే ప్రతిపాదనలపై చర్చించనుంది. వివాదాల పరిష్కారంలో భాగంగా మంగళవారం నుంచి బోర్డు సభ్యులు ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులను సందర్శించనున్నారు. 6న బోర్డు సభ్యులు నాగార్జునసాగర్‌ను సందర్శించేఅవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాలకోసం నీటి విడుదలపై వివాదం జరుగుతున్న విషయం విదితమే.
నెల రోజుల క్రితం డెల్టాకు నీటి విడుదలలో తలెత్తిన వివాదంలో బోర్డు కల్పించుకొని నీటి విడుదల జరిగేలా చొరవ చూపింది. ప్రస్తుతం దీనిపై తమ అభ్యంతరాలు తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా జూన్‌లో డెల్టాకు నీటి విడుదలపై రాష్ట్రం అభ్యంతరం చెబుతోంది. తాగునీటి అవసరాలపేరుతో ఆంధ్రప్రదేశ్ ఆ నీటిని సాగుకోసం వాడుకుంటోందని, ఈ దృష్ట్యా డెల్టాకు నీటి విడుదలను ఆ సమయంలో కాకుండా మరో సమయానికి మార్చాలని రాష్ట్రం కోరనుంది. ఇక వీటితో పాటు కృష్ణా ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పు మేరకు కృష్ణానది నీటిలో ఉమ్మడి రాష్ట్రానికి 188 టీఎంసీల మిగులు జలాల వాటా దక్కింది.
ఈ నీటిని ఉమ్మడి రాష్ట్ర ప్రాజెక్టులకు వాడుకోవచ్చని తెలిపిన ట్రిబ్యునల్ ఏయే ప్రాజెక్టుకు ఎంత వాడుకోవాలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. కేవలం జూరాల ప్రాజెక్టుకు 7 టీఎంసీలు, తెలుగుగంగకు 25 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కెనాల్‌కు 4 టీఎంసీల మిగులు జలాలను వాడుకోవాలని స్పష్టంగా చెప్పిన ట్రిబ్యునల్ మిగతా ప్రాజెక్టులకు నీటి వాడకాన్ని తేల్చలేదు. దీంతో మిగులు జలాలను ఏయే ప్రాజెక్టులు.. ఎంతమేర వాడుకోవాలన్న దానిపై ఇరు రాష్ట్రాలు బోర్డును స్పష్టత కోరే అవకాశం ఉంది.
‘కృష్ణా బోర్డు’ ముందుకు సర్కారు అభ్యంతరాలు
Published Mon, Aug 4 2014 1:35 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement
Advertisement