భద్రాచలం: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాలు మూలనపడ్డాయి. మరమ్మతులకు గురైన పథకాలను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించకపోవటంతో అవి ఉత్తిపోతలుగానే మిగిలాయి. అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం, పినపాక, వైరా, ఇల్లెందు నియోజకవర్గాల్లో 177 ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. ఈ ఆరు నియోజకవర్గాల్లో వీటి ద్వారా దాదాపుగా 31,033 ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ఐటీడీఏ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక సాగునీటి విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపంతో ఈ ఎత్తిపోతల పథకాలు తరచూ మరమ్మతులకు వస్తున్నాయి.
మరమ్మతులపై అశ్రద్ధ
ఏజెన్సీలోని 177 ఎత్తిపోతల పథకాల్లో ప్రస్తుతం 46 పనిచేయటం లేదని, మరికొన్నిటికి సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. 2013లో వరదల కారణంగా మరో 85 ఎత్తిపోతల పథకాలు ముంపుకు గురై పనిచేయటం లేదని వారు తెలిపారు. వీటికి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలంటే రూ.210.93 లక్షలు అవసరమవుతాయంటూ ప్రభుత్వానికి నివేదించారు. అయినప్పటికీ ఇప్పటివరకు చిల్లి గవ్వ కూడా రాలేదు. వరద ముంపునకు గురైన పథకాల ద్వారా 9244 ఎకరాలకు సాగు నీరందాల్సుందని అధికారులు చెబుతున్నారు. ఇది జరిగి ఏడాదవుతున్నా మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు.
నూతన పథకాలదీ అదే తీరు
ఏజెన్సీ ప్రాంతంలోని ఆరు నియోజకవర్గాల్లో కొత్తగా తొమ్మిదిచోట్ల రూ.85.92లక్షల వ్యయంతో 9642 ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని చేపట్టారు. చాలాచోట్ల ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. భద్రాచలం మండలంలోని నెల్లిపాక, రాయన్‌పేట సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాలు పూర్తయినప్పటకీ, పైపుల ద్వారా నీరు లీకవుతోంది. పాల్వంచ మండలం గుడిపూడి, టేకులపల్లి మండలం గొల్లపల్లి వద్ద ఎత్తిపోతల పథకాల నిర్మాణం సగంలోనే ఆగింది. ముంపు మండలాల్లోనే ఎక్కువగా ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి మరమ్మతు పనులపై రంపచోడవరం ఐటీడీఏ అధికారులు ప్రతిపాదనలు చేయాల్సుంది.
సాగునీటి రంగంపై సమీక్ష ఏదీ
గిరిజనుల వ్యవసాయ సాగుకు తగిన సహకారమందిస్తామని పాలకులు చెబుతున్నప్పటికీ అది ఆచరణలో కనిపించటం లేదు. వచ్చే అరకొర నిధులతో చేపట్టే పనులతో అరకొరగా పనులు చేసి ఐడీసీ అధికారులు కాజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఐటీడీఏలోని సాగునీటి శాఖ అధికారుల పనితీరుపై కూడా తగిన సమీక్ష లేకపోవటంతో వారు విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎత్తిపోతల పథకాలకు మరమ్మత్తులు చేయకపోవటంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతాంగం తీవ్రమైన నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. కేవలం చెరువుల్లో ఉన్ననీటితో, బోరుబావులపైనే ఆధారపడుతూ ఖరీఫ్ సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వీటిపై దృష్టిసారించి మరమ్మత్తులకు గురైన ఎత్తిపోతల పథకాలను పునరుద్దరించేందుకు తగుచర్యలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు కోరుతున్నారు.
పనిచేయని పథకాలు
Published Thu, Oct 30 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM
Advertisement
Advertisement