సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో నగరంలోని కళాసిగూడలో పాల ప్యాకెట్ కోసం చిన్నారి మౌనిక మ్యాన్‌హోల్‌లో పడిపోయి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇదే క్రమంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు.. కళాసిగూడ ఘటనలో జీహెచ్‌ఎంసీ చర్యలకు సిద్దమైంది. వర్క్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్‌పై సస్పెన్షన్ విధించింది. ఇక, ఈ ఘటనపై పూర్తి విచారణ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశించారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఇక, చిన్నారి మృతిపై బీజేపీ నేతలు స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మౌనిక మృతికి జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యమే కారణం. కాంట్రాక్టర్లకు జీహెచ్‌ఎంసీ సరిగా బిల్లులు ఇవ్వడం లేదు. మౌనిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. రోడ్లు తవ్వినప్పుడు కనీసం జాగ్రత్తలు పాటించడం లేదు. శాఖల మధ్య సమన్వయం లేదు’ అంటూ విమర్శలు గుప్పించారు
మరోవైపు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ పైన మెరుగు.. లోపల మురుగు. బయటకు వెళ్లినవారు ఇంటికొస్తారనే నమ్మకం లేదు. చిన్నారి ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Hyderabad Rains: మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి
Comments
Please login to add a commentAdd a comment