కరువు కసిరింది..
నాడు జలసిరి... నేడు కంటతడి
– అడుగంటిన భూగర్భ జలం..
– 750 అడుగుల్లో బోరు వేసినా కనిపించని నీటిచుక్క
– కుటాలపల్లిలో బీడుగా మారిన భూములు
– వలసదారి పడుతున్న ఆదర్శ గ్రామ రైతులు
నల్లమాడ : మండల కేంద్రం నల్లమాడకు ఆరు కిలోమీటర్ల దూరంలో కొండగుట్టల నడుమ విసిరేసినట్లుగా ఉండే గ్రామం కుటాలపల్లి. 400కుపైగా కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో అందరూ కష్టజీవులే. ఐదేళ్ల క్రితం వరకు 20 అడుగుల లోతులోనే నీరు లభ్యమయ్యేది. రైతులతో పాటు రైతు కూలీలు కూడా భూమిని గుత్తకు తీసుకొని మల్బరీ, ఇతరత్రా పంటలు సాగుచేస్తూ మండలంలో ఆదర్శ రైతులుగా పేరు తెచ్చుకున్నారు. మల్బరీ సాగులో ఇక్కడి రైతులు మొదటి స్థానంలో ఉండేవారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చినా ఆదుకునేవారన్న పేరుంది.
150 కుటుంబాలు వలసబాట..
వరుసగా చోటుచేసుకుంటున్న వర్షాభావ పరిస్థితుల వల్ల గత రెండు, మూడేళ్లలో గ్రామ పరిసరాల్లో భూగర్భ జలం పూర్తిగా అడుగంటిపోయింది. వెయ్యి అడుగుల వరకు బోరు వేసినా అరకొరగా కూడా నీరు లభ్యం కాని పరిస్థితి నెలకొంది. సాగునీటి కోసం రైతులు అధిక సంఖ్యలో బోర్లు వేసి నీరు పడకపోగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సాగునీరు లేకపోవడంతో వందల ఎకరాల భూములను బీడుగా వదిలేశారు. గ్రామంలో వందకు పైగా వ్యవసాయ బోర్లు ఉంటే 80 శాతం బోర్లలో నీరు అడుగంటిపోయాయి. దీంతో అప్పులు తీర్చే మార్గం కానరాక 150కి పైగా కుటుంబాలు హైదరాబాదు, బెంగుళూరు తదితర పట్టణాలకు వలస వెళ్లగా.. మరికొన్ని కుటుంబాలు ఆ బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
బీడు భూములను ఎప్పుడూ చూడలేదు
మా గ్రామం చుట్టూ ఎప్పుడూ బీడు భూములను చూడలేదు. రెండేళ్ల క్రితం వర కు కూడా మల్బరీ, వరి ఇతరత్రా పంటలతో గ్రామం చుట్టూ పచ్చదనం పరుచుకొని ఉండేది. బోర్లలో నీరు లేకపోవడంతో ఇప్పుడు అన్నీ బీడులే కనబడుతున్నాయి. 80 శాతం బోర్లు ఎండిపోయాయి. ఉన్నవాటిలో కూడా అరకొరగా మాత్రమే నీరు వస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే గ్రామం ఖాళీ కాక తప్పదు.
–గుడిసి చంద్రహాసరెడ్డి, రైతు, కుటాలపల్లి
––––––––––