Lift Irrigation Schemes
-
ఎత్తిపోతలకు గట్టిమేలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలను ప్రణాళిబద్ధంగా నిర్వహించడం ద్వారా ఆయకట్టుకు మరింత సమర్థవంతంగా నీళ్లందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఎత్తిపోతల పథకాల నిర్వహణలో కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనంచేసి.. మెరుగైన విధానాన్ని రూపొందించాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ విధానం ప్రకారం ఆయకట్టు పరిధిలోని రైతులతో సంఘాలను ఏర్పాటుచేసి ఆయా ఎత్తిపోతలను నిర్వహించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఐడీసీ) పరిధిలో రాష్ట్రంలో 1,117 ఎత్తిపోతల పథకాలున్నాయి. ఇందులో 916 పెద్ద ఎత్తిపోతల పథకాలు. 154 ఎత్తిపోతల పథకాలు మనుగడలో లేవు. చిన్న ఎత్తిపోతల పథకాలు 56 ఉండగా.. అందులో ఒక ఎత్తిపోతల మాత్రమే మనుగడలో లేదు. ఈ ఎత్తిపోతల పథకాల కింద 6,90,183.72 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ పథకాల పరిధిలో 3,70,635మంది రైతులు పంటలు సాగుచేసుకుంటున్నారు. నిర్వహణ లోపంవల్లే.. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. పెద్దపెద్ద మరమ్మతులూ చేయిస్తోంది. కానీ.. ఈ నిర్వహణ సక్రమంగా లేకపోవడంవల్ల తరచూ నీటి తోడకంలో సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్వహణ లోపాలను అధిగమించడం.. సమర్థవంతంగా ఎత్తిపోతలను నిర్వహించే విధానాలను రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఎత్తిపోతల నిర్వహణకు అమలుచేస్తున్న విధానాలను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. అత్యంత సమర్థవంతంగా ఎత్తిపోతలను నిర్వహించే విధానాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. చదవండి: పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పాదపూజ రైతు సంఘాలతో నిర్వహణ.. ఇక ఎత్తిపోతలను సమర్థవంతంగా నిర్వహించడానికి రూపొందించిన విధానం అమలు బాధ్యతను వాటి పరిధిలోని ఆయకట్టు రైతులకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీఎస్ఐడీసీ అధికారుల పర్యవేక్షణలో రైతులే ఎత్తిపోతలను నిర్వహించేలా విధానాన్ని రూపొందించనున్నారు. ఇది రైతుల్లో బాధ్యతను పెంచుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ బిల్లులతోపాటు పెద్దపెద్ద మరమ్మతులకు ప్రభుత్వం నిధులు ఇస్తుండటం.. నిర్వహణ బాధ్యతలను రైతులకే అప్పగించడంవల్ల ఎత్తిపోతల పథకాలు సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని నీటిపారుదలరంగ నిపుణులు చెబుతున్నారు. -
త్వరలోనే ఎత్తిపోతల పనులు: మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా ప్రజలు మంజీరా నదీ జలాలను తమహక్కుగా భావిస్తారని, సంగ మేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు చేపట్టడం ద్వారా ఈ హక్కును కాపాడుకోగలుగుతారని శుక్రవారం రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు శాసనసభలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, ఎం.భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు తదితరులు లేవనెత్తిన ఓ ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 11 మండలాల పరిధిలో ఉన్న 231 గ్రామాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్‌ఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లోని 8 మండలాలు, 166 గ్రామాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. సింగూరు బ్యాక్‌వాటర్ నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామన్నారు. ఆందోల్ నియోజక వర్గంలో సంగమేశ్వర, బసవేశ్వర, సింగూరు, కాళేశ్వరం ద్వారా కలిపి మొత్తం 1,74,673 ఎకరాలు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో 1,55,920 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. త్వరలో లిఫ్ట్‌లకు శంకుస్థాపన జరుగుతుందని, నాబార్డ్ ద్వారా నిధులు సమకూరనున్నాయని తెలిపారు. పురోగతిలో తెలంగాణనే మిన్న.. పురోగతి విషయంలో దేశం కన్నా రాష్ట్రమే ముందుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జీఎస్డీపీపై టీఆర్ఎస్ సభ్యుడు గాదరి కిశోర్‌కుమార్ వేసిన ఓ ప్రశ్నకు మంత్రి బదు లిస్తూ రాష్ట్రం ఏర్పడినప్పుడు అఖిల భారత స్థూల దేశీయ ఉత్పత్తిలో స్థూల రాష్ట్ర ఉత్పత్తి వాటా 4.06 శాతమని, 2020–21 నాటికి అది 4.97 శాతానికి చేరిందన్నారు. పరిశ్రమలు, తయారీ, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ప్రతిఏడాది జీఎస్డీపీ వాటా పెరుగుతోందని, దేశం కన్నా రాష్ట్రం ప్రగతిరేటు ఎక్కువగా ఉందని అన్నారు. పెద్దఎత్తున ప్రాజెక్టులు నిర్మించి, సాగునీరం దించడం, రైతుబీమా పథకం, రైతు రుణమాఫీ, మైక్రో ఇరిగేషన్ వంటి పురోగతి చర్య లు రాష్ట్ర ఆర్థికప్రగతికి కారణాలుగా మంత్రి తెలిపారు. -
కృష్ణా బోర్డుకు రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్
సాక్షి, అమరావతి: అపెక్స్ కౌన్సిల్ భేటీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు కేంద్ర జల సంఘానికి(సీడబ్ల్యూసీ) పంపారు. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ సీడబ్ల్యూసీ సోమవారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పీహెచ్ఆర్ (పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్) ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టుకు సాగునీరు.. కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని మరింత మెరుగ్గా సరఫరా చేసేందుకే ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వాటా నీటిని వాడుకోక ముందే.. ► విభజన చట్టాన్ని తుంగలో తొక్కి.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండానే తెలంగాణ సర్కార్ శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను 2015లో చేపట్టింది. ఇదే తరహాలో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచడం ద్వారా రోజుకు 0.4 టీఎంసీ, ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచడం ద్వారా రోజుకు 0.5 టీఎంసీ తరలించేలా పనులు చేపట్టింది. ► శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు 3 టీఎంసీలను తరలించేలా తెలంగాణ సర్కార్ కొత్తగా ప్రాజెక్టులు చేపట్టింది. సాగర్‌లో సరిపడా నీటి నిల్వలు ఉన్నప్పటికీ, దిగువన సాగునీటి అవసరాలు లేకపోయినా తెలంగాణ సర్కార్ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 796 అడుగుల నుంచే రోజుకు నాలుగు టీఎంసీలను తరలిస్తోంది. మొత్తంగా ఏడు టీఎంసీలను తరలిస్తుండటం వల్ల ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిపోతోంది. 841 అడుగుల్లో చుక్క నీరు రాదు – శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పీహెచ్ఆర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు 44 వేల క్యూసెక్కులు తరలించవచ్చు. కానీ గత పదేళ్ల రికార్డులను పరిశీలిస్తే.. ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి 15 నుంచి 20 రోజులు కూడా ఉండే అవకాశం లేదు. – శ్రీశైలంలో 854 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడు పీహెచ్ఆర్ ద్వారా కాలువలోకి ఏడు వేల క్యూసెక్కులే చేరుతాయి. 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే చుక్క నీరు కూడా రాదు. – తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు ఉన్నా సరే.. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు, చెన్నైలకు తాగునీటిని కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. – ఈ పరిస్థితిని అధిగమించడానికి ట్రిబ్యునల్ కేటాయింపు ద్వారా హక్కుగా రాష్ట్రానికి దక్కిన 512 టీఎంసీలను సమర్థవంతంగా వినియోగించుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున పీహెచ్ఆర్ దిగువన కాలువలోకి ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టింది. డీపీఆర్‌ను అధ్యయనం చేస్తున్న కృష్ణా బోర్డు – కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు అక్టోబర్ 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ అయ్యింది. – ఈ భేటీలో తెలంగాణ సర్కార్ లేవనెత్తిన అభ్యంతరాలను కొట్టిపారేస్తూ.. పాత ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు మరింత మెరుగ్గా నీళ్లందించడానికి, రాయలసీమ, చెన్నైకి తాగునీటి ఇబ్బందులను పరిష్కరించడానికే ఈ ఎత్తిపోతల చేపట్టామని సీఎం వైఎస్ జగన్ బలంగా వాదనలు వినిపించారు. కొత్తగా నీటిని నిల్వ చేయడానికి ఎలాంటి రిజర్వాయర్లు నిర్మించడం లేదని స్పష్టంగా తేల్చి చెప్పారు. – ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ గజేంద్రసింగ్ షెకావత్ కోరారు. ఇందులో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌ను గత నెల 16న రాష్ట్ర జల వనరుల శాఖ సీడబ్ల్యూసీకి సమర్పించింది. – రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఇదివరకే తేల్చి చెప్పింది. ఈ దృష్ట్యా దీనిపై అధ్యయనం చేస్తున్న కృష్ణా బోర్డు వారం రోజుల్లో డీపీఆర్‌ను ఆమోదిస్తూ నివేదిక ఇస్తుందని, అనంతరం సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇస్తుందని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ తర్వాత విభజన చట్టంలో నిబంధనల మేరకు రాయలసీమ ఎత్తిపోతలకు అపెక్స్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. -
'మేఘా' రికార్డు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత భారీ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అనతి కాలంలో పూర్తి చేయడంలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిర్ణీత గడువుకు ముందే పంప్‌హౌజ్‌లు, విద్యుత్ సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసి ఈ నెల 21న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రారంభోత్సవంలో గోదావరి నీటి ఎత్తిపోతలకు మార్గం సుగమం చేసింది. ముఖ్యంగా లింక్–1 లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎత్తిపోతల కేంద్రాలను, లింక్– 2లోని ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్ కేంద్రం ప్యాకేజీ–8లను రెండేళ్లలోనే సిద్ధం చేసి మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు నీటి తరలింపు ప్రక్రియకు రాచమార్గం పరిచింది. ప్రపంచంలోనే తొలిసారి.. కాళేశ్వరం ద్వారా రోజూ గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మిస్తున్న ఈ భారీ పథకంలో 22 ఎత్తిపోతల కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, అందులో 17 కేంద్రాల నిర్మాణాలను మేఘా చేపట్టింది. ఇందులో మొత్తం 120 మెషీన్లను (ప్రతి మెషీన్‌లోను ఒక పంపు, ఒక మోటారు ఉంటాయి) ఏర్పాటు చేస్తుండగా, అందులో 105 మెషీన్లను మేఘానే ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌజ్‌లను, ప్యాకేజీ–8 పనులను పూర్తి చేసి పాక్షికంగా నీటిని పంపింగ్ చేసేలా పనులు పూర్తి చేసింది. మొదటిదశలో 63 మెషీన్ల ఏర్పాటు లక్ష్యంగా ఎంఈఐఎల్ పనులు ప్రారంభించగా రెండేళ్ల కాలంలో 33 మెషీన్లను పంపింగ్‌కు సిద్ధం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ–8, ప్యాకేజీ–14లోని పంపుహౌజ్‌లు నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకాలుగా అమెరికాలోని కొలరాడో, ఈజిప్ట్‌లోని గ్రేట్ మేన్‌మేడ్ రివర్‌కు పేరు పొందగా, వీటి పంపు సామర్థ్యం హార్స్‌పవర్‌లోనే ఉంది. వీటి నిర్మాణానికి మూడు దశాబ్దాల సమయం పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో హంద్రీనీవా, దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, పట్టిసీమ, పురుషోత్తపట్నం వంటి ఎత్తిపోతల పథకాలు చేపట్టినా, 40 మెగావాట్ల సామర్థ్యం గల భారీ మెషీన్లను కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోనే ఉపయోగించారు. కానీ కాళేశ్వరంలో 139 మెగావాట్ల సామర్థ్యం గల పంపులను వినియోగిస్తున్నారు. తొలిదశలో 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు 4,992 మెగావాట్ల విద్యుత్ అవసరముండగా, ఇందులో 3,057 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ, అందులో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్మాణ పనులను ఎంఈఐఎల్ సిద్ధం చేసింది. ప్యాకేజీ–8లో ఆవిష్కృతం.. అద్భుతమైన పంపింగ్ స్టేషన్‌ను భూ ఉపరితలానికి 330 మీటర్ల లోతున మేఘా నిర్మించింది. 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్ పంపుల యూనిట్లను ఇక్కడ సిద్ధం చేసింది. ప్రతి పంపు మోటారు బరువు 2,376 మెట్రిక్ టన్నులు ఉందంటే ప్రతి యూనిట్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఈ పంప్ హౌజ్‌లో ప్రతి అంతస్తులోనూ 87,995 చదరపు అడుగుల కాంక్రీటు నిర్మాణం చేసింది. ట్రాన్స్ఫార్మర్ బేలు, కంట్రోల్ రూంలు రెండు చొప్పున, బ్యాటరీ రూం, మోటార్ రూమ్ ఒక్కొక్కటి చొప్పున నిర్మించగా, ఎల్టీ ప్యానెల్స్, పంప్ ఫ్లోర్, కంప్రెషర్లు కలిపి మొత్తం 4 అంతస్తుల్లో నిర్మించారు. ఈ పంపుమోటార్లను భూ అంతర్భాగంలో ఏర్పాటు చేసినందున భవిష్యత్తులో ఎలాంటి సాంకేతిక సమస్యలూ ఎదురుకాకుండా అత్యంత శ్రద్ధతో వీటి నిర్మాణాలు చేశారు. మొత్తం పనిలో 40 శాతం వాటా కింద బీహెచ్ఈఎల్, మోటార్లు, పంపులు, యంత్ర పరికరాలు, విడిభాగాలు రూపంలో సరఫరా చేయగా, వాటిని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ప్యాకేజీ–8 వద్దకు తీసుకొచ్చాక వాటిని బిగించే 60 శాతం పనిని ఎంఈఐఎల్ తన ఇంజనీరింగ్ సాంకేతిక నైపుణ్యంతో పూర్తి చేసింది. గడువుకు ముందే మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ల పంప్‌హౌజ్‌ల నిర్మాణం గోదావరి నీటి ఎత్తిపోతలకు పనులు పూర్తి చేసిన మేఘా 3,057 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేలా పనులు పూర్తి ప్రపంచంలోనే అతిపెద్ద పంపింగ్ స్టేషన్ ప్యాకేజీ–8లో సిద్ధంగా ఉంచిన మేఘా ఇది మా అదృష్టం ‘ఈ ఎత్తిపోతల పథకంలో భాగస్వాములం కావడం మా అదృష్టం. ఈ ఇంజనీరింగ్ అద్భుతం లో పాలు పంచుకుని పర్యవేక్షించే భాగ్యం కలిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద అండర్‌గ్రౌండ్ పంప్‌హౌజ్‌ను, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లో 6 మెషీన్లను 10 నెలల సమయంలో పూర్తి చేయడం ప్రపంచ రికార్డు. బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా ఇది చరిత్రలో నిలుస్తుంది’ - బి.శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈఐఎల్ డైరెక్టర్ -
రూ.92 వేల కోట్ల గ్రాంట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ నిర్వహణ, విద్య, వైద్యం తదితర 13 అంశాలకు సంబంధించి రూ.92,809 కోట్లు అవసరమని, వీటిని గ్రాంట్స్–ఇన్–ఎయిడ్‌గా ఇచ్చేందుకు సిఫార్సు చేయాలని తెలంగాణ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘాన్ని కోరనుంది. వచ్చేవారంలో తెలంగాణకు సందర్శించి ఆర్థిక పరిస్థితి అంచనా వేయనున్న 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్ నేతృత్వంలోని బృందానికి సమర్పించేందుకుగాను నివేదిక తయారు చేసింది. 15వ ఆర్థిక సంఘం అక్టోబర్‌లో తన సిఫార్సుల నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఈ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి. ఐదేళ్లపాటు అమలులో ఉంటాయి. ఎత్తిపోతల పథకాల నిర్మాణం, నిర్వహణకు రూ.40,169 కోట్లు, మిషన్ భగీర థకు రూ.12,722 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. కోటీ 24 లక్షల ఎకరాలకు నీళ్లు.. ప్రతి నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలకు సాగునీరందేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున ఎత్తిపోతల పథకాల నిర్వహణకు నిధులివ్వా లని కోరనుంది. నిర్మాణంలో ఉన్న 23 భారీ, 13 మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని నివేదికలో పేర్కొంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్ల అంచనా వ్యయం ఉందని వివరించనుంది. గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ చేస్తున్నామని, ప్రాజెక్టులు పూర్తయితే కోటీ 24 లక్షల ఎకరాలకు నీళ్లందించే సామర్థ్యం ఏర్పడనుందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. గోదావరి, కృష్ణా నదుల నుంచి నీళ్లు గ్రావిటీ ద్వారా వచ్చే పరిస్థితి లేనందున ఎత్తిపోతలపై ఆధారపడాల్సి వస్తోందని, వీటి నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉంటుందని వివరించనుంది. భగీరథకు రూ.12,722 కోట్లు కావాలి మిషన్ భగీరథకు రూ.12,722 కోట్లు కావాలని ప్రభుత్వం ప్రతిపాదించనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.44,979 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. 23,968 ఆవాసాలకు తాగునీరందించనున్న ఈ వాటర్‌గ్రిడ్ నిర్వహణకు గ్రామీణ ప్రాంతాల్లో 2020 నుంచి 2025 మధ్యకాలానికి రూ.10,141 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో రూ.2,580 కోట్లు అవసరమని ప్రతిపాదించనుంది. ప్రాజెక్టు నిర్వహణకు ఐదేళ్లకుగాను రూ.12,722 కోట్లు అవసరమని పేర్కొన్నట్లు తెలిసింది. ముఖ్య రంగాలకు ఇలా.. ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం విభాగంలో వెయ్యి ఆరోగ్య ఉపకేంద్రాలు, కేన్సర్ కేర్ సెంటర్ల నిర్మాణం, వైద్య వర్సిటీల బలోపేతం.. ఇలా మొత్తంగా రూ.1,085 కోట్లు కావా లని కోరనుంది. 24 గంటల విద్యుత్తుకు భారీ పెట్టుబడులు అవసరమయ్యాయని, పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోందని నివేదికలో పే ర్కొంది. విద్యుత్తు అవసరాలకు రూ.4,442 కోట్లు అవసరమని ప్రతిపాదించనుంది. పాఠశాల విద్యలో భాగం గా బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్‌కు రూ.549 కో ట్లు, ఆధార్ బయోమెట్రిక్ హాజరు యంత్రాలకు రూ. 201 కోట్లు, ఐసీటీ, డిజిటల్ విద్యకు రూ.1,741 కోట్లు అవసరమని ప్రతిపాదించ నుంది. పాఠశాల విద్యకు రూ.7,584 కోట్ల గ్రాంట్లు మంజూరు చేయాలని కోరనుంది. స్థానిక సంస్థల విభా గం ద్వారా రూ.7,866 కోట్ల ప్రతిపాదనలు సమర్పించనుంది. జిల్లాల వర్గీకరణ, కొత్త పంచాయతీల ఏర్పాటు, పంచాయతీ కార్యదర్శుల నియామ కం తదితర అవసరాలకయ్యే వ్యయాన్ని వివరించనుంది. హోంశాఖకు రూ.7,610 కోట్ల నిధులు కోరనుంది. కానిస్టేబుళ్ల నియామకం, ఇతర మౌలిక వసతుల కల్పన, కోర్టు భవనాల నిర్మాణం తదితర అవసరాలకూ ప్రతిపాదనలు సమర్పించనుంది. రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్ భవనాల నిర్మాణం తదితర అంశాలను నివేదికలో పొందుపరిచింది. -
కొత్త ఎత్తిపోతలకు నో..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం రద్దయి... ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుండటంతో కొత్త పథకాలను చేపట్టే అవకాశం లేకుండా పోయింది. సాధారణ ఎన్నికల అనంతరమే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం నిర్ణయం చేయాల్సి ఉండటంతో నీటిపారుదల శాఖ పరిధిలో ఉన్న పెండింగ్ ప్రతిపాదనలన్నీ ఇక ఫైళ్లకే పరిమితం కానున్నాయి. ప్రభుత్వ రద్దు సూచనలతో హడావుడిగా ఆరు ఎత్తిపోతల పథకాలు కేబినెట్ ఆమోదానికి పంపినా, కేబినెట్ భేటీ కేవలం ప్రభుత్వ రద్దు నిర్ణయం వరకే పరిమితం కావడంతో వీటిపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. నిజానికి ప్రభుత్వ రద్దు నిర్ణయం ఏ క్షణంలో అయినా వెలువడుతుందన్న నేపథ్యంలో రెండ్రోజుల కిందటే మంత్రులు, ఎమ్మెల్యేలు నీటిపారుదల శాఖపై ఒత్తిడి తెచ్చి ఫైళ్లను ప్రభుత్వ అనుమతికై పంపారు. ఇందులో నల్లగొండ జిల్లా నుంచి నాలుగు ఎత్తిపోతల పథకాలు, కామారెడ్డి జిల్లా నుంచి మరో రెండు ఎత్తిపోతల పథకాలకు మొత్తంగా రూ.700 కోట్ల పనులకు అనుమతి కోరారు. వీటిపై ప్రభుత్వ రద్దుకు ముందు భేటీ అయిన కేబినెట్ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక కాళేశ్వరంలో భాగంగా నిర్మించతలపెట్టిన సంగారెడ్డి కెనాల్ పనులకు రూ.1,326 కోట్లతో ప్రతిపాదనలు పంపినా కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ కాళేశ్వరం నిర్మాణంలోని ప్రాజెక్టు అయినందున దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో నిర్ణయం తీసుకుని జీవో ఇచ్చే అవకాశం ఉంటుందని నీటిపారుదల వర్గాలు చెప్పాయి. ఈ జీవోకు అనుగుణంగా టెండర్లు పిలిచేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక కల్వకుర్తి పరిధిలో 47 రిజర్వాయర్ల నిర్మాణంపై ఎవరు నిర్ణయం తీసుకోవాలన్న దానిపై సందిగ్ధం ఉంది. ప్రాజెక్టు పాతదే అయినా, 47 రిజర్వాయర్లు పూర్తిగా కొత్త ప్రతిపాదనలు కావడం, నిర్మాణ వ్యయం ఏకంగా రూ.4వేల కోట్లకు పైగా ఉండటంతో దీనిపై ఎలా వ్యవహరిస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఇక కొన్ని ప్రాజెక్టుల పరిధిలో సవరించిన వ్యయ అంచ నాలను ఆమోదించాల్సి ఉంది. ఆపద్ధర్మ ప్రభుత్వం లో ఏ మేరకు సవరించిన అంచనాలను ఆమోదించే అవకాశం ఉందీ, అధికారుల స్థాయిలో ఏ మేరకు చేస్తారన్న దానిపైన కూడా స్పష్టత రావాల్సి ఉంది. నాలుగు ఎత్తిపోతలకు అనుమతులు కేబినెట్ గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్తగా నాలుగు ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వరంగల్ జిల్లా పరకాల మండల పరిధిలో ముస్తాల్యపల్లి ఎత్తిపోతలకు రూ.8.22 కోట్లు, ఇదే మండల పరిధిలో వెంకటేశ్వరపల్లి ఎత్తిపోతలకు రూ.7.96 కోట్లు, ఖమ్మం జిల్లా రాపల్లి ఎత్తిపోతలకు రూ.12.87 కోట్లు, జగిత్యాల జిల్లా రాయికల్ మండల పరిధిలో బోరన్నపల్లి ఎత్తిపోతలకు రూ.1.32 కోట్లతో అనుమతులిచ్చారు. ఇక పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని భట్పల్లిలో కొత్తచెరువు నిర్మాణానికి రూ.2.94కోట్లతో అనుమతులు ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మిడ్‌మానేరు నిర్వాసితులకు ఆర్థిక సాయం గత కేబినెట్ నిర్ణయం తీసుకున్న మేరకు మిడ్‌మానేరు రిజర్వాయర్ పరిధిలోని సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల మన్వాడ నిర్వాసితులకు ఆర్థిక సహాయానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 608 ప్రభావిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.4.25 లక్షల చొప్పున సాయం చేసేలా ఉత్తర్వులిచ్చారు. -
కొత్తగా నాలుగు ‘ఎత్తిపోతలు’!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొత్తగా పలు ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సాగునీటి వసతి కల్పించాలన్న డిమాండ్లు, కల్పించేందుకు అవకాశాలు ఉన్న నాలుగు ప్రాంతాలను గుర్తించింది. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో గట్టు, మంజీరా, సాగర్ టెయిల్‌పాండ్‌లోని హాలియా, తుంగపాడు బంధం ఎత్తిపోతలను చేపట్టేందుకు.. సుమారు రూ.1,400 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. వీటికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు సిద్ధమవగా.. త్వరలోనే మంత్రివర్గ ఆమోదం తీసుకుని, శంకుస్థాపనలు చేయాలని భావిస్తోంది. కొత్తగా నాలుగు.. గద్వాల నియోజకవర్గం పరిధిలో కృష్ణా జలాల ఆధారంగా మరో ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నీటిని తీసుకుంటూ.. కొత్తగా గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. రూ.550 కోట్లతో గద్వాల జిల్లాలోని గట్టు, ధరూర్ మండలాల పరిధిలోని 33 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా దీనిని నిర్మించనున్నారు. దీని పనులను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇటీవలే అధికారులను ఆదేశించారు. ఇక నిజాంసాగర్ కింద మంజీరా నదిపై పిట్లం, బిచ్కుంద మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో 30,646 ఎకరాలకు నీరిచ్చేలా.. నిజాంసాగర్ మండలం మల్లూర్ సమీపంలో రూ.456 కోట్లతో మంజీరా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2.90 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టే ఈ పథకానికి నాలుగైదు రోజుల్లో అధికారిక అనుమతులు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్‌లో కొత్తగా హాలియా ఎత్తిపోతలను రూ.191 కోట్లతో చేపట్టేలా ప్రణాళిక సిద్ధమైంది. 1.32 టీఎంసీల నీటిని తీసుకుని 12,400 ఎకరాలకు నీరిచ్చేలా దీన్ని రూపొందించారు. ఇదే టెయిల్‌పాండ్ కింద తుంగపాడు బంధం వద్ద 0.95 టీఎంసీల సామర్థ్యంతో 8 వేల ఎకరాలకు నీరిచ్చేలా రూ.191 కోట్లతో మరో ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ నాలుగు ఎత్తిపోతల పథకాలకు కూడా దుమ్ముగూడెంలో వృథాగా ఉన్న మోటార్లను వినియోగించనున్నారు. వీటన్నింటికీ వచ్చే నెల రెండో వారానికల్లా అధికారిక అనుమతులు పూర్తి చేసి.. జూన్, జూలై నాటికి పనులు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గరిష్ట ఆయకట్టుకు నీరే లక్ష్యం రాష్ట్రంలో లభ్యతగా ఉన్న ప్రతి నీటిచుక్కను వినియోగంలోకి తేవడం, నీటి నిల్వలను పెంచడం ద్వారా గరిష్ట ఆయకట్టుకు నీరు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులను చేపడుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు ప్రాజెక్టులను మొదలుపెట్టగా.. ఇంకా డిమాండ్ ఉన్న చోట్ల మరిన్ని కొత్త పథకాలకు ప్రణాళికలు వేస్తోంది. ఈ మేరకు కడెం ప్రాజెక్టు కింది ఆయకట్టు స్థిరీకరణతో పాటు అవసరమైనపుడు కుంటాల జలపాతానికి నీరు విడుదల చేసేలా కుఫ్టి ఎత్తిపోతలకు ఇటీవలే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 5.32 టీఎంసీల సామర్థ్యంతో రూ.744 కోట్లతో రిజర్వాయర్ నిర్మించేందుకు అనుమతించింది. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక దేవాదుల ప్రాజెక్టు కింద అదనపు నీటి నిల్వ కోసం 10.78 టీఎంసీల సామర్థ్యంతో జనగామ జిల్లా మల్కాపూర్ గ్రామ పరిధిలోని లింగపల్లి వద్ద రూ.3,227 కోట్లతో రిజర్వాయర్ చేపడుతోంది. ఈ రిజర్వాయర్‌తోపాటు పైప్‌లైన్ వ్యవస్థ, పంపుహౌజ్‌ల నిర్మాణాలకు అనుమతులతో పాటు టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
‘ఎత్తిపోతల’కు ఊరట కొంతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ఎత్తిపోతల పథకాలకు సరఫరా చేస్తున్న విద్యుత్ ధరలపై స్వల్ప ఊరటే లభించింది. యూనిట్ ధరను రూ.6.40 నుంచి రూ.4.88కి తగ్గించాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదించగా... విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) 60 పైసలు మాత్రమే తగ్గించి, యూనిట్ ధరను రూ.5.80గా నిర్ణయించింది. దాంతో ఎత్తిపోతల పథకాల విద్యుత్ ఖర్చులో కేవలం రూ.146.77 కోట్లకు మాత్రమే ఉపశమనం లభించనుంది. జూన్ నుంచి భారీగా వినియోగం రాష్ట్రంలో ప్రస్తుతం అలీసాగర్, గుత్ప, ఎల్లంపల్లి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వ కుర్తి వంటి మొత్తం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తున్నాయి. వాటికి ప్రస్తుతం ఏటా 1,359 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగిస్తున్నారు. యూనిట్‌కు రూ.6.40 చొప్పున లెక్కిస్తే.. ఏటా వీటికి రూ.1,565.57 కోట్ల మేర ఖర్చవుతోంది. తాజాగా ధర రూ.5.80కు తగ్గించడంతో ఖర్చు 1,418.80 కోట్లకు తగ్గనుంది. అంటే రూ.146.77 కోట్ల మేర మాత్రమే భారం తగ్గుతోంది. అదే డిస్కంలు కోరిన మేర రూ.4.88కి తగ్గిస్తే.. భారం ఏకంగా రూ.371.82 కోట్లు తగ్గేదని అంచనా. ఇక ఈ ఏడాది జూన్–జూలై నాటికి మరిన్ని ఎత్తిపోతల పథకాలు వినియోగంలోకి వస్తుండడంతో.. విద్యుత్ అవసరం 3,331 మెగావాట్లకు పెరుగుతుందని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. యూనిట్ ధర రూ.4.88కి తగ్గించి ఉంటే.. భారం ఏకంగా రూ.911.36 కోట్ల మేర తగ్గేదని అంచనా. -
గోదావరి నీటితో కరువు నేల పునీతం
సాక్షి, సిద్దిపేట: ‘‘ఏటా గోదావరి నది నుంచి వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఆ జలాలను దేవాదుల, కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాల ద్వారా కరువుతో అల్లాడుతున్న తెలంగాణ జిల్లాలకు మళ్లించి.. బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న దే ప్రభుత్వం తపన..’’అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం దేవాదుల డీ–4 ఎడమ కాల్వ ద్వారా తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి సిద్దిపేట, కొండపాక మండలాల్లోని చెరువులు నింపేందుకు నీటిని విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఏటూరునా గారం మండలం గంగారం వద్ద గోదావరి సముద్ర మట్టానికి 71 మీటర్ల ఎత్తున ప్రవహి స్తోందన్నారు. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసి సముద్ర మట్టానికి 540 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దిపేట జిల్లాలో పారించడం ప్రభుత్వం పడు తున్న శ్రమకు నిదర్శమని హరీశ్ తెలిపారు. 1,539 అడుగుల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం ద్వారా ఈ ప్రాంతంలో ప్రతి చెరువుకు గోదావరి నీళ్లు మళ్లించవచ్చని చెప్పారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి నిజామా బాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలతోపాటు ఇప్పటి మేడ్చల్ జిల్లాలకు సాగునీరు, హైదరా బాద్‌కు తాగునీరు అందిస్తున్నామన్నారు. దేవాదులతో చెరువులకు జలకళ దేవాదుల ఎత్తిపోతల ద్వారా ఇప్పటివరకు 180 చెరువులను నీటితో నింపామని, మరో నెలరోజుల్లో మిగిలిన 113 చెరువుల్లో జలకళ ఉట్టిపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి 38.5 టీఎంసీల నీటిని మాత్రమే తీసుకునే అవకాశం ఉందని, దీంతో 5.59 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించడం కష్టమని మంత్రి వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని నీటి సామర్థ్యం 60 టీఎంసీలకు పెంచేందుకు జీఓలు విడుదల చేశామని, అను మతులు తీసుకుంటున్నామన్నారు. గంగారం వద్ద పంపింగ్ చేసే నీటి సామర్థ్యం కేవలం సంవత్సరంలో 130 రోజులకు మాత్రమే ఉందని, ఎగువన ఉన్న తుపాకులగూడెం వద్ద బ్యారేజీ కడితే సంవత్సరం పొడవునా నీటిని పంప్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అదే కంతనపల్లిలో ప్రాజెక్టు కడితే 12 గ్రామాలు, 7 వేల ఎకరాల సాగుభూమి ముంపునకు గురవుతుందని చెప్పారు. ఈ విషయం అర్థం కాని ప్రతిపక్ష నాయకులు అక్కడి ప్రజలను ముంచి.. కంతనపల్లి కట్టమంటున్నారని, నీరిచ్చే మల్లన్నసాగర్ కట్టకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దేవాదుల మూడో దశ నిర్మాణాలు చేయకుండా రామప్ప దేవాలయానికి ముప్పు ఏర్పడుతుందనే బూచి చూపి గత పాలకులు మధ్యలో వదిలేశారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రామప్ప దేవాలయానికి ఇబ్బంది కాకుండా పైప్లైన్ల ద్వారా నీటిని మళ్లిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు దేవాదుల ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.1,781 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి హరీశ్‌రావు వివరించారు. మూడో దశ పూర్తి చేస్తే పాత వరంగల్ జిల్లా అంతా సస్యశ్యామలంగా మారుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మూడున్నరేళ్ల వ్యవధిలోనే ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు అందిస్తున్నా మని చెప్పారు. వేగంగా ప్రాజెక్టుల నిర్మాణాలు అటవీ అనుమతులు, భూసేకరణ పూర్తి చేసుకొని ప్రాజెక్టుల నిర్మాణాలు పరు గెత్తిస్తున్నామని మంత్రి హరీశ్ చెప్పారు. కల్వకుర్తి నీటి సామర్థ్యం 25 టీఎంసీల నుంచి 45 టీఎం సీలకు పెంచి పాలమూరు జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా మొదలగు ప్రాజెక్టులు ద్వారా నీటిని మళ్లిస్తు న్నామన్నారు. గత పాలకులు ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకొని వదిలేస్తే టీఆర్ఎస్ 13 వేల ఎకరాల నుంచి 7 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు నిధులు కేటాయిం చిందని గుర్తుచేశారు. కరువు కోరల్లో ఉన్న తెలంగాణకు సాగునీరు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులు సహకరించా ల్సింది పోయి అభివృద్ధికి విఘాతం కలిగి స్తున్నారన్నారు. మేధావులు రాష్ట్ర అభివృ ద్ధిలో భాగస్వాములైతే ప్రజలు మరింత గౌరవిస్తారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, దేవాదులు ఎస్ఈ బంగారయ్య, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మరో 24 ఎత్తిపోతల పథకాలు
ఈ నెలాఖరు లేదా వచ్చేనెల మొదట్లో ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి పారుదల అభివృధ్ధి సంస్థ (ఐడీసీ) ఆధ్వర్యంలో మరో 24 ఎత్తిపోతల పథకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 582 ఎత్తిపోతల పథకాలు ఉండగా, అదనంగా మరో 74 పథకాలను ఐడీసీ గతంలోనే చేపట్టింది. ఎత్తిపోతల పథకాల కింద మొత్తంగా 4.50 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించగా, ప్రస్తుతం 1.23 లక్షల ఎకరాలకు నీరందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాత వాటికి మరమ్మతులు చేపట్టడంతోపాటు కొత్త వాటిని పూర్తి చేయాలని నిర్ణయించిన ఐడీసీ ఆ దిశలో పనులు చేస్తోంది. ఈ రబీలో కొత్తగా చేపట్టిన 74 పథకాల్లో 45 పూర్తిచేసి 70వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ఈ 45 పథకాల్లో తొలుత 24 పథకాలను ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారానికి ప్రారంభించి 37వేల ఎకరాలకు నీరందించాలని ఐడీసీ భావిస్తోంది. ఇందులో జగిత్యాల జిల్లాలో రాయటప్నం, తిమ్మాపూర్, రాజారాం, జైనా, దొంతాపూర్ పథకాలు ఉండగా, పెద్దపల్లి జిల్లాలో కాశిపేట, కరీంనగర్లో ఉట్నూరు, భూపాలపల్లిలో గిద్దముత్తారం, నిజామాబాద్ జిల్లాలో గుమ్మిర్యాల, కుక్కునూరు, నిర్మల్‌లో వెల్మల్, సంగారెడ్డిలో బోగులంపల్లి, గద్వాల్లో అలంపూర్, సూర్యాపేట జిల్లాలో ఎర్రగుట్టతండా, చౌట్పల్లి, పొనుగోడు, మఠంపల్లి, ముదిమాణిక్యం, సున్యపహాడ్, గుట్టలగడ్డ, కొత్తగూడెం జిల్లాలో సింగిరెడ్డిపల్లి, అల్లపల్లి, పాములపల్లి, మోతెలో ఈ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జగిత్యాలలోని రాయపట్నం, తిమ్మాపూర్ పథకాలను అధికారులు ప్రారంభించారు. -
మోటార్ నడవకున్నా.. ‘మీటర్’ మోత!
ఎత్తిపోతల పథకాలపై కనీస చార్జీలు, లోడ్ చార్జీల పేరుతో డిస్కంల బాదుడు - మోటార్లు ఏడాదిలో నడుస్తున్నవి గరిష్టంగా 90 రోజులే - చార్జీలు మాత్రం 365 రోజులకు వసూలు సాక్షి, హైదరాబాద్: మన ఇంట్లోని కూలర్‌ను ఎండాకాలంలో మూడు నెలల పాటు వాడతాం, తర్వాత పక్కన పెడతాం.. కానీ కూలర్ ఉందని చెప్పి.. కనీస చార్జీల పేరిట ఏడాదంతా వసూలు చేస్తే..? అదేంటి మరీ దుర్మార్గం.. అంటారు కదా? ప్రస్తుతం నీటి పారుదల శాఖ పరిధిలోని ఎత్తిపోతల పథకాల విషయంలో జరుగుతున్నది ఇదే! రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల మోటార్లు ఏడాదిలో పనిచేసేది 90 రోజులే అయినా.. కనీస చార్జీల పేరిట డిస్కంలు ముక్కుపిండి మరీ 365 రోజులకు బిల్లులు వసూలు చేస్తున్నాయి. ఏటా నీటి పారుదల శాఖ రూ.1,750 కోట్ల మేర విద్యుత్ బిల్లులు చెల్లిస్తుంటే... అందులో ఇలా అదనంగా చెల్లిస్తున్న బిల్లు ఏకంగా రూ.350 కోట్ల వరకు ఉండటం గమనార్హం. ఇక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలు పూర్తయితే విద్యుత్ అవసరాలు భారీగా పెరుగుతాయి. అప్పుడు ఇలా కనీస చార్జీల పేరిట వేసే మోత ఏకంగా రూ.వేల కోట్లకు పెరిగే అవకాశముంది. వినియోగం పెరిగిన కొద్దీ మోతే మోటార్లు నడవని రోజుల్లోనూ డిస్కమ్‌లు బిల్లు వేస్తుండటంతో.. నీటి పారుదల శాఖ రూ.350 కోట్లను అదనంగా చెల్లించాల్సి వచ్చినట్లు అంచనా. ఇక ఆలస్యంగా బిల్లు చెల్లిస్తే భారీగా జరిమానా వసూలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య ఒక్క కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలోనే రూ.2.79 కోట్ల మేర ఆలస్య రుసుము వసూలు చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే నిర్మాణంలోని ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తయితే.. ఈ విద్యుత్ మోత, కనీస చార్జీల బాదుడు భారీగా ఉంటుందని నీటిపారుదల శాఖ లబోదిబోమంటోంది. వాడకున్నా వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. వాటిల్లో కొన్ని పూర్తయి ప్రారంభంకాగా, మరిన్ని నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి 12,075 మెగావాట్ల వరకు విద్యుత్ అవసరమని అంచనా. ప్రస్తుతం అలీసాగర్, గుత్ప, ఉదయ సముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి తదితర 14 ఎత్తిపోతల పథకాల ద్వారా ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతోంది. వీటికి 1,338 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతుండగా.. యూనిట్‌కు రూ.6.40 చొప్పున బిల్లు చెల్లిస్తున్నారు. మొత్తంగా గతేడాది చెల్లించిన బిల్లు దాదాపు రూ. 1,750 కోట్లు. కానీ జల వనరుల్లో నీళ్లు లేని సందర్భాల్లో పంపులు, మోటార్లు నడవకున్నా.. డిస్కంలు లోడ్ చార్జీలు, కనీస చార్జీల పేరిట భారీగా బిల్లులు వేస్తున్నాయి. ► గతేడాది దేవాదుల ప్రాజెక్టు నుంచి కేవలం 8 టీఎంసీల నీటినే ఎత్తిపోశారు. దాదాపు ఆరేడు నెలల పాటు ఈ ప్రాజెక్టు పంపులు వాడనేలేదు. అయినా ఏకంగా రూ.200 కోట్ల మేర విద్యుత్ బిల్లు రావడం గమనార్హం. ► కల్వకుర్తి ప్రాజెక్టులో గతేడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అసలు మోటార్లే నడవకున్నా.. కనీస చార్జీల కింద రూ. 27 లక్షలు వసూలు చేశారు. మొత్తంగా 13.97 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా.. రూ.88.39 కోట్ల మేర బిల్లు వచ్చింది. ఎనర్జీ ఆడిటింగ్ ఎక్కడ? ఎత్తిపోతల పథకాల నిర్వహణకు అవుతున్న ఖర్చులను తగ్గించుకునేలా ఎనర్జీ ఆడిటింగ్ చేయాలని గతంలో నీటి పారుదల శాఖ, ట్రాన్స్‌కో నిర్ణయించాయి. ఒక కమిటీని కూడా వేశాయి. కానీ తర్వాత ఏదీ ముందుకు కదలలేదు. ఇక కనీస చార్జీల తొలగింపుపై డిస్కంలతో ప్రభుత్వం చర్చించినా ఫలితం లేదు. చార్జీల తొలగింపు అంశం తమ పరిధిలో లేదని, దాన్ని ఈఆర్సీ తేల్చాలని డిస్కంలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ అంశంపై ఈఆర్సీకి లేఖ రాయనున్నట్లు ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు, విద్యుత్ అవసరాలు.. మొత్తం ఎత్తిపోతల పథకాలు : 19 అవసరమైన విద్యుత్ (మెగావాట్లలో) : 12,075 ప్రస్తుతం పనిచేస్తున్నవి (కొన్ని పాక్షికంగా పనిచేస్తున్నాయి) : 14 వీటికి ఏటా వినియోగం అవుతున్న విద్యుత్ (మెగావాట్లలో) : 1,338 గతేడాది చెల్లించిన విద్యుత్ బిల్లులు (రూ. కోట్లలో) : 1,750 కనీస చార్జీలు, లోడ్ చార్జీల పేరిట వసూలు చేసింది (అంచనా కోట్లలో) : 350 వచ్చే ఏడాదికి అవసరమయ్యే విద్యుత్ (మెగావాట్లు) : 3,470 మోటార్లు నడవకున్నా పడే భారం (అంచనా కోట్లలో) : 1,250 భవిష్యత్తులో 12 వేల మెగావాట్లకు పడే భారం (అంచనా కోట్లలో) : 4,800 -
ఉత్తిపోతలేనా?
► రాష్ట్రంలో చిన్న ఎత్తిపోతల పథకాల పరిస్థితి దారుణం ► 582 పథకాల్లో పనిచేస్తున్నవి 178 మాత్రమే సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి అభివృద్ధి కార్పొరేషన్ (ఐడీసీ) ద్వారా చేపట్టిన ఎత్తిపోతల పథకాలు దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. సరైన నిర్వహణ లేక, మరమ్మతుల సమస్యతో వృథాగా పడి ఉంటున్నాయి. ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కింద సమకూర్చిన నిధులతో సన్న, చిన్నకారు రైతులకు సాగునీటి సదుపాయాన్ని కల్పించేందుకు ఈ చిన్నస్థాయి ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. ఈ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయిస్తున్నా.. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం, నిలిచిపోయిన పథకాలను పునరుద్ధరణకు చొరవ చూపకపోవడం, ఆధునీకరించడంలో విఫలమవడం వంటి కారణాలతో ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యం అవుతున్నాయి. పనిచేస్తున్నవి మూడో వంతే.. రాష్ట్రంలో ప్రస్తుతం 582 ఎత్తిపోతల పథకాలు ఉండగా.. వాటిలో 178 మాత్రమే పూర్తిగా పనిచేస్తుండటం పరిస్థితిని స్పష్టం చేస్తోంది. ఈ మొత్తం 582 ఎత్తిపోతల పథకాల కింద సుమారు 3.86 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉంది. కానీ 1.23 లక్షల ఎకరాల (32 శాతం)కు మాత్రమే అందుతున్నాయి. పట్టించుకునే వారెవరు? ఈ చిన్న స్థాయి ఎత్తిపోతల పథకాల నిర్వహణను సాగునీటి రైతు సంఘాలే స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా చోట్ల ఈ సంఘాలు ఆర్థికంగా, సాంకేతికంగా సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నాయి. రైతులకు అధికారుల సహకారం లోపించడంతో పథకాలన్నీ చతికిలపడ్డాయి. ఇక ఈ ఎత్తిపోతల పథకాల కింద పూర్తిగా ఆరుతడి పంటలే వేయాల్సి ఉన్నా.. తగిన చైతన్యం లేకపోవడంతో రైతులు వరి సాగు చేపడుతున్నారు. దానివల్ల చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. మోటార్లు రిపేర్లకు వచ్చినా, పథకం నిర్వహణలో సాంకేతిక సమస్యలు వచ్చినా పట్టించుకునేవారు లేరు. దీంతో మొత్తం పథకాల్లో 222 పూర్తిగా వినియోగంలో లేకుండా పోయాయి. కేటాయింపులు ఎక్కువ.. ఖర్చు తక్కువ పనిచేయని పథకాలను పునరుద్ధరించడం, పాక్షికంగా పనిచేస్తున్న వాటికి మరమ్మతులు, కొత్తగా మరిన్ని ఎత్తిపోతల పథకాల కోసం ప్రభుత్వం ఏటా ఐడీసీకి భారీగానే నిధులు కేటాయిస్తోంది. కానీ నిధుల ఖర్చు మాత్రం ఉండడం లేదు. గతేడాది రూ.274 కోట్లు కేటాయించగా.. రూ.177.98 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీంతో అనుకున్న మేర ఆయకట్టు సాధ్యం కాలేదు. తాజాగా ఈ ఏడాది రూ.294 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో 154 ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి 85,653 ఎకరాలను సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 57 పథకాల పనులు మొదలయ్యాయి. పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరిస్తాం ‘‘ఉమ్మడి రాష్ట్రంలో ఐడీసీ పథకాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. నిర్ణీత ఆయకట్టులో 30 శాతానికి కూడా నీరందించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని మార్చేసేందుకు చర్యలు చేపట్టాం. ప్రతి జిల్లాలో పర్యటించి.. ఎక్కడ మరమ్మతులు అవసరం, ఎక్కడ పునరుద్ధరణ అవసరమనేది పరిశీలించాం. ఈ ఖరీఫ్‌లోనే 1.49 లక్షల ఎకరాలకు నీరందేలా చూస్తాం. మున్ముందు పూర్తి ఆయకట్టుకు నీరిస్తాం. 150, 200 హెచ్‌పీ మోటార్ల వద్ద పంపు ఆపరేటర్లు లేకపోవడంతో మోటార్లు కాలిపోతున్నాయని, పైపులు పగిలిపోతున్నాయని గుర్తించాం. అక్కడ ఐటీఐ, డిప్లొమా చేసిన వారిని పంపు ఆపరేటర్లుగా నియమించుకోవాలని నిర్ణయించాం..’’ – ఈద శంకర్‌రెడ్డి, సాగునీటి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాసిరకం పనులతో వృథా.. జయశంకర్ జిల్లా వాజేడు మండలం పూసూరు, మైసారం, మండపాక, బొమ్మనపల్లి గ్రామాల పరిధిలో 706 ఎకరాలకు నీరందించేందుకు పూసూరు ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. 1992లో పూసూరు వద్ద గోదావరి ఒడ్డున రూ.25 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టి 1993లో పూర్తిచేశారు. 100 హెచ్‌పీ సామర్థ్యమున్న మూడు మోటార్లు, పైప్‌లైన్, విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి ట్రాన్స్ఫార్మర్ అమర్చారు. అయితే కాంట్రాక్టర్ నాసిరకం పనులతో 1996లో పైపులైన్ పగిలిపోయింది. 1998లో పథకానికి మరమ్మతులు చేసినా.. బిల్లులు చెల్లించలేదంటూ ట్రాన్స్‌కో విద్యుత్ సరఫరా నిలిపేసింది. 2004లో అప్పటి సీఎం వైఎస్సార్ రూ.12లక్షల మేర విద్యుత్ బిల్లులను మాఫీ చేశారు. దీంతో ఈ పథకం తిరిగి ఏడాది పనిచేసింది. కానీ 2005 చివరలో పైపులైన్లు పగలడం, మోటార్లు మొరాయించడం వంటి సమస్యలతో పథకం మూలనపడింది. అంతా లీకేజీలమయం.. 15 వేల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో 2009లో మక్తల్ నియోజకవర్గ పరిధిలో చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం, దానికి అనుబంధంగా నాగిరెడ్డిపల్లి, బెక్కర్‌పల్లి ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. రూ.50 కోట్ల నాబార్డు నిధులతో పనులు ప్రారంభించారు. టెండర్లలో పనులు దక్కించుకున్న కోరమాండల్, డీఆర్సీఎల్ కంపెనీలు నాసిరకంగా పైపులైన్‌ను నిర్మించాయి. దాంతో కొద్దిరోజులకే 400కుపైగా లీకేజీలు ఏర్పడ్డాయి. వాటిని సరిచేయాలని రైతులు సర్కారుకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. చంద్రఘడ్ ప్రధాన పథకం నుంచి చంద్రఘడ్, ధర్మాపురం, నందిమళ్ల, మస్తీపురం, నందిమళ్ల క్రాస్‌రోడ్డు, కిష్టంపల్లి, ఈర్లదిన్నె, మిట్టనందిమళ్ల, చింతరెడ్డిపల్లి గ్రామాల్లోని 5వేల ఎకరాలకు నీరందించాలన్నది లక్ష్యం కాగా... లీకేజీలతో ఒక్క పంటకూ నీరందలేదు. నాగిరెడ్డిపల్లి, బెక్కర్‌పల్లి పథకాల్లోనూ ఎకరాకు నీరందించలేకపోయారు. -
‘ఎత్తిపోతల’ను వెంటనే పూర్తిచేయండి
⇒ పనులు పూర్తి చేయని ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టండి ⇒ ఐడీసీకి హరీశ్‌రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) చేపట్టిన ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ ఖరీఫ్‌లో సాగు నీరందించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. మొత్తం ఐడీసీ లిప్టు పథకాల ద్వారా ఖరీఫ్‌లో ఎంత ఆయకట్టుకు సాగు నీరందిస్తున్నారో లక్ష్యాలను నిర్దేశించు కోవాలని ఐడీసీని ఆయన ఆదేశించారు. శనివారం ఐడీసీ కార్యాలయంలో ఆ సంస్థ చేపట్టిన ఎత్తి పోతల పథకాల పురోగతిపై నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు సమీక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012 కంటే ముందు ప్రారంభించిన పథకాలు ఇప్పటికీ పూర్తి కానందుకు టీఎస్ఐడీసీ అధి కారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రా క్టు గడువులోగా పనులు పూర్తిచేయని ఏజెన్సీ లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. పూర్తి కావలసిన దశలో ఉన్న ఎత్తిపోతల పథకాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో తక్షణమే పూర్తి చేయాలన్నారు. 40 పథకాలు పూర్తి: శంకర్‌రెడ్డి టీఎస్ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి మాట్లాడు తూ కోటి ఎకరాలకు నీరందించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నా యని అన్నా రు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 110 లిఫ్ట్ స్కీంలకు సీఎం కేసీఆర్ నిధులు కేటాయించార ని తెలిపారు. ఇందులో ఇప్పటికే 40 స్కీంలు పూర్తయ్యాయని, రూ. 7 కోట్లు ఖర్చు చేసి 15వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామన్నారు. ఇవి కాకుండా ప్రపంచ బ్యాంకు నిధులతో 17 స్కీంలకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఇప్పటికే 50 శాతం పనులు పూర్తి కావొస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా లిఫ్ట్‌లకు అవసరమైన విద్యుత్ లైన్ల పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని, అందుకు 16 గంటల విద్యుత్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఇరిగేషన్ కార్యదర్శి వికాస్ రాజు, టీఎస్ఐడీసీ ఎండీ. శ్రీదేవి, ఇతర ఆధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అలసత్వం సహించం పెండింగ్ పనులను ఈ ఏడాది పూర్తి చేసి ఖరీఫ్‌లో ఎస్సారెస్పీ 2 కింద 3.97 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరివ్వాలని అధికారులకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. అలసత్వం, అలక్ష్యం సహించేది లేదని.. సమర్థంగా పనిచేయని అధికారులను డిమోట్ చేస్తామని హెచ్చరించారు. శనివారం జలసౌధలో ఎస్సారెస్పీ స్టేజ్ 2 పనుల పురోగతిని మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి హరీశ్‌రావు సమీక్షించారు. ప్యాకేజీల పనులన్నీ ఖరీఫ్‌లోగా పూర్తి చేయాల్సిం దేనన్నారు. మిడ్‌మానేరు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని.. మిడ్ మానేరు నుంచి 25, ఎల్ఎండీ నుంచి 25 టీఎంసీల నీటిని విడుదల చేయను న్నందున ఎస్సారెస్పీ స్టేజ్ 2 కాలువలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులు ఆఫీసులు విడిచిపెట్టి క్షేత్రస్థాయి పర్యటనలు జరపాని, కాల్వల వెంట స్వయంగా తిరిగితేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని హరీశ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్, ప్రభు త్వ స్పెషల్ సీఎస్ జోషి పాల్గొన్నారు. -
రూ.30 వేల కోట్లు ఇవ్వండి!
- కాళేశ్వరం, పాలమూరు కింద రెండేళ్ల పని ఏడాదిలో చేసేస్తాం - ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ వ్యయ ప్రణాళికల సమర్పణ - కాళేశ్వరానికి రూ.15,938 కోట్లు,పాలమూరుకు రూ.15,018 కోట్లు కోరిన అధికారులు - ఆ మేరకు సిమెంట్, కాంక్రీట్ పనులు చేస్తామని వివరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు తమకు వచ్చే ఏడాదికిగానూ రూ.30 వేల కోట్లు ఇవ్వాలని నీటిపారుదల శాఖ సర్కార్‌కు విన్నవించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు నెల వారీగా తాము ఖర్చు చేయాలనుకున్న వ్యయం, చేయాల్సిన పనులపై ప్రభుత్వానికి సమగ్రమైన వివరణ ఇచ్చింది. ఒక్కో ప్రాజెక్టు కింద రమారమి రూ.15 వేల కోట్ల మేర పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ లక్ష్యాల మేర పనులు జరగాలంటే ఈ మేరకు నిధుల విడుదల తప్పనిసరి అని స్పష్టం చేసింది. భూసేకరణ, ఇతరత్రా కారణాల వల్ల ఈ ఏడాది పనులు జరగకపోయినా.. వచ్చే ఏడాదిలో రెండేళ్ల పనులు చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని వివరించింది. డబ్బులిస్తే ‘డబుల్’వేగంతో.. నిజానికి ఈ ఏడాది బడ్జెట్లో కాళేశ్వరం కింద రూ.6,286 కోట్లు కేటాయించగా అందులో ఇప్పటివరకు రూ. 3,283.63 కోట్ల మేర ఖర్చయ్యాయి. మరో రూ.3 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా ఇటీవల బడ్జెట్‌ను రూ.6,643.08 కోట్లకు సవరించారు. పాలమూరు కింద బడ్జెట్లో రూ.7,860 కోట్లు కేటాయించినా.. ప్రాజెక్టు పరిధిలో 26,913 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా, 13,777 ఎకరాలు మాత్రమే పూర్తి కావడంతో దీనిని రూ.1,340.64 కోట్లకే పరిమితం చేశారు. దీంతో ఈ ఏడాది పనులు ముందుకు కదల్లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది చేసే పనుల లక్ష్యాలు, వాటికయ్యే వ్యయం నెలవారీ అంచనాలను సమర్పించాలని ఆదేశించడంతో.. ప్రాజెక్టు అధికారులు వాటిని ఉన్నతాధికారులకు సమర్పించారు. పాలమూరు కింద మొత్తంగా 35.34 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపని, 52 లక్షల కాంక్రీట్ పనులు చేయాల్సి ఉందని, ఇందులో 2017 డిసెంబర్ నాటికి 19.68 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తి చేస్తామని, మరో 22 లక్షల కాంక్రీట్ పని చేస్తామని నివేదించారు. ఈ పనులు చేసేందుకు నెలకు రూ.700 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు బడ్జెట్ విడుదల చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక కాళేశ్వరం కింద భూసేకరణ సమస్యలు కొలిక్కి వచ్చిన దృష్ట్యా వచ్చే ఏడాది నుంచి పనులు వేగిరం చేస్తామని.. ప్రతీ నెలా రూ.వెయ్యి కోట్లకు తక్కువ కాకుండా మట్టి, కాంక్రీట్ పనులు చేస్తామని వెల్లడించారు. మొత్తంగా వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పాలమూరుకు రూ.15,018 కోట్లు, కాళేశ్వరానికి రూ.15,938 కోట్ల మేర పనులు చేస్తామని తెలిపారు. 2016–17లో వివిధ సమస్యలతో పనులు జరుగకున్నా, వచ్చే ఏడాది మాత్రం రెండేళ్ల పనులు ఒక్క ఏడాదిలో డబుల్ వేగంతో చేస్తామని వివరించారు. ఈ నివేదికలను కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్‌కు నీటిపారుదల శాఖ సమర్పించినట్లుగా తెలిసింది. -
పథకాలను త్వరగా పూర్తిచేయాలి
‘ఎత్తిపోత’లపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి అభివృద్ధి సంస్థ(ఐడీసీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలన్నీ నిర్వీర్యం అయ్యాయంటూ ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. మంగళవారం ఎత్తిపోతల పథకాలపై జిల్లాల వారీగా ఐడీసీ కార్యాలయంలో సుదీర్ఘంగా సమీక్షించారు. ఇప్పటికే చేపట్టిన ఎత్తిపోతలు, పునరుద్ధరణ చేస్తున్నవి, కొత్త గా మంజూరైన ఎత్తిపోతల పథకాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చేపట్టిన 73 ఎత్తిపోతల పథకాల ద్వారా 1.20లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందని.. దీని కోసం రూ.542 కోట్లు ఖర్చు చేశామ ని అధికారులు తెలిపారు. మిగతా పనులకు మరో రూ.162.12 కోట్లు అవసరమవుతాయని వివరించారు. వివిధ కారణాల వల్ల పూర్తిగా విని యోగం లేకుండా పోయిన 117 ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని, దీని ద్వారా 49,376 ఎకరాల కు ఆయకట్టు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి రూ.76.84 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశామన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పథకాల పరిధిలోని లబ్ధిదారులైన రైతులను భాగస్వాములను చేయాలని, పనుల వేగవంతానికి శాసనసభ్యులు చొరవ చూపాలన్నారు. పనులు సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లను సస్పెండ్ చేసి అవసరమైతే కొత్తగా టెండర్లు పిలవాలని సూచించారు. ఈ సమావేశంలో శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, ఐడీసీ ఎండీ శ్రీదేవి, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండేలు పాల్గొన్నారు. -
నిర్వీర్యమవుతున్న ఎత్తిపోతల పథకాలు
- 559 పథకాల్లో పనిచేస్తున్నవి 117 మాత్రమే - వినియోగంలో లేకుండా పోయిన 259 పథకాలు - మొత్తం ఆయకట్టు 3.52 లక్షలు.. నీరందుతోంది 1.55 లక్షల ఎకరాలకే - గత ఏడాది రూ.370 కోట్లు కేటాయించినా ఖర్చు చేసింది 184.52 కోట్లే - 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లక్ష్యం.. ఇచ్చింది 3,661 ఎకరాలకు - మోటార్ల రిపేర్లు, నిర్వహణ వ్యయాన్ని భరించలేక చేతులెత్తేస్తున్న నీటి సంఘాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి అభివృద్ధి కార్పొరేషన్(ఐడీసీ) ద్వారా చేపట్టిన సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ ఉత్తిపోతలుగా మిగులుతున్నాయి. ఓవైపు భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం వీటి విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన నిధులతో చిన్న, సన్నకారు రైతులకు సాగునీటి సదుపాయాన్ని కల్పించాల్సి ఉన్నా.. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎత్తిపోతల పథకాలన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగుఫలాలు అందించకుండా పోతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 559 పథకాల కింద 3.52 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉండగా.. అధికారుల అలక్ష్యంతో అది 1.55 లక్షల ఎకరాలను మించడం లేదు. 259 పథకాలు వట్టిపోయాయి..: తెలంగాణలో ఇప్పటివరకు 3.52 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.1,001 కోట్ల వ్యయంతో మిగతా 559 సాగునీటి ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. ఈ ఎత్తిపోతల నిర్వహణను సాగునీటి రైతు సంఘాలే చూసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలాచోట్ల సంఘాలు ఆర్థికంగా, సాంకేతికంగా సమన్వయం చేసుకోవడంలో విఫలమవడంతో పథకాలు చతికిలపడ్డాయి. దీనికి తోడు ఎత్తిపోతల పథకాలంటే పూర్తిగా ఆరుతడి పంటలే వేయాల్సి ఉన్నా.. అవగాహణ లేక రైతులు వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో చివరి ఆయకట్టు రైతుకు నీరు చేరడం లేదు. దీనికి తోడు మోటార్లకు రిపేర్లు వచ్చినా, వాటి నిర్వహణలో సాంకేతిక సమస్యలు తలెత్తినా పట్టించుకునే నాథుడే లేడు. దీంతో 559 పథకాల్లో 259 పథకాలు వినియోగంలో లేకుండా పోయాయి. వీటి కింద 77 వేల ఎకరాలకు కొన్నేళ్లుగా చుక్కనీరందడం లేదు. మరో 183 పథకాలు పాక్షికంగా పని చేస్తున్నాయి. వీటి కింద 1.51 లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా అందులో 84 వేల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. రూ.185 కోట్లు ఖర్చు.. 3,661 ఎకరాలకే నీరు.. పూర్తిగా పనిచేయని పథకాలను వృద్ధిలోకి తేవడం, పాక్షికంగా పనిచేస్తున్న వాటికి మరమ్మతులు చేయడం, కొత్తగా మరిన్ని ఎత్తిపోతల పథకాలు చేపట్టడానికి ప్రభుత్వం ఐడీసీకి కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. గతేడాది గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృధ్ధి నిధి(ఆర్ఐడీఎఫ్), సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం(ఏఐబీపీ)తో పాటు రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్ నుంచి మొత్తంగా రూ.370 కోట్లు కేటాయించినా అందులో రూ.184.52 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఐదు పథకాలకు సంబంధించిన రూ.28.27 కోట్ల ఆర్ఐడీ ఎఫ్ నిధులు ఈ ఏడాది జనవరి వరకు, మరో 62 పథకాలకు చెందిన రూ.63.04 కోట్ల ట్రైబల్ సబ్‌ప్లాన్ నిధులు ఈ ఏడాది మార్చి నాటికి కూడా ఇవ్వకపోవడం, మరో రెండు పథకాల పరిధిలో భూసేకరణ పూర్తికాకపోవడంతో నిధుల ఖర్చు జరుగలేదు. దీంతో 40,043 ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే 3,661 ఎకరాలకు మాత్రమే నీరిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మళ్లీ రూ.255.59 కోట్ల నిధులను కేటాయించారు. గతేడాది నిధుల ఖర్చు.. (రూ.కోట్లలో) పథకం కేటాయింపు ఖర్చు ఆర్ఐడీఎఫ్ 90 55.80 రాష్ట్ర బడ్జెట్ 220 122.59 ఏఐబీపీ 60 6.13 మొత్తం 370 184.52 -
ఇందూరు ప్రాజెక్టులు ‘డెడ్’
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దుస్థితి ఇది! రెండేళ్లుగా వర్షాల్లేక, వరద లేక ఇలా పూర్తిగా అడుగంటిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు. ఇప్పుడు 5.30 టీఎంసీల నీరు(డెడ్ స్టోరేజీ) మాత్రమే ఉంది. ప్రాజెక్ట్ నుంచి గత ఖరీఫ్‌లో ఆయకట్ట్టుకు నీరివ్వలేదు. రబీలో అదే పరిస్థితి. కనీసం తాగు నీటి పథకాలకు కూడా నీరందే పరిస్థితి లేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నిండితే తెలంగాణలోని 18.82 లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలమవుతుంది. ఇప్పుడు ఈ 18 లక్షల ఎకరాలు ఎడారిగా మారే ప్రమాదం నెలకొంది. నిజామాబాద్‌లో 1,60,578, ఆదిలాబాద్‌లో 1,45,387, వరంగల్‌లో 4,71,478, కరీంనగర్లో 6,72,900, ఖమ్మంలో 1,28,914, నల్లగొండలో 2,87,508 ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టు వెలవెలబోతుండడంతో ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు.. నిజామాబాద్‌లో 19 ఎత్తిపోతలు, ఆదిలాబాద్ జిల్లాలో 19 ముంపు గ్రామాల ఎత్తిపోతలు ఉత్తిపోతలుగానే మిగిలాయి. నిజామాబాద్ జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. 38 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇందూరుపై కరువు గజ్జకట్టింది. ప్రధాన ప్రాజెక్టులన్నీ డెడ్‌స్టోరేజీకి చేరాయి. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల కారణంగా ఖరీఫ్‌లో నిండా మునిగిన రైతన్న రబీకి రాం..రాం.. చెప్పాడు. చాలాచోట్ల భూగర్భజల నీటి మట్టం 22.4 మీటర్లకు పడిపోయింది. మంజీర నది ఏడారిని తలపిస్తుంది. తెలంగాణ జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే శ్రీరాంసాగర్ ఎండిపోయింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం దారుణంగా పడిపోయింది. వ్యవసాయ బావులు, బోర్లు అడుగంటిపోవడంతో తాగునీటి ఎద్దడి రోజురోజుకు తీవ్రమవుతోంది. జిల్లాలో కరువుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం - గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ డెడ్‌స్టోరేజీకి శ్రీరాంసాగర్, నిజాంసాగర్.. ఎడారిగా మంజీర నది * వట్టిపోతున్న ఎత్తిపోతల పథకాలు * కరువు దెబ్బకు ఖరీఫ్, రబీలకు రైతులు దూరం * జిల్లాలో తాగునీటికి కటకట.. కబేళాకు చేరుతున్న పశువులు * దారుణంగా పడిపోయిన భూగర్భ జలాల నీటిమట్టం ఎడారిగా మంజీర.. కర్ణాటక ప్రాంతం నుంచి నిజామాబాద్ జిల్లాలోకి ప్రవహించే మంజీరా నది ఇలా ఎడారిని తలపిస్తోంది. జిల్లా రైతాంగానికి మంజీర, గోదావరి నదులే జీవనాధారం. రెంజల్ మండలం కందకుర్తి సమీపంలో హరిద్రా, గోదావరి నదులతో సంగమించి ప్రవహించే ఈ నది ద్వారా 58 టీఎంసీల నీరు లభ్యమవుతుంది. మంజీరా నది ఆధారంగా బుడ్మి, దామరంచ, హన్సా, కారేగావ్, కిష్టాపూర్, పోతంగల్, కుర్తి, పైడిమాల, సంగోజీపేట తదితర ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ నీళ్లు లేక బోసిపోతున్నాయి. మంజీర పరిస్థితే ఇలా ఉండడంతో దీనిపై ఆధారపడి నిర్మించిన శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఒక్కో మనిషికి 80 లీటర్లే.. శీతాకాలం ప్రారంభం నుంచే జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. రిజర్వాయర్లు ఎండిపోవడం.. భూగర్భజలాలు అడుగంటి పోవడం జిల్లా ప్రజలకు శాపంగా మారింది. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లు ఉన్నాయి. జిల్లాలో 6.25 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి రోజు వీరికి 38 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఒక్క మనిషికి 146 లీటర్ల నీటిని అందించాలి. కానీ ప్రస్తుతం 80 నుంచి 85 లీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ‘ఉపాధి’ అంతంతే.. ఉపాధి హామీ పథకం అమలు అంతంతే ఉంది. బోధన్, మోర్తాడ్ మండలాల్లో ‘సాక్షి’ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఉపాధి కూలీల్లో కొందరికే పని లభిస్తోందని తేలింది. జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో 721గ్రామాలు, 1302 హ్యాబిటేషన్లలో 4,70,544 మందికి అధికారులు జాబ్‌కార్డులు మంజూరు చేశారు. అయితే గతవారం వరకు 604 గ్రామాలలో 1,65,961 మంది పనిచేయగా.. శుక్రవారం నాటికి వారి సంఖ్య ఒకేసారి 92,725 మందికి పడిపోయింది. కూలీలకు రూ.15.95 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి ఇదీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నారు. ప్రధాన నీటి వనరులైన రఘునాథ, మంచిప్ప చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. అలీసాగర్ నుంచి నిజాంసాగర్ నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం 11,500 అడుగుల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నీరు వేగంగా తగ్గిపోతోంది. నీటి కోసం నిజామాబాద్ నగరంలో 3,600 బోర్లు వేశారు. నగర కార్పొరేషన్లో ప్రతి మనిషికి కనీసం 140 లీటర్ల నీరివ్వాలి. కానీ రోజు విడిచి రోజు 110 లీటర్ల నీరే ఇస్తున్నారు. బోధన్ పట్టణంలో 35 వార్డులు ఉన్నాయి. పట్టణానికి ప్రధానంగా నీటిని బెల్లాల్ చెరువు నుంచి నీటిని అందిస్తున్నారు. 10 వేల కుళాయిలు ఉన్నాయి. రోజుకు 10 ఎంఎల్డీలు అవసరం. కానీ చెరువులో నీరు అందుబాటులో లేకపోవడంతో రెండు రోజులకు ఒకసారి నీటిని అందిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో 60 వేల జనాభా ఉంది. ఒక్కో వ్యక్తికి 135 లీటర్ల నీటి సరఫరా చేయాల్సి ఉండగా.. 58 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నారు. ప్రతి మనిషికి 150 లీటర్ల నీటిని అందించాల్సి ఉండగా 120 లీటర్లు ఇస్తున్నారు. ఇక తండాల్లో నీటి కోసం కిలోమీటర్ల మేర వెళ్తున్నారు. వాగులోని చెలిమ నీటితో దాహం తీర్చుకుంటున్నారు. కబేళాలకు పశువులు.. జిల్లాలో గత ఆరునెలల కాలంలో ప్రధాన సంతలో వేల సంఖ్యలో పశువులు అమ్ముడుపోయాయి. కరువు, పశుగ్రాసం కొరత, నీళ్లు లేక రైతులు పశువులను అంగట్లో పెడుతున్నారు. కామారెడ్డి, సాటాపూర్, బాన్సువాడ, ఇందల్వాయి, బీబీపేట, పెద్దమల్లారెడ్డి, పిట్లం, నవీపేట్, నందిపేట్ తదితర సంతల్లో పశువులు అధికంగా అమ్ముడుపోయాయి. కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో గత నాలుగు నెలల్లో 500 వరకు పశువులను అమ్మేశారు. దోమకొండ మండలం మాందాపూర్‌లో ఒకప్పుడు 100 జతల ఎడ్లు ఉంటే ప్రస్తుతం 10 జతలు కూడా లేవని స్థానికులు చెప్తున్నారు. రెతులు అమ్మేసిన పశువుల్లో 90శాతం పశువులు కబేళాలకు తరలుతున్నాయి. గత ఐదు నెలల కాలంలో 50 వేలకుపైగా పశువుల అమ్మకాలు సాగినట్లు అంచనా. జిల్లాలో 8 లక్షల పశువులు, మరో 8 లక్షల వరకు గొర్రెలు, మేకలు ఉన్నాయి. వీటి గ్రాసానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పశువులకు గ్రాసం, నీటి వసతి కోసం రూ.58.15 కోట్ల సాయం కావాలని కేంద్ర కరువు బందానికి నివేదిక ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఒక్కపైసా రాలేదు. రోజుకు 15 కోట్ల నీళ్ల వ్యాపారం నీటి సమస్య వ్యాపారులకు వరంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో అధికారికంగా వాటర్ప్లాంట్ల నిర్వాహకులు ఒక్కో క్యాన్ (20లీటర్లు) ధర రూ.15ల నుంచి రూ.25లకు పెంచారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా నీళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారుగా 380ల వరకు వాటర్ ప్లాంట్లు ఉన్నా... కేవలం ఐదింటికీ మాత్రమే భారత ప్రమాణాల సంస్థ (బీఎస్ఐ) అనుమతి ఉంది. మిగతా చోట్ల నాణ్యతా ప్రమాణాలను మచ్చుకైనా పాటించడం లేదు. అయినా రూ.కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. రోజుకు రూ.15 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు అధికారుల అంచనా. మినరల్ వాటర్ పేరిట జనరల్ వాటర్ సరఫరా చేస్తూ వినియోగదారులకు లేని రోగాలను అంటగడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీఎస్ఐ నిబంధనలను పాటించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఖరీఫ్, రబీలకు రైతులు దూరం గడచిన ఖరీఫ్‌లో జిల్లాలో 4,18,100 హెక్టార్లలో పంటలు సాగు చేస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు.. 1.40 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయాలని నిర్ణయించారు. అత్యధికంగా 1.50 లక్షల హెక్టార్లలో వరి, 1.50 లక్షల హెక్టార్లలో సోయా సాగు చేస్తారని భావించారు. 55,000 హెక్టార్లలో మొక్కజొన్న, 15,000 హెక్టార్లలో పత్తి సాగు అవుతుందని అంచనా వేశారు. అయితే వర్షాల్లేక రైతులు 53 శాతం సాగుతోనే సరిపెట్టారు. రబీ విషయానికొస్తే 2,03,900 హెక్టార్లలో వివిధ పంటలు వేస్తారని అంచనా వేయగా...81,768 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. సరిపడే నిధులున్నాయి జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా మొదట్నుంచీ ముందుచూపుతో వ్యవహరిస్తున్నాం. ముందస్తుగా పం పిన ప్రతిపాదనల మేర కు ప్రభుత్వం కూడా సరిపడ నిధులు విడుదల చేసింది. తాగునీటి సమస్య ఉండే గ్రామాలను గు ర్తించి రైతుల నుంచి వ్యవసాయ బావులు, బోర్లు అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేస్తున్నాం. మారుమూల గ్రామాలు, తండాలకు ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో సీఆర్ఎఫ్, నాన్ సీఆర్ఎఫ్ కింద వచ్చిన రూ.7 కోట్లు ఖర్చు చేశాం. ప్రభుత్వ ఆదేశాలు, ప్రజాప్రతిని ధుల సూచనల మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ నీటి సమస్యను పరిష్కరిస్తున్నాం. - ఎ.రవీందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్, నిజామాబాద్ మేత లేక పశువులను అమ్ముకుంటున్నారు పశువులకు మేత కరువైంది. పశు పోషణ భారంగా మారింది. అందుకే రైతులు పశులను పోషించలేక అమ్మేస్తున్నారు. గడ్డి విత్తనాల సరఫరా లేదు. పశువులను వ్యాపారులు తక్కువ ధరలకు కొంటున్నారు. పంటలు పండక ఇప్పటికే నష్టపోయిన రైతులు.. పశువులకు ధరలు పలకకపోవడంతో మరింత నష్టపోతున్నారు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి. - దుబాస్ రాములు, రైతు సంఘం నేత నీళ్లకు చాలా తఖీలీబు ఉన్నది మా వజ్జపల్లి తండాలో బోరు బావులు లేవు. ఉన్న ఒక్క చేతి పంపు ఎండిపోయింది. నీళ్ల ట్యాంకుకు నీళ్లు సరఫరా చేసే బోరు ఎత్తి పోయింది. తాగునీళ్లకు చాలా తఖీలీబు అయితుంది. ప్రైవేటు బోరులు కిరాయికి తీసుకున్నరు. కానీ అవి కూడ సన్నం అస్తున్నయి. ఇంకో బోరు వేస్తే బాగుంటది. - బూలీ బాయి, వజ్జపల్లి తండా, గాంధారి మండలం అడుగంటిన నిజాంసాగర్ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు ఇలా పూర్తిగా అడుగంటింది. ప్రాజెక్టు పరిధిలోని 2.53 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నిజామాబాద్ నగరంతో పాటు బోధన్ పట్టణం సహా 28 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందుతుంది. నిజాంసాగర్ సామర్థ్యం 58 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 0.30 టీఎంసీల నీరు(డెడ్‌స్టోరేజీ) మాత్రమే ఉంది. ప్రాజెక్టులో నీరు మరో 15 రోజుల వరకే సరిపోతుంది. ఆ తర్వాత తాగునీటి కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. కామారెడ్డి డివిజన్లోని మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, కామారెడ్డి, తాడ్వాయి, గాంధారి, లింగంపేట, నాగిరెడ్డి పేట మండలాలు మినహా జిల్లాలోని అన్ని మండలాలకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రాజెక్టు కింద 283 ఉప కాలువల ద్వారా 1,771 కిలోమీటర్ల వరకు నీటి పంపిణీ ఉంటుంది. -
ఎన్నాళ్లు..ఎన్నేళ్లు!
అనుపు,కొప్పునూరు ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. 90 శాతం పనులు పూర్తయినా, మిగిలిన పది శాతం నిర్మాణానికి ససేమిరా ముందుకు రావడం లేదు. ఇవి పూర్తయితే దాదాపు పదివేల ఎకరాలకు సాగు నీరు అందుతుందనే రైతుల ఆశలపై ఏటా నీళ్లు చల్లుతోంది. - అనుపు, కొప్పునూరు ఎత్తిపోతల పథకాలపై శీతకన్ను - మిగిలిన పదిశాతంపనులు పూర్తి చేయడంలోనిర్లక్ష్యం మాచర్లటౌన్: నాగార్జునసాగర్ చెంతనే ఉన్నా ఆ నీటిని పొందలేని గ్రామాలు అనేకం. రెండు కిలోమీటర్ల దూరంలోనే పారుతున్న సాగర్ రిజర్వాయర్‌ను చూస్తూ రైతులు బాధపడుతున్న దశలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సాగునీటికి భరోసానిచ్చారు. 2006 జూన్‌లో మండలంలో అనుపు, కొప్పునూరు ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. రూ.100 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారు. 60 శాతం పనులు పూర్తయిన తరుణంలో ఆయన హఠాన్మరణం పొందారు. ఆ తరువాత మరో 30 శాతం పనులు జరిగాయి. ఈ నిర్మాణాలు పూర్తయితే, మండలంలోని చింతలతండా నుంచి కొత్తపల్లి వరకు 10వేల ఎకరాల భూములకు సాగు నీరు అందుతుంది. అయితే, సాగర్ రిజర్వాయర్‌లో జాక్‌వెల్స్ నిర్మాణ అనంతరం ఆ ప్రాంతంలోని సబ్‌స్టేషన్, పైప్లైన్ల నిర్మాణాలకు వన్యప్రాణి, అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అనుమతులు కావాలంటే తమ శాఖకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సమస్య తేలలేదు. సాగునీరు రాలేదు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న వేలాది మంది రైతులకు ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎంతో మేలు జరిగేది. ఎత్తిపోతల పథకాలు నిలిచిపోయి రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని మూడు రోజుల కిందట గుంటూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. వెంటనే ప్రాజెక్టు చేపట్టి రైతులకు మేలు చేయాలని కోరారు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలోని కరువును దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అటవీ శాఖ అనుమతులు పొంది తమకు మేలు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. -
పనిచేయని పథకాలు
భద్రాచలం: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాలు మూలనపడ్డాయి. మరమ్మతులకు గురైన పథకాలను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించకపోవటంతో అవి ఉత్తిపోతలుగానే మిగిలాయి. అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం, పినపాక, వైరా, ఇల్లెందు నియోజకవర్గాల్లో 177 ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. ఈ ఆరు నియోజకవర్గాల్లో వీటి ద్వారా దాదాపుగా 31,033 ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ఐటీడీఏ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక సాగునీటి విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపంతో ఈ ఎత్తిపోతల పథకాలు తరచూ మరమ్మతులకు వస్తున్నాయి. మరమ్మతులపై అశ్రద్ధ ఏజెన్సీలోని 177 ఎత్తిపోతల పథకాల్లో ప్రస్తుతం 46 పనిచేయటం లేదని, మరికొన్నిటికి సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. 2013లో వరదల కారణంగా మరో 85 ఎత్తిపోతల పథకాలు ముంపుకు గురై పనిచేయటం లేదని వారు తెలిపారు. వీటికి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలంటే రూ.210.93 లక్షలు అవసరమవుతాయంటూ ప్రభుత్వానికి నివేదించారు. అయినప్పటికీ ఇప్పటివరకు చిల్లి గవ్వ కూడా రాలేదు. వరద ముంపునకు గురైన పథకాల ద్వారా 9244 ఎకరాలకు సాగు నీరందాల్సుందని అధికారులు చెబుతున్నారు. ఇది జరిగి ఏడాదవుతున్నా మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. నూతన పథకాలదీ అదే తీరు ఏజెన్సీ ప్రాంతంలోని ఆరు నియోజకవర్గాల్లో కొత్తగా తొమ్మిదిచోట్ల రూ.85.92లక్షల వ్యయంతో 9642 ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని చేపట్టారు. చాలాచోట్ల ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. భద్రాచలం మండలంలోని నెల్లిపాక, రాయన్పేట సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాలు పూర్తయినప్పటకీ, పైపుల ద్వారా నీరు లీకవుతోంది. పాల్వంచ మండలం గుడిపూడి, టేకులపల్లి మండలం గొల్లపల్లి వద్ద ఎత్తిపోతల పథకాల నిర్మాణం సగంలోనే ఆగింది. ముంపు మండలాల్లోనే ఎక్కువగా ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి మరమ్మతు పనులపై రంపచోడవరం ఐటీడీఏ అధికారులు ప్రతిపాదనలు చేయాల్సుంది. సాగునీటి రంగంపై సమీక్ష ఏదీ గిరిజనుల వ్యవసాయ సాగుకు తగిన సహకారమందిస్తామని పాలకులు చెబుతున్నప్పటికీ అది ఆచరణలో కనిపించటం లేదు. వచ్చే అరకొర నిధులతో చేపట్టే పనులతో అరకొరగా పనులు చేసి ఐడీసీ అధికారులు కాజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఐటీడీఏలోని సాగునీటి శాఖ అధికారుల పనితీరుపై కూడా తగిన సమీక్ష లేకపోవటంతో వారు విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎత్తిపోతల పథకాలకు మరమ్మత్తులు చేయకపోవటంతో ఈ ఖరీఫ్ సీజన్లో రైతాంగం తీవ్రమైన నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. కేవలం చెరువుల్లో ఉన్ననీటితో, బోరుబావులపైనే ఆధారపడుతూ ఖరీఫ్ సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వీటిపై దృష్టిసారించి మరమ్మత్తులకు గురైన ఎత్తిపోతల పథకాలను పునరుద్దరించేందుకు తగుచర్యలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు కోరుతున్నారు. -
ప్రశాంతంగా ‘ఎత్తిపోతల’ ఎన్నికలు
నాళేశ్వర్(నవీపేట), న్యూస్‌లైన్: నాళేశ్వర్‌లో శుక్రవారం నాళేశ్వర్ ఎత్తిపోతల పథకం పాలకవర్గం ఎన్నికలు ప్రశాంతం గా జరిగాయి. పథకం పరిధిలో 280 ఓట్లు ఉం డగా 276 పోలయ్యాయి. ఇందులో 18 ఓట్లు చెల్లలేదు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సా యంత్రం ఆరున్నర గంటల వరకు కౌంటింగ్ సాగింది. 11 డెరైక్టర్ స్థానాలకోసం 38 మంది పోటీ పడ్డారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో బందోబ స్తు ఏర్పాటు చేశారు. డెరైక్టర్లు వీరే విజేతలను ఎన్నికల అధికారులు మనోజ్‌కుమా ర్, గంగాధర్ గౌడ్ ప్రకటించారు. పుప్పాల భో జన్న, పాందు మల్లయ్య, ద్యాగ అంజయ్య, ఆర్మూర్ గంగాధర్, ద్యాగ మల్లయ్య, మైస కొం డయ్య, తూం గుండన్న, కోలకొండ శ్రీనివాస్, ఆర్మూర్ భోజన్న, తూం లక్ష్మణ్, మగ్గరి నర్స య్య డెరైక్టర్లుగా ఎన్నికయ్యారు. వీరికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందించారు. చైర్మన్‌గా పాందు మల్లయ్య? ఎత్తిపోతల పథకం చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి పాందు మల్లయ్య, మైస కొండ య్య, పుప్పాల భోజన్న పోటీ పడ్డారు. ముగ్గు రు ప్యానల్స్ ఏర్పాటు చేసుకొని బరిలో నిలిచా రు. అయితే మల్లయ్య వర్గంనుంచి ఐదుగురు గెలుపొందడంతో ఆయనే చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. శనివారం ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. -
ఎత్తిపోతున్న పథకాలు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: సాగునీటి సౌకర్యం లేని భూములను, బీడు భూములను బంజర్లుగా మార్చేందుకు ఉద్దేశించిన ఎత్తిపోతల పథకాలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి. జిల్లాలో మొత్తం 355 ఎత్తిపోతల పథకాలను వందల కోట్లు వెచ్చించి నిర్మించినా..ప్రస్తుతం వాటిలో వందకు పైగా అసలెందుకూ పనికిరాకుండా పోయాయి. జిల్లాలోని ఎత్తిపోతల పథకాల స్థితిగతులను న్యూస్‌లైన్ బృందం సోమవారం పరిశీలించింది. సాగునీటి వసతి లేని పొలాలకు దగ్గరలో కానీ, కొంత దూరంలో నీటి పారుదల ప్రాంతాలుంటే అక్కడ నుంచి నీటిని సాగు భూములకు అందించడం ఎత్తిపోతల పథకాల ఉద్దేశం. జిల్లాలో పుష్కలంగా వాగులు, ఏరులున్నా..వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. గుండ్లకమ్మ, ముసి, పాత ముసి, పాలేరు, మన్నేరు, అట్లేరు, ముట్లేరు, ఉప్పుటేరు, ఎలికేరులు జిల్లాలో ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. వీటితో పాటు రాళ్లపాడు, దున్నపోతువాగు, ఉప్పువాగు, ఎర్రవాగు, చిల్లాకాలువ, పందివాగు తదితర నీటి వనరులున్నాయి. వీటిపై కొత్తగా ఎత్తిపోతల పథకాలు ఐదేళ్లుగా ఒక్కటి కూడా మంజూరు కాకపోగా..ఇప్పటికే ఉన్నవి గాడితప్పాయి. జిల్లాలో ఎత్తిపోతల పథకాల ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాల్లో వరి పంట పండించుకునే వీలుండగా, మరో లక్ష ఎకరాల్లో ఇతర ప్రత్యామ్నాయ పంటలు రైతులు సాగుచేసుకోవచ్చు. అయితే వాటిలో కనీసం 50 వేల ఎకరాలు కూడా సక్రమంగా సాగుచేసుకునే అవకాశం లేకుండా పోయింది. కొండపి నియోజకవర్గంలో పది పథకాలుంటే ఐదు పనికిరాకుండా పోయాయి. సింగరాయకొండ మండలంలోని కనుమళ్లకు చెందిన 500 ఎకరాలు సస్యశ్యామలం చేసేందుకు * 215 లక్షలు వెచ్చించి నిర్మిస్తే.. ఆ నిధులు మొత్తం మన్నేటిలో కలిసినట్లే అయింది. అసలు మోటార్లు మాయమయ్యాయి. సంతనూతలపాడు నియోజకవర్గంలో 6 పథకాలకుగాను ఒక్క ఎమిలేయర్ చానల్ స్కీం ఒక్కటే పంటలకు జీవం పోస్తోంది. కనిగిరి నియోజకవర్గంలో నాలుగు పథకాల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. మోటార్ల మరమ్మతులే పెద్ద సమస్య ఎత్తిపోతల పథకాలకు ప్రధాన సమస్య మోటార్లు. కంపెనీ మోటార్లు ఏర్పాటు చేయకపోవడం, అసంబ్లింగ్ మోటార్లు ఎక్కువగా పథకాలకు పెట్టడం వలనే తరచూ సమస్య వ స్తోంది. బిల్లులు మాత్రం కంపెనీ మోటార్ల పేరుమీదే ఉంటాయి. దీనికి తోడు విద్యుత్ సర్వీస్ ఈ స్కీమ్‌కు కేటగిరీ-4 కింద ఉండటంతో యూనిట్ ధర భారంగా మారుతోంది. ఒక్కో యూనిట్ ధర *5.37 లు కావటం, నెలకు బిల్లులు వేలల్లో రావడంతో వాటిని కట్టలేక రైతులు అల్లాడుతున్నారు. పథకం నిర్వీర్యం కావడానికి ఇదొక కారణం కూడా. కనీసం పరిశ్రమలకు ఇచ్చిన రాయితీలు కూడా సాగునీటి కోసం వినియోగించే ఎత్తిపోతల పథకాలకు ఇవ్వకపోవడం దారుణం. 97 పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాం - వై.వెంకటేశ్వరరావు, ఈఈ జిల్లాలో మూతపడిన 97 ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలి. వాటి మరమ్మతుల కోసం *51 కోట్లు నిధులు అవసరమవుతాయని పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చి, నిధులు విడుదలైతే జిల్లాలో పూర్వ వైభవం చవి చూడవ చ్చు. వేటపాలెం మండలం మోటుపల్లి పథకాన్ని *3.30 కోట్లతో ఆధునికీకరిస్తున్నాం. అదే విధంగా నాయినపల్లి పథకానికి *2.5 కోట్లతో పనులు జరుగుతున్నాయి. -
‘తుంగభద్ర’పై రెండు లిప్టు స్కీంలు !
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదిపై రెండు లిప్టు స్కీంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ. 31 కోట్లను విడుదల చేశారు. ఈ మేరకు సోమవారం సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి బి. అరవిందరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. కర్నూలు జిల్లా బెలగాల్ మండలం పరిధిలో తుంగభద్ర నదిపై కొత్తగా లిప్టు స్కీంను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ. 23.42 కోట్లను విడుదల చేశారు. ఈ స్కీం ద్వారా సుమారు 2,270 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించనున్నారు. అలాగే ఇదే జిల్లాలో కౌతాలం పరిధిలో రూ. 8.58 కోట్లతో మరో లిప్టు స్కీంను నిర్మిస్తారు. దీన్ని ద్వారా 1,200 ఎకరాలకు సాగునీరు అందనుంది.