మెతుకు సీమకు జలసిరి
- రైతుల్లో ఆశలు
- నీళ్లతో సింగూరు, మంజీర కళకళ
- పొంగిపొర్లుతున్న నల్లవాగు
- వర్షాలతో చెరువులు, కుంటలు తొణికిస
- పెరగనున్న ఆయకట్టు సాగు
సాక్షి, సంగారెడ్డి:రెండేళ్లు కరువు బారిన పడిన మెతుకుసీమ.. ఇటీవలి వర్షాలతో జలసిరి సంతరించుకుంటోంది. వర్షాభావంతో జిల్లాలోని చెరువులు, కుంటలు ఎండిపోయి నెర్రెలు బారాయి. మంజీర నది జీరబోయింది. సింగూరు ప్రాజెక్టు, మంజీర బ్యారేజీలు గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. నల్లవాగు, ఘనపురం ప్రాజెక్టులు ఎండిపోయాయి. దీంతో సాగు, తాగునీటికి కటకట ఏర్పడింది. రబీలో పంటనష్టాన్ని చవిచూసిన రైతాంగం ఖరీఫ్‌లోనైనా వర్షాలు కురిస్తే బాగుండునని ఆశపడ్డారు. వరుణదేవుడికి పూజలు చేశారు.
మొత్తానికి ప్రస్తుతం జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలో సైతం వరదలు రావటంతో మంజీర నదిలోకి నీళ్లు వస్తున్నాయి. దీంతో సింగూరు ప్రాజెక్టు, మంజీర రిజర్వాయర్ నీళ్లతో నిండుతున్నాయి. తాగునీటికి కటకటలాడే నారాయణఖేడ్‌లో వర్షం నీటితో ప్రాజెక్టులు, చెరువులు కుంటలు కళకళలాడుతున్నాయి. నల్లవాగు ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. చెరువులు, కుంటలు సైతం నిండుతున్నాయి. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.మీ నేపథ్యంలో ఆయకట్టు సాగు విస్తీర్ణం ఖరీఫ్‌లో పెరిగే అవకాశం ఉంది.
ప్రాజెక్టులోకి మొదలైన వరద
జిల్లాలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవటంతో పాటు మంజీర నదిపై ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో వరదలు రావటంతో పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. వర్షాభావం కారణంగా సింగూరు ప్రాజెక్టు పూర్తి డెడ్‌స్టోరేజీకి చేరింది. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులోకి 6.4 టీఎంసీల వరద నీరు వచ్చింది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 30 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.4 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. మున్ముందు ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు మరింత వచ్చే అవకాశముంది. దీనికితోడు ఈనెలలో వర్షాలు సమృద్దిగా కురుస్తాయని చెబుతున్నారు.
అదే జరిగితే మంజీరలోకి మరింత నీరు చేరుకుంటుంది. కాగా, సంగారెడ్డి మండలం కల్పగూరులోని మంజీర రిజర్వాయర్‌లోకి 0.50 టీఎంసీల నీళ్లు వచ్చి చేరాయి. రిజర్వాయర్ పూర్తిస్తాయి నీటి సామర్థ్యం 1.5 టీఎంసీ. నల్లవాగు ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 1,493 అడుగులు కాగా ప్రాజెక్టులో పూర్తిగా నిండింది. దీంతో ప్రాజెక్టు కింద ఉన్న పొలాలకు సాగునీరు విడుదల చేస్తున్నారు. పాపన్నపేట మండలంలోని ఘనంపురం ప్రాజెక్టులోకి మాత్రం పెద్దగా నీళ్లు చేరలేదు.
నీటితో చెరువులు కళకళ
జిల్లాలో గత నెలలో సాధారణ వర్షపాతం 211 మిల్లీమీటర్లు కాగా, 200 మి.మీ. పైగా వర్షం కురిసింది. ఈ నెలలో వర్షాలు బాగానే కురుస్తున్నాయి. మరోపక్క మిషన్ కాకతీయ కింద చెరువుల్లో పూడికతీత తీయటంతో వాటిల్లో గతంలో కంటే ఎక్కువగా నీళ్లు నిల్వ ఉంటున్నాయి. ఇటీవల పూర్తిగా ఎండిపోయిన అన్నసాగర్ పెద్ద చెరువు ప్రస్తుతం నీళ్లతో నిండుగా ఉంది. అలాగే నారాయణఖేడ్ మండలం గంగాపూర్‌లోని ర్యాకల్ చెరువు పూర్తిగా నిండింది. జిల్లాలో మొత్తం 7,186 చెరువులు ఉండగా వీటిలో 105 చెరువులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. 153 చెరువుల్లో 75 నుంచి 100 శాతం నీళ్లు ఉండగా 554 చెరువుల్లో 75 శాతం నీళ్లు ఉన్నాయి. 456 చెరువుల్లో 50 శాతం, 5,918 చెరువుల్లో 25 శాతం మేర నీళ్లు ఉన్నాయి. దీంతో రైతులు చెరువు కట్ట కింద భూముల్లో సాగుకు సిద్ధమవుతున్నారు.