సోమవారం వర్షానికి జలమయమైన రోడ్లు
సాక్షి,హైదరాబాద్ : ఒకవైపు క్యుములోనింబస్ మేఘాలు కుమ్మే శాయి. కుండపోతకు నగరం గజగజలాడింది. మరోవైపు నగర దాహార్తిని తీర్చే జంటజలాశయాలు వెలవెలబోయాయి. నగరంలోని ఏ రోడ్డుపై చూసినా నడుంలోతు వరకు నీరే... కానీ, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లలో కనీసం ఒక్క అడుగైనా నీటిమట్టం పెరగలేదు. రహదారులన్నీ గోదారులయ్యాయి. కానీ, నీటికాల్వలన్నీ మూసుకుపోయాయి.
ఇదీ సోమవారం కనిపించిన దృశ్యాలు. జూబ్లీహిల్స్, షేక్‌పేట్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యన 6.7 సెం.మీ. కుంభవృష్టి కురిసింది. శేరిలింగంపల్లి, మాదాపూర్ ప్రాంతాల్లోనూ రెండు గంటల్లో 6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల క్యుములోనింబస్ ప్రభావంతో కొన్నిచోట్ల కుండపోత వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు.
గతేడాది కంటే తక్కువే
ఉస్మాన్‌సాగర్(గండిపేట్) గరిష్టమట్టం 1,790 అడుగులకుగాను ప్రస్తుతం 1,762.300 అడుగులమేర మాత్రమే నీటినిల్వలున్నాయి. హిమాయత్‌సాగర్ గరిష్టమట్టం 1,763.500 అడుగులకుగాను ప్రస్తుతం 1,741 అడుగుల మేర నీటినిల్వలున్నాయి. ఈ సీజన్‌లో జూన్–సెపె్టంబర్ మధ్యకాలంలో జలాశయాల ఎగువ ప్రాంతాల్లోని చేవెళ్లలో 26 శాతం, శంకర్‌పల్లి మండలంలో 37 శాతం తక్కువ వర్షపాతం నమోదవడం కూడా నీటిమట్టాలు పెరగకపోవడానికి మరో కారణమని జలమండలి అధికారులు చెబుతున్నారు.
హిమాయత్ సాగర్
రోజురోజుకూ చిన్నబోతూ...
జంటజలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన జీవో 111 పరిధిలో ఉన్న సుమారు 84 గ్రామాల నుంచి జంటజలాశయాలకు వరదనీటిని చేర్చే కాల్వలు(ఇన్‌ఫ్లో చానల్స్) కబ్జాకు గురవడం, ఇటుకబట్టీలు, ఇసుక మాఫియాకు అడ్డాలుగా మారడం, ఫాంహౌస్‌లు, ఇంజనీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారడంతో దారులు మూసుకుపోయాయి. దీంతో జలాశయాలు రోజురోజుకూ చిన్నబోతున్నాయి.
దాహార్తి తీర్చడానికి..
నిత్యం ఈ రెండు జలాశయాల నుంచి జలమండలి 113 మిలియన్ లీటర్ల నీటిని నగర తాగునీటి అవసరాలకు తరలిస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం జంటజలాశయాల్లో ప్రస్తుతం డెడ్‌స్టోరేజి నిల్వలున్నాయి.
పానీ పరేషాన్ లేదు
గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న నాగార్జునసాగర్(కృష్ణా), ఎల్లంపల్లి(గోదావరి) జలాశయాల్లోకి ఇటీవల భారీగా వరదనీరు రావడంతో ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాలతో నిండుకుండల్లా మారాయి. నగరానికి నిత్యం కృష్ణా మూడు దశలు, గోదావరి మొదటి దశసహా జంటజలాశయాల నుంచి మొత్తంగా 2,115 మిలియన్ లీటర్ల నీటిని సేకరించి శుద్ధి చేసి నగరంలోని 9.80 లక్షల నల్లాలకు కొరత లేకుండా సరఫరా చేస్తున్నాం. గ్రేటర్‌కు మరో ఏడాదివరకు పానీ పరేషాన్ ఉండబోదని భావిస్తున్నాం.
– ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment