jalasiri
-
ఎన్నికల నాటికి ఉత్తరాంధ్ర సుజలస్రవంతి
జలసిరికి హారతి కార్యక్రమానికి సీఎం శ్రీకారం సాక్షి, విశాఖపట్నం /విజయనగరం: 2019 ఎన్నికల్లోగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేసి గోదావరి నీటిని ఉత్తరాంధ్ర జిల్లాలకు తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. జలసిరికి హారతి కార్యక్రమాన్ని బుధవారం సీఎం ప్రారంభించారు. విశాఖ జిల్లా కశింకోట మండలంలో శారదానదికి, విజయనగరం జిల్లా చీపురుపల్లి వద్ద తోటపల్లి కాలువకు హారతి ఇచ్చారు. ముందుగా ఆయన శారదా నదిపై రూ.17 కోట్లతో నిర్మించిన ఆనకట్టను ప్రారంభించి నీళ్లు కిందకు వదిలారు. సుజలస్రవంతి ఫేజ్–1 కోసం పెదపూడి రిజర్వాయర్ పనులకు రూ.2022 కోట్ల అంచనాలతో జారీ చేసిన జీవోను సీఎం ఆవిష్కరించారు. జలసిరిలో అపశ్రుతి: ప్రకృతిని ఆరాధించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసిరికి హారతి కార్యక్రమంలో ఆదిలోనే అపశ్రుతి దొర్లింది. విశాఖ జిల్లా కశింకోట మండలంలో శారదానదికి హారతి ఇవ్వడం ద్వారా సీఎం జలసిరికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. పురోహితులు ఇందుకు హారతిని సిద్ధం చేస్తుండగా హారతి నుంచి మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే మంటలు ఆర్పినా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. తర్వాత అక్కడకు చేరుకున్న సీఎం చంద్రబాబు హారతి ఇవ్వకుండానే మొక్కుబడిగా కార్యక్రమం పూర్తిచేసి వెనుదిరగాల్సి వచ్చింది. బూట్లతో హారతినిచ్చిన సీఎం!: బుధవారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన జలసిరికి హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కాళ్లకు బూట్లు తొలగించకుండానే పాల్గొన్నారు. చివరకు వేదపండితులు, ఇతరుల సూచనలతో అక్కడే బూట్లు విప్పి మళ్లీ నమస్కరించి వెళ్లిపోయారు. -
కరువు కసిరింది..
నాడు జలసిరి... నేడు కంటతడి – అడుగంటిన భూగర్భ జలం.. – 750 అడుగుల్లో బోరు వేసినా కనిపించని నీటిచుక్క – కుటాలపల్లిలో బీడుగా మారిన భూములు – వలసదారి పడుతున్న ఆదర్శ గ్రామ రైతులు నల్లమాడ : మండల కేంద్రం నల్లమాడకు ఆరు కిలోమీటర్ల దూరంలో కొండగుట్టల నడుమ విసిరేసినట్లుగా ఉండే గ్రామం కుటాలపల్లి. 400కుపైగా కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో అందరూ కష్టజీవులే. ఐదేళ్ల క్రితం వరకు 20 అడుగుల లోతులోనే నీరు లభ్యమయ్యేది. రైతులతో పాటు రైతు కూలీలు కూడా భూమిని గుత్తకు తీసుకొని మల్బరీ, ఇతరత్రా పంటలు సాగుచేస్తూ మండలంలో ఆదర్శ రైతులుగా పేరు తెచ్చుకున్నారు. మల్బరీ సాగులో ఇక్కడి రైతులు మొదటి స్థానంలో ఉండేవారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చినా ఆదుకునేవారన్న పేరుంది. 150 కుటుంబాలు వలసబాట.. వరుసగా చోటుచేసుకుంటున్న వర్షాభావ పరిస్థితుల వల్ల గత రెండు, మూడేళ్లలో గ్రామ పరిసరాల్లో భూగర్భ జలం పూర్తిగా అడుగంటిపోయింది. వెయ్యి అడుగుల వరకు బోరు వేసినా అరకొరగా కూడా నీరు లభ్యం కాని పరిస్థితి నెలకొంది. సాగునీటి కోసం రైతులు అధిక సంఖ్యలో బోర్లు వేసి నీరు పడకపోగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సాగునీరు లేకపోవడంతో వందల ఎకరాల భూములను బీడుగా వదిలేశారు. గ్రామంలో వందకు పైగా వ్యవసాయ బోర్లు ఉంటే 80 శాతం బోర్లలో నీరు అడుగంటిపోయాయి. దీంతో అప్పులు తీర్చే మార్గం కానరాక 150కి పైగా కుటుంబాలు హైదరాబాదు, బెంగుళూరు తదితర పట్టణాలకు వలస వెళ్లగా.. మరికొన్ని కుటుంబాలు ఆ బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నాయి. బీడు భూములను ఎప్పుడూ చూడలేదు మా గ్రామం చుట్టూ ఎప్పుడూ బీడు భూములను చూడలేదు. రెండేళ్ల క్రితం వర కు కూడా మల్బరీ, వరి ఇతరత్రా పంటలతో గ్రామం చుట్టూ పచ్చదనం పరుచుకొని ఉండేది. బోర్లలో నీరు లేకపోవడంతో ఇప్పుడు అన్నీ బీడులే కనబడుతున్నాయి. 80 శాతం బోర్లు ఎండిపోయాయి. ఉన్నవాటిలో కూడా అరకొరగా మాత్రమే నీరు వస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే గ్రామం ఖాళీ కాక తప్పదు. –గుడిసి చంద్రహాసరెడ్డి, రైతు, కుటాలపల్లి –––––––––– -
కనెక్షన్ల మంజూరులో జాప్యం వద్దు
కర్నూలు(రాజ్‌విహార్): వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో జాప్యం చేస్తే చర్యలు తప్పవని విద్యుత్ శాఖ ఏపీ ఎస్పీడీసీఎల్ కర్నూలు ఆపరేషన్స్ ఎస్ఈ జి. భార్గవ రాముడు హెచ్చరించారు. కొత్త బస్టాండ్ వద్ద ఉన్న విద్యుత్ భవన్లో శుక్రవారం ఎన్టీఆర్ జలసిరి పథకంపై సమీక్ష నిర్వహించారు. 971 దరఖాస్తులకుగాను 931 కనెక్షన్లకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు డబ్బు చెల్లినట్లు చెప్పారు. ఇందులో 776 మందికి కనెక్షన్లు ఇచ్చామని, మిగతా వారికి సర్వీసులు మంజూరు చేసినా సరఫరా అందించాల్సి ఉందని ఎస్ఈ తెలిపారు. ఆదోని డివిజన్లో ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, డోన్ డివిజన్లో డోన్ సబ్ డివిజన్, నంద్యాల డివిజన్లోని ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల సబ్డివిజన్లలో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య అధికంగా ఉందని, వీటిని ఈనెల 30వ తేదీలోగా మంజూరు చేయాలని ఆదేశించారు. సాధారణంగా ఏడీఈ వారంలో ఒక రోజు మాత్రమే సామగ్రి (మెటీరియల్) డ్రా చేసుకునే వీలుందని, ఎన్టీఆర్ జలసిరి కనెక్షన్లకు సంబంధించి ఎప్పుడైనా డ్రా చేసుకునే వీలు కల్పించామన్నారు. డ్వామా పీడీ పుల్లారెడ్డి, టెక్నికల్ డీఈఈ మహమ్మద్ సాధిక్, కర్నూలు డీఈ రమేష్, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
జిల్లాకు 15,800 జలసిరి బోరు బావులు మంజూరు
రైతు క్లబ్బుల ఏర్పాటుకు ప్రాధాన్యం చిరుధాన్యాల సాగు పెరగాలి నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ వాసుదేవన్ ఎల్.ఎన్.పేట: జిల్లాలో రైతాంగం అభివృద్ధికి నాబార్డు అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఇందులో భాగంగా సాగునీటి కొరత రానివ్వకుండా ఉండేందుకు జలసిరి పథకంలో జిల్లాలో 15,800 వ్యవసాయ బోరు బావులు మంజూరు చేశామని నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ ఎం.డి.వాసుదేవన్ చెప్పారు. మండలంలోని జాడుపేట గ్రామంలో శుక్రవారం మహిళా రైతు క్లబ్బులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే 400 జలసిరి బోరు బావులు తవ్వకం పూర్తయిందన్నారు. వర్షా కాలం రావడం, రైతుల పంట పొలాల్లో చేలు ఉండడం వల్ల మిగిలిన బోరు బావులు తవ్వకం నిలిచిపోందని చెప్పారు. పంట కోతలు జరిగిన వెంటనే మంజూరయిన లబ్ధిదారులందరికీ బోరు బావులు తవ్వకం పూర్తి చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతు క్లబ్బులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తలసరి ఆదాయంలో ఎల్ఎన్ పేట మండలం అట్టడుగున ఉండడంతో ఈ మండలంలోనే 11 మహిళా రైతు క్లబ్బులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. చిరుధాన్యాల సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో గత ఏడాది వరకు 500 హెక్టార్లలోనే చిరుధాన్యాల సాగు జరిగేదని, ఈ ఏడాది నుంచి 2 వేల హెక్టార్లలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. చిరుధాన్యాల పంటలు పండించే గిరిజన రైతులకు విత్తనాలు, సేంద్రియ ఎరువులు ఉచితంగా సర ఫరా చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఆమదాలవలస కృషివిజ్ఞాన శాస్త్రవేత్తలు డి.అనీల్‌కుమార్, దివ్యసుధ, ఆంధ్రాబ్యాంకు ఎల్డీఎం డి.వెంకటేశ్వరరావు, దివ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షడు యు.ప్రసాద్, మాజీ ఎంపీపీ కొమరాపు తిరుపతిరావు, ఎఈఓ బి.అప్పలనాయుడు, ఉద్యానశాఖ అధికారి మహాలక్ష్మి, రైతులు కర్నం చంద్రినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
మెతుకు సీమకు జలసిరి
రైతుల్లో ఆశలు నీళ్లతో సింగూరు, మంజీర కళకళ పొంగిపొర్లుతున్న నల్లవాగు వర్షాలతో చెరువులు, కుంటలు తొణికిస పెరగనున్న ఆయకట్టు సాగు సాక్షి, సంగారెడ్డి:రెండేళ్లు కరువు బారిన పడిన మెతుకుసీమ.. ఇటీవలి వర్షాలతో జలసిరి సంతరించుకుంటోంది. వర్షాభావంతో జిల్లాలోని చెరువులు, కుంటలు ఎండిపోయి నెర్రెలు బారాయి. మంజీర నది జీరబోయింది. సింగూరు ప్రాజెక్టు, మంజీర బ్యారేజీలు గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. నల్లవాగు, ఘనపురం ప్రాజెక్టులు ఎండిపోయాయి. దీంతో సాగు, తాగునీటికి కటకట ఏర్పడింది. రబీలో పంటనష్టాన్ని చవిచూసిన రైతాంగం ఖరీఫ్‌లోనైనా వర్షాలు కురిస్తే బాగుండునని ఆశపడ్డారు. వరుణదేవుడికి పూజలు చేశారు. మొత్తానికి ప్రస్తుతం జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలో సైతం వరదలు రావటంతో మంజీర నదిలోకి నీళ్లు వస్తున్నాయి. దీంతో సింగూరు ప్రాజెక్టు, మంజీర రిజర్వాయర్ నీళ్లతో నిండుతున్నాయి. తాగునీటికి కటకటలాడే నారాయణఖేడ్‌లో వర్షం నీటితో ప్రాజెక్టులు, చెరువులు కుంటలు కళకళలాడుతున్నాయి. నల్లవాగు ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. చెరువులు, కుంటలు సైతం నిండుతున్నాయి. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.మీ నేపథ్యంలో ఆయకట్టు సాగు విస్తీర్ణం ఖరీఫ్‌లో పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టులోకి మొదలైన వరద జిల్లాలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవటంతో పాటు మంజీర నదిపై ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో వరదలు రావటంతో పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. వర్షాభావం కారణంగా సింగూరు ప్రాజెక్టు పూర్తి డెడ్‌స్టోరేజీకి చేరింది. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులోకి 6.4 టీఎంసీల వరద నీరు వచ్చింది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 30 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.4 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. మున్ముందు ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు మరింత వచ్చే అవకాశముంది. దీనికితోడు ఈనెలలో వర్షాలు సమృద్దిగా కురుస్తాయని చెబుతున్నారు. అదే జరిగితే మంజీరలోకి మరింత నీరు చేరుకుంటుంది. కాగా, సంగారెడ్డి మండలం కల్పగూరులోని మంజీర రిజర్వాయర్‌లోకి 0.50 టీఎంసీల నీళ్లు వచ్చి చేరాయి. రిజర్వాయర్ పూర్తిస్తాయి నీటి సామర్థ్యం 1.5 టీఎంసీ. నల్లవాగు ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 1,493 అడుగులు కాగా ప్రాజెక్టులో పూర్తిగా నిండింది. దీంతో ప్రాజెక్టు కింద ఉన్న పొలాలకు సాగునీరు విడుదల చేస్తున్నారు. పాపన్నపేట మండలంలోని ఘనంపురం ప్రాజెక్టులోకి మాత్రం పెద్దగా నీళ్లు చేరలేదు. నీటితో చెరువులు కళకళ జిల్లాలో గత నెలలో సాధారణ వర్షపాతం 211 మిల్లీమీటర్లు కాగా, 200 మి.మీ. పైగా వర్షం కురిసింది. ఈ నెలలో వర్షాలు బాగానే కురుస్తున్నాయి. మరోపక్క మిషన్ కాకతీయ కింద చెరువుల్లో పూడికతీత తీయటంతో వాటిల్లో గతంలో కంటే ఎక్కువగా నీళ్లు నిల్వ ఉంటున్నాయి. ఇటీవల పూర్తిగా ఎండిపోయిన అన్నసాగర్ పెద్ద చెరువు ప్రస్తుతం నీళ్లతో నిండుగా ఉంది. అలాగే నారాయణఖేడ్ మండలం గంగాపూర్‌లోని ర్యాకల్ చెరువు పూర్తిగా నిండింది. జిల్లాలో మొత్తం 7,186 చెరువులు ఉండగా వీటిలో 105 చెరువులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. 153 చెరువుల్లో 75 నుంచి 100 శాతం నీళ్లు ఉండగా 554 చెరువుల్లో 75 శాతం నీళ్లు ఉన్నాయి. 456 చెరువుల్లో 50 శాతం, 5,918 చెరువుల్లో 25 శాతం మేర నీళ్లు ఉన్నాయి. దీంతో రైతులు చెరువు కట్ట కింద భూముల్లో సాగుకు సిద్ధమవుతున్నారు. -
‘ఉపాధి’లో జిల్లాను అగ్రగామిగా చేస్తాం
– ఎన్టీఆర్ జలసిరి, పంటసంజీవని అమలులో ప్రథమ స్థానం – సాక్షి ఇంటర్వ్యూలో జిల్లా నీటియాజమాన్య సంస్థ పీడీ కె. రమేష్ కడప కార్పొరేషన్: జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె. రమేష్ తెలిపారు. డ్వామా పీడీగా ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించిన ఆయన ఉపాధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. పంట సంజీవని, ఎన్టీఆర్ జలసిరి పథకాల అమలులో జిల్లాను ప్రథమ స్థానంలోకి తీసుకొచ్చిన ఆయన ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు . ప్రశ్న: గత ఏడాది పథకం అమలులో జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది కదా, ఈ ఏడాది దాన్ని ఎలా రీచ్ కావాలనుకొంటున్నారు? జవాబు: ఈ విషయంలో కొంత ఒత్తిడి ఉందిగానీ, అది సమష్టి కృషి వల్లే సాధ్యమైందని నేను భావిస్తున్నాను. ఉపాధి హామీ పథకాన్ని విస్తృత పరిచేందుకు జిల్లాలో అనేక వనరులు, అందుకు తగిన సిబ్బంది ఉన్నారు. అన్నింటినీ సద్వినియోగం చేసుకొని ముందుకు పోతాం. ప్రశ్న: జాబ్ కార్డులకు ఆధార్ లింకేజీ కార్యక్రమం ఎంత వరకు వచ్చింది? జవాబు: జాబ్‌కార్డులకు ఆధార్ లింకేజీ 83 శాతం పూర్తయింది. వంద శాతం ఆధార్ సీడింగ్ చేయుటకు ప్రయత్నిస్తున్నాము. ప్రశ్న: ఈ ఏడాది ఇప్పటివరకూ ఎంతమందికి వందరోజులు పనికల్పించారు. దీనివల్ల ఎన్ని కుటుంబాలు లబ్ధిపొందాయి? జవాబు: ఈ మూడు నెలల కాలంలో 6149 మందికి వందరోజులు పనికల్పించాము. ఒక్కో కుటుంబానికి సగటున 60.99 పనిదినాలు కల్పించాము. ప్రశ్న: ఉపాధి హామీ పథకం కింద ఎన్ని ఎకరాల్లో పండ్లతోటలు పెంచుతున్నారు, ఎంత ఖర్చు చేశారు? జవాబు: 45వేల ఎకరాల్లో పండ్ల తోటలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకూ 25వేల ఎకరాల్లో పండ్ల తోటలు పెంచడానికి అనుమతులు ఇచ్చాము. 16,794 ఎకరాల్లో పండ్లతోటలు పనులు జరుగుతున్నాయి. 1170 ఎకరాల్లో పూర్తయింది. ప్రశ్న: పంట సంజీవని పథకం కింద ఎన్ని సేద్యపు నీటి కుంటలు తవ్వుతున్నారు? జవాబు: జిల్లాలో 40వేల సేద్యపు నీటి కుంటలు తవ్వాలని టార్గెట్ ఇచ్చారు. అయితే లక్ష్యానికి మించి 66845 సేద్యపు నీటి కుంటల తవ్వకానికి అనుమతులు ఇచ్చాము. 1735 కుంటలు వివిధ దశల్లో ఉండగా, 9వేల కుంటలు పూర్తయ్యాయి. ప్రశ్న: చంద్రన్న బాట ద్వారా ఎన్ని కిలోమీటర్లు సీసీరోడ్లు నిర్మిస్తున్నారు? జవాబు: చంద్రన్నబాట పథకం ద్వారా జిల్లాలో 244 కిలోమీటర్లు సిమెంటు రోడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా, 177 కిలోమీటర్ల మేర పనులు మంజూరు చేశాము. 169 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్లు పూర్తయ్యాయి. ప్రశ్న: ఈ ఏడాది ఉపాధి హామీ పథకం అమలుకు ఎంత బడ్జెట్ కేటాయించారు? జవాబు: జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు ద్వారా కూలీలకు 97లక్షల పనిదినాలు కల్పించడానికి రూ.345కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఇందులో 40 శాతం అనగా రూ.110 కోట్లుమెటీరియల్ కాస్ట్ ఉంటుంది. ఈ నిధులను సీసీరోడ్లు, మొక్కల పెంపకం, డబ్లు్యబీఎం రోడ్లు, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం వినియోగిస్తున్నాము.. ప్రశ్న: ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం ఎలా సాగుతోంది? జవాబు: ఎన్టీఆర్ జలసిరి పథకం ద్వారా రైతుల పొలాల్లో బోర్లు వేసి, కరెంటు ఇచ్చి, మోటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం కింద 285 టార్గెట్ ఇవ్వగా 284 మంజూరు చేయడం జరిగింది. ఈ పథకం అమలులో కూడా మనమే మొదటి స్థానంలో ఉన్నాము. ప్రశ్న: చివరగా సోషల్ ఆడిట్లో రికవరీలు ఎలా ఉన్నాయి. సిబ్బంది సహకారం ఎంత? జవాబు: ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు సిబ్బంది పనిచేస్తే అభినందిస్తాం, లేదంటే ఒకట్రెండు ఛాన్సులచ్చి చర్యలు తీసుకుంటాము. సోషల్ ఆడిట్లో రికవరీలు బాగానే ఉన్నాయి.