మంజీర తీరం వెంట పొంచి ఉన్న ముప్పు
పల్లెలపై జంతువుల కరువు దాడి
ఊర్ల మీద పడుతున్న చిరుతలు, మొసళ్లు
తీరం వెంట 700 మొసళ్లు, 20కి పైగా చిరుతలు
బిక్కుబిక్కుమంటూ పల్లె జనం జీవనం
పరీవాహక పల్లె జనం.. ప్రమాదపుటంచున జీవనం సాగిస్తోంది. మంజీర నదిలో నీరు లేక... క్రూర జంతువులు సమీప పల్లెలపై దాడులు చేస్తున్నాయి. తాజాగా తుక్కాపూర్‌లో చిరుత సృష్టించిన కలకలం పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తు చేస్తోంది. మరికొన్ని పల్లెల్లోకి మొసళ్లు చొరబడుతున్నాయి. ఏకంగా క్రూర జంతువులు జనావాసంలోకి వచ్చి దాడులకు దిగుతున్నాయి. నదీ పరీవాహకం వెంట ఉన్న గ్రామాల వారు ఈ ఘటనలతో బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏ రకంగా ప్రమాదం పొంచి ఉందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మంజీర నదీ తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలకు ప్రాణ భయం పట్టుకుంది. జీవనది ఎండిపోవడంతో మొసళ్లు పంట పొలాల్లోకి జొరబడుతున్నాయి. సమీప అటవీ ప్రాంతంలోని చిరుతలు పల్లెలపై కరువు దాడి చేస్తున్నాయి. జిల్లాలో 95 కిలో మీటర్ల మేర ఉన్న మంజీర పరీవాహక ప్రాంతంలో 700 మొసళ్లు, దాదాపు ఇరవైకిపైగా చిరుతలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. తీవ్ర కరువుతో ఆహారం, నీళ్లు దొరక్క క్రూర మృగాలు విలవిల్లాడుతున్నాయి. నీళ్లు, తిండి కోసం తీర ప్రాంత సమీపంలోని పల్లెల మీదకు అడవి జంతువులు ఎగబడుతున్నాయి. ఇటీవల కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలోకి చిరుత చొరబడడం కరువు దాడిగానే అటవీ అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి దాడు లు మరిన్ని జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. మహారాష్ర్టలోని బాలాఘాట్ కొండల్లో పుట్టి న మంజీర నది కర్ణాటక మీదుగా మనూర్ మండలం గౌడ్‌గాం జన్‌వాడ వద్ద మెదక్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. మెదక్ జిల్లాలో 95 కిలోమీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 65 కిలో మీటర్ల మేరకు ప్రవహిస్తుంది. నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తుంది. దాదాపు 30 టీఎంసీల సామర్థ్యం గల సింగూరు ప్రాజెక్టు ఇప్పటి వరకు ఎండిపోలేదు.
మొదటి నుంచి మొసళ్ల పెరుగుదలకు అనుకూలంగా ఉన్న మంజీర తీరంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొసళ్ల సంరక్షణ చర్యలు చేపట్టడంతో ఇటీవలి కాలంలో మొసళ్ల సంతానం భారీగా పెరిగింది. కల్పగూరు మంజీర బ్యారేజీ నుంచి సింగూర్ డ్యాం వరకున్న పరీవాహక ప్రాంతంలో 583 మొసళ్లు ఉన్నట్టు అటవీ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సింగూర్ డ్యాం వెనుక జలాల్లో మరో 150 వరకు మొసళ్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మంజీర ఎండిపోనందున మొసళ్లతో ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ ప్రస్తుతం తీవ్ర కరువు నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టులో కేవలం 1.1 టీఎంసీలు, సంగారెడ్డి మండలం కల్పగూరు మంజీర బ్యారేజ్ వద్ద కేవలం 0.01 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో నదిలో నీళ్లు లేక మొసళ్లు ఆహారాన్ని వెతుక్కుంటూ మొసళ్లు సమీప పొంట పొలాల్లోకి వస్తున్నాయి. మనూర్ మండలంలోని శాపూర్, గుడూర్, ఎన్‌జి హుక్రానా గ్రామాల పరిధిలోని మంజీర నది ఒడ్డున చెరుకు తోటల్లోకి వచ్చాయని అన్నారు. ఫలితంగా గ్రామస్థులు మొసళ్ల బారిన పడుతున్నారు. మంజీరలో చుక్క నీరు లేకపోవడంతో నీటిని వెతుక్కుంటూ చిరుతలు, ఎలుగు బంట్లు ఊళ్లలోకి వస్తున్నాయి. కుక్కలు, మేక లు, పశువుల మీద దాడులు చేస్తున్నాయి. చిరుతలు గ్రామ శివారుల్లో కనిపిస్తున్నాయి.
పశువులపై దాడి చేసిన ఘటనలు ఏడాది కాలంలో 15 వరకు జరిగినట్టు సమాచారం. పరీవాహక ప్రాంతమైన కొల్చారం మండ లం తుక్కాపూర్‌లోకి ఇటీవల చొరబడిన చిరుత తొమ్మిదిమందిని గాయపరిచిన విష యం తెల్సిందే. ఆహారం వెతుక్కుంటూ వ చ్చిందని అటవీ అధికారులు భావిస్తున్నారు.
నీళ్లు లేకే మొసళ్లు బయటికి..
ఎగువ మంజీర నదిలో దాదాపుగా 150 వరకు మొసళ్లు ఉండవచ్చని అటవీ శాఖ నారాయణఖేడ్ సబ్ రేంజ్ అధికారి విజయ్‌కుమార్ తెలిపారు. నది ఎండిపోవడంతో మొసళ్లు బయటికి వస్తున్నాయన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు తాము మూడు మొసళ్లను పట్టుకుని సంగారెడ్డి వద్ద మొసళ్ల (సాంచురికి) తరలించినట్టు పేర్కొన్నారు. నదిలో నీరుతగ్గిపోతున్నకొద్దీ మొసళ్లు దిగువన సింగూర్ ప్రాజెక్టు వద్దకు వెళతాయని, అక్కడక్కడా మడుగులో ఉన్న నీటిలోంచి మిగిలిన మొసళ్లు బయటికి వచ్చే అవకాశం ఉందన్నారు. మంజీర ఎండిపోవడం వల్లే నీళ్లు లేక చిరుతలు గ్రామాల మీదకు వస్తున్నాయని, కొల్చారం మండలం తుక్కాపూర్ సంఘటన అలాంటిదేనని డీఎఫ్‌ఓ శివాని డోగ్రా తెలిపారు.
భయం.. భయం
Published Sat, Dec 5 2015 12:05 AM | Last Updated on Tue, Oct 9 2018 4:44 PM
Advertisement