ఎన్నాళ్లు..ఎన్నేళ్లు!
అనుపు,కొప్పునూరు ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. 90 శాతం పనులు పూర్తయినా, మిగిలిన పది శాతం నిర్మాణానికి ససేమిరా ముందుకు రావడం లేదు. ఇవి పూర్తయితే దాదాపు పదివేల ఎకరాలకు సాగు నీరు అందుతుందనే రైతుల ఆశలపై ఏటా నీళ్లు చల్లుతోంది.
- అనుపు, కొప్పునూరు ఎత్తిపోతల పథకాలపై శీతకన్ను
- మిగిలిన పదిశాతంపనులు పూర్తి చేయడంలోనిర్లక్ష్యం
మాచర్లటౌన్: నాగార్జునసాగర్ చెంతనే ఉన్నా ఆ నీటిని పొందలేని గ్రామాలు అనేకం. రెండు కిలోమీటర్ల దూరంలోనే పారుతున్న సాగర్ రిజర్వాయర్‌ను చూస్తూ రైతులు బాధపడుతున్న దశలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సాగునీటికి భరోసానిచ్చారు. 2006 జూన్‌లో మండలంలో అనుపు, కొప్పునూరు ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. రూ.100 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారు. 60 శాతం పనులు పూర్తయిన తరుణంలో ఆయన హఠాన్మరణం పొందారు. ఆ తరువాత మరో 30 శాతం పనులు జరిగాయి.
ఈ నిర్మాణాలు పూర్తయితే, మండలంలోని చింతలతండా నుంచి కొత్తపల్లి వరకు 10వేల ఎకరాల భూములకు సాగు నీరు అందుతుంది. అయితే, సాగర్ రిజర్వాయర్‌లో జాక్‌వెల్స్ నిర్మాణ అనంతరం ఆ ప్రాంతంలోని సబ్‌స్టేషన్, పైప్‌లైన్‌ల నిర్మాణాలకు వన్యప్రాణి, అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అనుమతులు కావాలంటే తమ శాఖకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సమస్య తేలలేదు.
సాగునీరు రాలేదు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న వేలాది మంది రైతులకు ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎంతో మేలు జరిగేది. ఎత్తిపోతల పథకాలు నిలిచిపోయి రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని మూడు రోజుల కిందట గుంటూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. వెంటనే ప్రాజెక్టు చేపట్టి రైతులకు మేలు చేయాలని కోరారు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలోని కరువును దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అటవీ శాఖ అనుమతులు పొంది తమకు మేలు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.