కృష్ణా బోర్డుకు రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ | Rayalaseema Lift Irrigation DPR To Krishna Board | Sakshi
Sakshi News home page

కృష్ణా బోర్డుకు రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్

Published Wed, Dec 16 2020 4:42 AM | Last Updated on Wed, Dec 16 2020 4:42 AM

Rayalaseema Lift Irrigation DPR To Krishna Board - Sakshi

సాక్షి, అమరావతి: అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు కేంద్ర జల సంఘానికి(సీడబ్ల్యూసీ) పంపారు. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ సీడబ్ల్యూసీ సోమవారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పీహెచ్‌ఆర్‌ (పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటర్‌) ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌ ఆయకట్టుకు సాగునీరు.. కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని మరింత మెరుగ్గా సరఫరా చేసేందుకే ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 

వాటా నీటిని వాడుకోక ముందే.. 
► విభజన చట్టాన్ని తుంగలో తొక్కి.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకోకుండానే తెలంగాణ సర్కార్‌ శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను 2015లో చేపట్టింది. ఇదే తరహాలో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచడం ద్వారా రోజుకు 0.4 టీఎంసీ, ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచడం ద్వారా రోజుకు 0.5 టీఎంసీ తరలించేలా పనులు చేపట్టింది. 
► శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు 3 టీఎంసీలను తరలించేలా తెలంగాణ సర్కార్‌ కొత్తగా ప్రాజెక్టులు చేపట్టింది. సాగర్‌లో సరిపడా నీటి నిల్వలు ఉన్నప్పటికీ, దిగువన సాగునీటి అవసరాలు లేకపోయినా తెలంగాణ సర్కార్‌ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 796 అడుగుల నుంచే రోజుకు నాలుగు టీఎంసీలను తరలిస్తోంది. మొత్తంగా ఏడు టీఎంసీలను తరలిస్తుండటం వల్ల ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిపోతోంది.

841 అడుగుల్లో చుక్క నీరు రాదు
– శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పీహెచ్‌ఆర్‌ ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు రోజుకు 44 వేల క్యూసెక్కులు తరలించవచ్చు. కానీ గత పదేళ్ల రికార్డులను పరిశీలిస్తే.. ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి 15 నుంచి 20 రోజులు కూడా ఉండే అవకాశం లేదు. 
– శ్రీశైలంలో 854 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడు పీహెచ్‌ఆర్‌ ద్వారా కాలువలోకి ఏడు వేల క్యూసెక్కులే చేరుతాయి. 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే చుక్క నీరు కూడా రాదు. 
– తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు ఉన్నా సరే.. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు, చెన్నైలకు తాగునీటిని కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది.
– ఈ పరిస్థితిని అధిగమించడానికి ట్రిబ్యునల్‌ కేటాయింపు ద్వారా హక్కుగా రాష్ట్రానికి దక్కిన 512 టీఎంసీలను సమర్థవంతంగా వినియోగించుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున పీహెచ్‌ఆర్‌ దిగువన కాలువలోకి ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టింది.

డీపీఆర్‌ను అధ్యయనం చేస్తున్న కృష్ణా బోర్డు 
– కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు అక్టోబర్‌ 6న కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నేతృత్వంలో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ అయ్యింది. 
– ఈ భేటీలో తెలంగాణ సర్కార్‌ లేవనెత్తిన అభ్యంతరాలను కొట్టిపారేస్తూ.. పాత ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు మరింత మెరుగ్గా నీళ్లందించడానికి, రాయలసీమ, చెన్నైకి తాగునీటి ఇబ్బందులను పరిష్కరించడానికే ఈ ఎత్తిపోతల చేపట్టామని సీఎం వైఎస్‌ జగన్‌ బలంగా వాదనలు వినిపించారు. కొత్తగా నీటిని నిల్వ చేయడానికి ఎలాంటి రిజర్వాయర్లు నిర్మించడం లేదని స్పష్టంగా తేల్చి చెప్పారు.
– ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని అపెక్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గజేంద్రసింగ్‌ షెకావత్‌ కోరారు. ఇందులో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌ను గత నెల 16న రాష్ట్ర జల వనరుల శాఖ సీడబ్ల్యూసీకి సమర్పించింది. 
– రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఇదివరకే తేల్చి చెప్పింది. ఈ దృష్ట్యా దీనిపై అధ్యయనం చేస్తున్న కృష్ణా బోర్డు వారం రోజుల్లో డీపీఆర్‌ను ఆమోదిస్తూ నివేదిక ఇస్తుందని, అనంతరం సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇస్తుందని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ తర్వాత విభజన చట్టంలో నిబంధనల మేరకు రాయలసీమ ఎత్తిపోతలకు అపెక్స్‌ కౌన్సిల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement