మాట్లాడుతున్న వాసుదేవన్
రైతు క్లబ్బుల ఏర్పాటుకు ప్రాధాన్యం
చిరుధాన్యాల సాగు పెరగాలి
నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ వాసుదేవన్
ఎల్.ఎన్.పేట: జిల్లాలో రైతాంగం అభివృద్ధికి నాబార్డు అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఇందులో భాగంగా సాగునీటి కొరత రానివ్వకుండా ఉండేందుకు జలసిరి పథకంలో జిల్లాలో 15,800 వ్యవసాయ బోరు బావులు మంజూరు చేశామని నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ ఎం.డి.వాసుదేవన్ చెప్పారు. మండలంలోని జాడుపేట గ్రామంలో శుక్రవారం మహిళా రైతు క్లబ్బులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే 400 జలసిరి బోరు బావులు తవ్వకం పూర్తయిందన్నారు. వర్షా కాలం రావడం, రైతుల పంట పొలాల్లో చేలు ఉండడం వల్ల మిగిలిన బోరు బావులు తవ్వకం నిలిచిపోందని చెప్పారు.
పంట కోతలు జరిగిన వెంటనే మంజూరయిన లబ్ధిదారులందరికీ బోరు బావులు తవ్వకం పూర్తి చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతు క్లబ్బులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తలసరి ఆదాయంలో ఎల్‌ఎన్ పేట మండలం అట్టడుగున ఉండడంతో ఈ మండలంలోనే 11 మహిళా రైతు క్లబ్బులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. చిరుధాన్యాల సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో గత ఏడాది వరకు 500 హెక్టార్లలోనే చిరుధాన్యాల సాగు జరిగేదని, ఈ ఏడాది నుంచి 2 వేల హెక్టార్లలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. చిరుధాన్యాల పంటలు పండించే గిరిజన రైతులకు విత్తనాలు, సేంద్రియ ఎరువులు ఉచితంగా సర ఫరా చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఆమదాలవలస కృషివిజ్ఞాన శాస్త్రవేత్తలు డి.అనీల్‌కుమార్, దివ్యసుధ, ఆంధ్రాబ్యాంకు ఎల్‌డీఎం డి.వెంకటేశ్వరరావు, దివ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షడు యు.ప్రసాద్, మాజీ ఎంపీపీ కొమరాపు తిరుపతిరావు, ఎఈఓ బి.అప్పలనాయుడు, ఉద్యానశాఖ అధికారి మహాలక్ష్మి, రైతులు కర్నం చంద్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.