ఆల్మట్టి నుంచి పులిచింతల దాకా కనిష్ట స్థాయిలో నీటి నిల్వ
రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ కనుమల్లో వర్షాలు
‘ఆల్మట్టి’లోకి ప్రారంభమైన వరద ప్రవాహం
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో జలాశయాలన్నీ ఖాళీ అయ్యాయి. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నుంచి రాష్ట్రంలోని పులిచింతల ప్రాజెక్టు వరకూ అన్ని జలాశయాల్లోనూ నీటి నిల్వ కనిష్ట స్థాయికి చేరింది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల పశ్చిమ కనుమలు, బేసిన్‌లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది ప్రధాన పాయలో వరద ప్రవాహం ప్రారంభమైంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి బుధవారం 7,490 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్‌లో 24.68 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
ఇది నిండాలంటే 105.04 టీఎంసీలు అవసరం. ఇక ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు. ప్రస్తుతం 24.2 టీఎంసీలు ఉన్నాయి. నారాయణపూర్ డ్యామ్ నిండాలంటే ఇంకా 13.42 టీఎంసీలు అవసరం. అంటే.. 118.46 టీఎంసీలు చేరితేగానీ ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండవు. ఆ రెండు జలాశయాలు నిండాక గేట్లు ఎత్తి దిగువకు వరద జలాలను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌కు దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు.
ప్రస్తుతం జూరాలలో 7.65 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మరో 2.01 టీఎంసీలు చేరితే అదీ నిండుతుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో 34.52 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం నిండాలంటే 181.29 టీఎంసీలు అవసరం. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్‌లో 122.85 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిండాలంటే 189.2 టీఎంసీలు అవసరం.
సాగర్ దిగువన రాష్ట్రంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ డెడ్ స్టోరేజీ స్థాయిలో 0.77 టీఎంసీలున్నాయి. అది నిండాలంటే 45 టీఎంసీలు అవసరం. కృష్ణా నదికి ప్రధాన ఉప నది అయిన తుంగభద్రపై నిర్మించిన మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర డ్యామ్‌లో 5.29 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తుంగభద్ర నిండాలంటే ఇంకా 100 టీఎంసీలు అవసరం.
Comments
Please login to add a commentAdd a comment