ఇందూరు ప్రాజెక్టులు ‘డెడ్’ | Hey Ram Nizamabad projects 'Dead'! | Sakshi
Sakshi News home page

ఇందూరు ప్రాజెక్టులు ‘డెడ్’

Published Fri, Apr 29 2016 1:28 AM | Last Updated on Tue, Oct 9 2018 4:48 PM

ఇందూరు ప్రాజెక్టులు ‘డెడ్’ - Sakshi

ఇందూరు ప్రాజెక్టులు ‘డెడ్’

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దుస్థితి ఇది!
రెండేళ్లుగా వర్షాల్లేక, వరద లేక ఇలా పూర్తిగా అడుగంటిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు. ఇప్పుడు 5.30 టీఎంసీల నీరు(డెడ్ స్టోరేజీ) మాత్రమే ఉంది. ప్రాజెక్ట్ నుంచి గత ఖరీఫ్‌లో ఆయకట్ట్టుకు నీరివ్వలేదు. రబీలో అదే పరిస్థితి. కనీసం తాగు నీటి పథకాలకు కూడా నీరందే పరిస్థితి లేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నిండితే తెలంగాణలోని 18.82 లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలమవుతుంది. ఇప్పుడు ఈ 18 లక్షల ఎకరాలు ఎడారిగా మారే ప్రమాదం నెలకొంది.

నిజామాబాద్‌లో 1,60,578, ఆదిలాబాద్‌లో 1,45,387, వరంగల్‌లో 4,71,478, కరీంనగర్‌లో 6,72,900, ఖమ్మంలో 1,28,914, నల్లగొండలో 2,87,508 ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టు వెలవెలబోతుండడంతో ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు.. నిజామాబాద్‌లో 19 ఎత్తిపోతలు, ఆదిలాబాద్ జిల్లాలో 19 ముంపు గ్రామాల ఎత్తిపోతలు ఉత్తిపోతలుగానే మిగిలాయి.
 
నిజామాబాద్ జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. 38 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇందూరుపై కరువు గజ్జకట్టింది. ప్రధాన ప్రాజెక్టులన్నీ డెడ్‌స్టోరేజీకి చేరాయి. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల కారణంగా ఖరీఫ్‌లో నిండా మునిగిన రైతన్న రబీకి రాం..రాం.. చెప్పాడు. చాలాచోట్ల భూగర్భజల నీటి మట్టం 22.4 మీటర్లకు పడిపోయింది. మంజీర నది ఏడారిని తలపిస్తుంది. తెలంగాణ జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే శ్రీరాంసాగర్ ఎండిపోయింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం దారుణంగా పడిపోయింది. వ్యవసాయ బావులు, బోర్లు అడుగంటిపోవడంతో తాగునీటి ఎద్దడి రోజురోజుకు తీవ్రమవుతోంది. జిల్లాలో కరువుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం
 - గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్
 
డెడ్‌స్టోరేజీకి శ్రీరాంసాగర్, నిజాంసాగర్.. ఎడారిగా మంజీర నది

* వట్టిపోతున్న ఎత్తిపోతల పథకాలు
* కరువు దెబ్బకు ఖరీఫ్, రబీలకు రైతులు దూరం
* జిల్లాలో తాగునీటికి కటకట.. కబేళాకు చేరుతున్న  పశువులు
* దారుణంగా పడిపోయిన భూగర్భ జలాల నీటిమట్టం

 
ఎడారిగా మంజీర..
కర్ణాటక ప్రాంతం నుంచి నిజామాబాద్ జిల్లాలోకి ప్రవహించే మంజీరా నది ఇలా ఎడారిని తలపిస్తోంది. జిల్లా రైతాంగానికి మంజీర, గోదావరి నదులే జీవనాధారం. రెంజల్ మండలం కందకుర్తి సమీపంలో హరిద్రా, గోదావరి నదులతో సంగమించి ప్రవహించే ఈ నది ద్వారా 58 టీఎంసీల నీరు లభ్యమవుతుంది. మంజీరా నది ఆధారంగా బుడ్మి, దామరంచ, హన్సా, కారేగావ్, కిష్టాపూర్, పోతంగల్, కుర్తి, పైడిమాల, సంగోజీపేట తదితర ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ నీళ్లు లేక బోసిపోతున్నాయి. మంజీర పరిస్థితే ఇలా ఉండడంతో దీనిపై ఆధారపడి నిర్మించిన శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.
 
ఒక్కో మనిషికి 80 లీటర్లే..
శీతాకాలం ప్రారంభం నుంచే జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. రిజర్వాయర్లు ఎండిపోవడం.. భూగర్భజలాలు అడుగంటి పోవడం జిల్లా ప్రజలకు శాపంగా మారింది. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్‌లు ఉన్నాయి. జిల్లాలో 6.25 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి రోజు వీరికి 38 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఒక్క మనిషికి 146 లీటర్ల నీటిని అందించాలి. కానీ ప్రస్తుతం 80 నుంచి 85 లీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.
 
‘ఉపాధి’ అంతంతే..
ఉపాధి హామీ పథకం అమలు అంతంతే ఉంది. బోధన్, మోర్తాడ్ మండలాల్లో ‘సాక్షి’ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఉపాధి కూలీల్లో కొందరికే పని లభిస్తోందని తేలింది. జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో 721గ్రామాలు, 1302 హ్యాబిటేషన్లలో 4,70,544 మందికి అధికారులు జాబ్‌కార్డులు మంజూరు చేశారు. అయితే గతవారం వరకు 604 గ్రామాలలో 1,65,961 మంది పనిచేయగా.. శుక్రవారం నాటికి వారి సంఖ్య ఒకేసారి 92,725 మందికి పడిపోయింది. కూలీలకు రూ.15.95 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
 
జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి ఇదీ
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నారు. ప్రధాన నీటి వనరులైన రఘునాథ, మంచిప్ప చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. అలీసాగర్ నుంచి నిజాంసాగర్ నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం 11,500 అడుగుల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నీరు వేగంగా తగ్గిపోతోంది. నీటి కోసం నిజామాబాద్ నగరంలో 3,600 బోర్లు వేశారు. నగర కార్పొరేషన్‌లో ప్రతి మనిషికి కనీసం 140 లీటర్ల నీరివ్వాలి. కానీ రోజు విడిచి రోజు 110 లీటర్ల నీరే ఇస్తున్నారు.
 
బోధన్ పట్టణంలో 35 వార్డులు ఉన్నాయి. పట్టణానికి ప్రధానంగా నీటిని బెల్లాల్ చెరువు నుంచి నీటిని అందిస్తున్నారు. 10 వేల కుళాయిలు ఉన్నాయి. రోజుకు 10 ఎంఎల్‌డీలు అవసరం. కానీ చెరువులో నీరు అందుబాటులో లేకపోవడంతో రెండు రోజులకు ఒకసారి నీటిని అందిస్తున్నారు.
 
ఆర్మూర్ పట్టణంలో 60 వేల జనాభా ఉంది. ఒక్కో వ్యక్తికి 135 లీటర్ల నీటి సరఫరా చేయాల్సి ఉండగా.. 58 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు.
 
కామారెడ్డి పట్టణంలో రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నారు. ప్రతి మనిషికి 150 లీటర్ల నీటిని అందించాల్సి ఉండగా 120  లీటర్లు ఇస్తున్నారు.
 
ఇక తండాల్లో నీటి కోసం కిలోమీటర్ల  మేర వెళ్తున్నారు. వాగులోని చెలిమ నీటితో దాహం తీర్చుకుంటున్నారు.
 
కబేళాలకు పశువులు..
జిల్లాలో గత ఆరునెలల కాలంలో ప్రధాన సంతలో వేల సంఖ్యలో పశువులు అమ్ముడుపోయాయి. కరువు, పశుగ్రాసం కొరత, నీళ్లు లేక రైతులు పశువులను అంగట్లో పెడుతున్నారు. కామారెడ్డి, సాటాపూర్, బాన్సువాడ, ఇందల్వాయి, బీబీపేట, పెద్దమల్లారెడ్డి, పిట్లం, నవీపేట్, నందిపేట్ తదితర సంతల్లో పశువులు అధికంగా అమ్ముడుపోయాయి. కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో గత నాలుగు నెలల్లో 500 వరకు పశువులను అమ్మేశారు.

దోమకొండ మండలం మాందాపూర్‌లో ఒకప్పుడు 100 జతల ఎడ్లు ఉంటే ప్రస్తుతం 10 జతలు కూడా లేవని స్థానికులు చెప్తున్నారు. రెతులు అమ్మేసిన పశువుల్లో 90శాతం పశువులు కబేళాలకు తరలుతున్నాయి. గత ఐదు నెలల కాలంలో 50 వేలకుపైగా పశువుల అమ్మకాలు సాగినట్లు అంచనా. జిల్లాలో 8 లక్షల పశువులు, మరో 8 లక్షల వరకు గొర్రెలు, మేకలు ఉన్నాయి. వీటి గ్రాసానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పశువులకు గ్రాసం, నీటి వసతి కోసం రూ.58.15 కోట్ల సాయం కావాలని కేంద్ర కరువు బందానికి నివేదిక ఇచ్చారు. కానీ ఇప్పటికీ  ఒక్కపైసా రాలేదు.
 
రోజుకు 15 కోట్ల నీళ్ల వ్యాపారం
నీటి సమస్య వ్యాపారులకు వరంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో అధికారికంగా వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులు ఒక్కో క్యాన్ (20లీటర్లు) ధర రూ.15ల నుంచి రూ.25లకు పెంచారు.  నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా నీళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారుగా 380ల వరకు వాటర్ ప్లాంట్లు ఉన్నా... కేవలం ఐదింటికీ మాత్రమే భారత ప్రమాణాల సంస్థ (బీఎస్‌ఐ) అనుమతి ఉంది.

మిగతా చోట్ల నాణ్యతా ప్రమాణాలను మచ్చుకైనా పాటించడం లేదు.  అయినా రూ.కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. రోజుకు రూ.15 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు అధికారుల అంచనా. మినరల్ వాటర్ పేరిట జనరల్ వాటర్ సరఫరా చేస్తూ వినియోగదారులకు లేని రోగాలను అంటగడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీఎస్‌ఐ నిబంధనలను పాటించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
 
ఖరీఫ్, రబీలకు రైతులు దూరం
గడచిన ఖరీఫ్‌లో జిల్లాలో 4,18,100 హెక్టార్లలో పంటలు సాగు చేస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు.. 1.40 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయాలని నిర్ణయించారు. అత్యధికంగా 1.50 లక్షల హెక్టార్లలో వరి, 1.50 లక్షల హెక్టార్లలో సోయా సాగు చేస్తారని భావించారు. 55,000 హెక్టార్లలో మొక్కజొన్న, 15,000 హెక్టార్లలో పత్తి సాగు అవుతుందని అంచనా వేశారు. అయితే వర్షాల్లేక రైతులు 53 శాతం సాగుతోనే సరిపెట్టారు. రబీ విషయానికొస్తే 2,03,900 హెక్టార్లలో వివిధ పంటలు వేస్తారని అంచనా వేయగా...81,768 హెక్టార్లలోనే  పంటలు సాగయ్యాయి.
 
సరిపడే నిధులున్నాయి
జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా మొదట్నుంచీ ముందుచూపుతో వ్యవహరిస్తున్నాం. ముందస్తుగా పం పిన ప్రతిపాదనల మేర కు ప్రభుత్వం కూడా సరిపడ నిధులు విడుదల చేసింది. తాగునీటి సమస్య ఉండే గ్రామాలను గు ర్తించి రైతుల నుంచి వ్యవసాయ బావులు, బోర్లు అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేస్తున్నాం. మారుమూల గ్రామాలు, తండాలకు ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో సీఆర్‌ఎఫ్, నాన్ సీఆర్‌ఎఫ్ కింద వచ్చిన రూ.7 కోట్లు ఖర్చు చేశాం. ప్రభుత్వ ఆదేశాలు, ప్రజాప్రతిని ధుల సూచనల మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ నీటి సమస్యను పరిష్కరిస్తున్నాం.    
- ఎ.రవీందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్, నిజామాబాద్
 
మేత లేక పశువులను అమ్ముకుంటున్నారు
పశువులకు మేత కరువైంది. పశు పోషణ భారంగా మారింది. అందుకే రైతులు పశులను పోషించలేక  అమ్మేస్తున్నారు. గడ్డి విత్తనాల సరఫరా లేదు.  పశువులను వ్యాపారులు తక్కువ ధరలకు కొంటున్నారు. పంటలు పండక ఇప్పటికే నష్టపోయిన  రైతులు.. పశువులకు ధరలు పలకకపోవడంతో మరింత నష్టపోతున్నారు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి.
- దుబాస్ రాములు, రైతు సంఘం నేత
 
నీళ్లకు చాలా తఖీలీబు ఉన్నది
మా వజ్జపల్లి తండాలో బోరు బావులు లేవు. ఉన్న ఒక్క చేతి పంపు ఎండిపోయింది. నీళ్ల ట్యాంకుకు నీళ్లు సరఫరా చేసే బోరు ఎత్తి పోయింది. తాగునీళ్లకు చాలా తఖీలీబు అయితుంది. ప్రైవేటు బోరులు కిరాయికి తీసుకున్నరు. కానీ అవి కూడ సన్నం అస్తున్నయి. ఇంకో బోరు వేస్తే బాగుంటది.
- బూలీ బాయి, వజ్జపల్లి తండా, గాంధారి మండలం
 
అడుగంటిన నిజాంసాగర్
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు ఇలా పూర్తిగా అడుగంటింది. ప్రాజెక్టు పరిధిలోని 2.53 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నిజామాబాద్ నగరంతో పాటు బోధన్ పట్టణం సహా 28 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందుతుంది. నిజాంసాగర్ సామర్థ్యం 58 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 0.30 టీఎంసీల నీరు(డెడ్‌స్టోరేజీ) మాత్రమే ఉంది.

ప్రాజెక్టులో నీరు మరో 15 రోజుల వరకే సరిపోతుంది. ఆ తర్వాత తాగునీటి కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. కామారెడ్డి డివిజన్‌లోని మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, కామారెడ్డి, తాడ్వాయి, గాంధారి, లింగంపేట, నాగిరెడ్డి పేట మండలాలు మినహా జిల్లాలోని అన్ని మండలాలకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రాజెక్టు కింద 283 ఉప కాలువల ద్వారా 1,771 కిలోమీటర్ల వరకు నీటి పంపిణీ ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement