సూర్యాపేట : పేటవాసులకు తాగునీటి కష్టాలు తప్పేలాలేవు. ప్రతి ఏడాది వేసవిలో ఉండే ఇబ్బందులు ఈ సారి మాత్రం ముందే మొదలయాయ్యి. నీటి శుద్ధికోసం ఏటా రూ. 30లక్షలు చేస్తున్నట్లు మున్సిపల్ తాగునీటి సరఫరా విభాగం అధికారుల లెక్కలు చూపుతున్నా ఎలాంటి ఫలితం కనిపించడంలేదు. మూసీలో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి చేరడం.. నిత్యం చేపలవేట కొనసాగించడంతో నీరంతా మురికిగా మారుతోంది. ఈ నీటిలో దుర్వాసన వస్తోంది. దీనిని తాగడం మాట అటుంచితే కనీసం ఇతరఅవసరాలకు కూడా వినియోగించే పరిస్థితిలేదు. ప్రజలకు పరిశుద్ధమైన జలాలు అందిస్తామని అధికారులు, ప్రజాప్రతిని ధులు ఎన్నికల సమయంలో చేస్తున్న హామీలు నీటిమూటలుగా మిగిలిపోతున్నాయి. దీంతో పేట వాసులకు తాగునీటి తిప్పలు మొదలయ్యాయి. పట్టణంలో 1.05 లక్షల జనాభా ఉన్నట్లు అధికారికలెక్కలు చూపుతున్నాయి.
అదనంగా మరో 50 వేల మంది వ్యాపార, వాణిజ్యాల కోసం వస్తున్నారు. పట్టణంలోని 17 వార్డులకు మూసీ నీరు, 17 వార్డులకు సాగర్ జలాలు అందిస్తున్నారు. ఒక్కొక్కరికి 165 లీటర్ల నీరు అవసరం కాగా వీరందరికీ ప్రతిరోజూ 23 ఎమ్‌ఎల్‌డీల నీరు అవసరం ఉంటుంది. కానీ మూసీ నుంచి 13.13 ఎమ్‌ఎల్‌డీలు సరఫరా కావాల్సి ఉండగా కేవలం 09.01 ఎమ్‌ఎల్‌డీలు, సాగర్ కెనాల్ నుంచి 10.15 సరఫరా కావాల్సి ఉండగా కేవలం 05.41 ఎమ్‌ఎల్‌డీల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. అది కూడా మూడు రోజులకోసారి మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. ఈయేడు వర్షాలు సరిగా కురవకపోవడంతో ఎగువప్రాంతం నుంచి నీరు మూసీ రిజర్వాయర్‌లోకి ఎక్కువగా చేరలేదు. మూసీలో గరిష్ట నీటిమట్టం 645అడుగులు కాగా ప్రస్తుతం 607అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. ఇటీవల ఎంతోకాలం నుంచి మరమ్మతులకు నోచుకోని షటర్లను మరమ్మతు చేసేందుకు నీటిని విడుదల చేశారు. నవంబర్ నుంచి జూన్ 15 వరకు షటర్ల మరమ్మతులు పూర్తిచేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
610 అడుగుల మేరకు నీటిస్థాయి తగ్గితేనే షటర్లు మరమ్మతులు చేసేందుకు అవకాశం ఉన్నందు వల్ల అప్పటి దాకా నీటిని విడుదల చేశారు. డెడ్ స్టోరేజీ అంటే 605 అడుగులు మాత్రమే. 605 అడుగులకు నీటి మట్టం చేరితే దుర్గంధంతో కంపు కొట్టే నీరు మాత్రమే సరఫరా అవుతోంది. 590 అడుగుల దాకా పేట వాసులకు నీటి సరఫరా చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. కానీ ప్రస్తుతం దుర్వాసనతో కూడిన నీరు మాత్రమే సరఫరా అవుతోంది. కనీసం అవి నిత్యవసరాలకు వినియోగించే పరిస్థితి లేదని వాపోతున్నారు. మరో నాలుగు నెలలకు పైగా గడిస్తేగానీ వర్షాలు కురిసే అవకాశం లేదని పేట ప్రజలు తెలిపారు. ఇప్పటికే మూడురోజులకోసారి సరఫరా చేసే నీటిని వారం రోజులకు కూడా పెంచే అవకాశమున్నట్లు ఆందోళన చెందుతున్నారు.
లక్షలు వ్యయం.. ఫలితం శూన్యం
మున్సిపల్ తాగునీటి సరఫరా విభాగం నీటిశుద్ధి చేసేందుకు గాను ఏటా ఆళం కోసం రూ. 10లక్షలు, క్లోరిన్ గ్యాస్ కోసం రూ. 20లక్షలకుపైగా ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. కానీ ఎలాంటి ప్రయోజం చేకూరడంలేదు. పట్టణ ప్రజలకు మాత్రం మురుగునీరే సరఫరా చేస్తున్నారు.
సాగర్ కెనాల్ ద్వారా..
ఇక సాగర్ కెనాల్ ద్వారా ఏటా మార్చి 15 వరకు నీరు విడుదల చేస్తుండడంతో ఆ నీటిని పట్టణానికి సరఫరా చేస్తారు. సాగర్ కెనాల్ బంద్‌అయిన అనంతరం అనాజిపురం గాండ్ల చెరువును నింపుతారు. ఆ రిజర్వాయర్ నుంచి 45 రోజులు పట్టణానికి నీరు సరఫరా అవుతుంది. అంటే మే చివరి నాటికి కృష్ణా జలాలు 15 వార్డులకు సరఫరా అవుతాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు పడితేనే దోసపహాడ్ నుంచి పట్టణానికి నీటి సరఫరా అవుతుంది. లేకపోతే పట్టణానికి నీటి సరఫరా బంద్.
మూసీ రిజర్వాయర్ నింపేందుకు ప్రత్యామ్నాయం లేదా?
కాగా వర్షాలు సరిగా కురవకపోవడం.. షటర్ల మరమ్మతుల పేరిట నెల,రెండు నెలల పాటు నీరు విడుదల చేయడంతో డెడ్ స్టోరేజీకి చేరుకోనున్న మూసీ రిజర్వాయర్‌ను నింపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేవనే అధికారులు చెబుతున్నారు. కేవలం ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిస్తే తప్ప రిజర్వాయర్ నిండే అవకాశాలు లేవు.
సాగర్ కెనాల్ నుంచే రప్పించేందుకు ఏర్పాట్లు..
స్థానిక ఎమ్మెల్యే, రాష్ర్ట మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చొరవ తీసుకొని పేట వాసులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సాగర్ కెనాల్‌ను మార్చి 15 తర్వాత కూడా బంద్ చేయకుండా పట్టణానికి నీటి సరఫరా కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే అనాజిపురం గాండ్ల చెరువు రిజర్వాయర్ నిండి ఉండడంతో పాటు కెనాల్ కూడా వేసవిలో బంద్ కాకుండా వస్తే పట్టణ ప్రజలకు నీటినందింవచ్చని భావిస్తున్నారు.
మూసీ నుంచి బంద్ అయితే పట్టణమంతా దోసపహాడ్ నీటి సరఫరా..
మూసీ నుంచి వచ్చే నీరు మరోనెల రోజుల పాటు సరిపోతుందని, ఆ తర్వాత ఇప్పటికే 17 వార్డులకు సరఫరా చేస్తున్న దోసపహాడ్ నీటిని పట్టణానికంతటికీ సరఫరా చేసేందుకు ఇప్పటికే పొట్టిశ్రీరాములు సెంటర్ వద్ద కనెక్షన్ ఇచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సాగర్ కెనాల్ నుంచి నిరవధికంగా వేసవి అంతా నీరు విడుదలైతేనే పేట వాసులకు నీటి గండం తప్పేట్లు లేదు.
మరమ్మతులకు నోచని చేతిపంపులు...
పట్టణంలో సుమారు 479చేతిపంపులు ఉండగా సగానికిపైగా నిర్వహణలోపంతో పనిచేయడం లేదు. అధికారులు తాగునీటి సమస్యనుంచి గట్టెక్కించేందుకు వాటిని రిపేర్ చేయించేదిపోయి ఫ్లోరిన్ ఎక్కువగా ఉందనే సాకుతో వాటిని వదిలేశారు. వాటి మరమ్మతుల కోసం వచ్చిన డబ్బులు మాత్రం అధికారుల జేబుల్లోకి వెళ్లాయన్న ఆరోపణలున్నాయి.
ముక్కుపిండి నల్లాబిల్లుల వసూలు
నీటి సరఫరాలో శ్రద్ధచూపని అధికార యంత్రాంగం నల్లాబిల్లులు మాత్రం ముక్కుపండి వసూలు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో అధికారికంగా 14వేల నీటి కనెక్షన్‌లు ఉన్నాయి. ఇటీవల రూ. 200 ఓ కనెక్షన్ ఇవ్వడంతో అదనంగా మరో 500 కనెక్షన్లు పెరిగాయి. అయినప్పటికీ అధికారులు నీటి సరఫరాలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. పట్టణంలోని 7వేల కనెక్షన్ నంబర్ల వరకు బీపీఎల్ వినియోగదారులకు ప్రతి కనెక్షన్‌కు రూ. 80చొప్పున నల్లాబిల్లు వసూలు చేస్తున్నారు. ఇటీవల కొత్తగా నిర్మించిన గృహ యజమానుల నుంచి రూ. 100 వసూలు చేస్తున్నారు. ఇందిరమ్మ కాలనీలో సుమారు 3వేల మంది వద్ద నుంచి రూ. 80చొప్పున నల్లాబిల్లు తీసుకుంటున్నారు.
మూసీలో చేపల వేట..
మూసీ ప్రాజెక్టులో కొంతకాలంగా చేపల వేట కొనసాగిస్తున్నారు. దీంతో మూసీలో తక్కువ నీరు ఉండడం.. మత్స్యకారులు వలలతో చేపలు పడుతుండడంతో నీరు బురదమయంగా మారింది. అదే నీరు సూర్యాపేట పట్టణానికి సరఫరా అవుతోంది. దీంతో బురదనీటితోనే సరిపెట్టుకోవాల్సివస్తోంది.
తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తాం - వెంకటేశ్వరరావు, మున్సిపల్ డీఈ
తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తాం. మూసీ గేట్ల మరమ్మతు కోసం నీటిని విడుదల చేశారు. ఫిల్టర్ చేసి సరఫరా చేస్తున్నాం. రెండు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం.