IDC officials
-
Microsoft: త్వరలో మైక్రోసాఫ్ట్ ఐడీసీ సంచలన ప్రాజెక్ట్‌లు..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సేవలందించే కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ వాటిలో ప్రాంతీయంగా స్థానిక భాషలో సేవలందించే కంపెనీలు కొన్నే ఉంటాయి. అందులో భాగంగా ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ దేశంలో ప్రతిఒక్కరికి సాఫ్ట్వేర్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్‌లో ఇండియన్ డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ ఐడీసీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని క్యాంపస్‌లో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ రాజీవ్‌కుమార్ కేక్ కట్‌చేసి మాట్లాడారు. ‘భారతదేశంలో ప్రాంతీయ భాషల్లో సాఫ్ట్వేర్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని మైక్రోసాఫ్ట్ 1998లో ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఐడీసీ సెంటర్ రెడ్‌మండ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయం తర్వాత రెండో అతిపెద్ద రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంగా ఉంది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, నోయిడా బ్రాంచిల్లో కంపెనీ ఐడీసీ ద్వారా సేవలందిస్తోంది. ఇందులో నిపుణులైన ఇంజినీర్లు, డిజైనర్లు, పరిశోధకులు పనిచేస్తున్నారు. వినియోగదారుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని సాఫ్ట్వేర్ ఉత్పత్తులు రూపొందిస్తున్నారు. దేశంలోని విభిన్న సంప్రదాయాలు, భాషలు ఉండడంతో అందరూ ఇంగ్లిష్ వినియోగించడం కష్టం అవుతోంది. దాంతో ఎన్నో ఉపయోగకరమైన సాఫ్ట్వేర్ ఉత్పత్తులు అందరికీ చేరువకావడంలేదు. అయితే స్థానికంగా దేశంలోని అందరికీ అలాంటి సాఫ్ట్వేర్ సేవలు అందుబాటులో ఉండాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. అందులో భాగంగానే ఐడీసీను ప్రారంభించాం. ఇప్పటికీ 25 ఏళ్ల నుంచి సేవలందిస్తున్నాం. కంపెనీ ఇటీవల ‘మైక్రోసాఫ్ట్ 365’ అనే యాప్‌ను ప్రారంభించింది. అందులో ఏదైనా ఇమేజ్ రూపంలో ఉన్న టెక్ట్స్‌ను ఫొటో తీస్తే అది పూర్తిగా టెక్ట్స్ ఫార్మాట్లో మారిపోయి మనం ఎంపిక చేసిన భాషలోకి ట్రాన్స్‌లేట్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతిఒక్కరూ వారి ప్రాంతీయ భాషలో సమాచారాన్ని తెలుసుకునే వీలుంది. ఇండస్ట్రీలో కొన్ని కంపెనీలు ఇలాంటి సేవలు అందిస్తున్నా.. సైబర్ దాడుల నేపథ్యంలో ఎన్ని కంపెనీలు వినియోగదారుల డేటాకు సెక్యూరిటీ కల్పిస్తాయో ప్రశ్నార్థకమే. కానీ మైక్రోసాఫ్ట్ వినియోగదారుల డేటా ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఇలాంటి యాప్‌ల వల్ల చదువురాని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కూడా ఎంతో సమాచారం తెలుసుకోవచ్చు’ అని చెప్పారు. ప్రతిష్టాత్మక ఐడీసీ ప్రాజెక్ట్‌లపై ఆయన స్పందిస్తూ ‘జుగల్బంది అనే కోపైలట్ టూల్ ద్వారా ఇంగ్లిష్‌ను ప్రాంతీయ భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసి వాయిస్రూపంలో అందించేలా మైక్రోసాఫ్ట్ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి రైతుకు అది ఎంతో ఉపయోగపడుతుంది. అందులో ప్రభుత్వ పథకాలు, అర్హతలు, ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని మనకు కావాల్సిన భాషలో పొందవచ్చు. దాంతో చదువురానివారికి సైతం పథకాలపై అవగాహన అందించేలా కంపెనీ కృషి చేస్తోంది. ప్రస్తుతం తెలుగుతో సహా దేశంలోని 10 భాషల్లో దీన్ని అభివృద్ధి చేశాం. త్వరలో 22 ప్రాంతీయ భాషలకు విస్తరిస్తాం. ఈ టూల్కోసం మైక్రోసాఫ్ట్ అజూర్ ఓపెన్‌ఏఐను వినియోగిస్తున్నాం. త్వరలో ‘భాషిణి’ అనే చాట్‌బాట్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నాం. దీని ద్వారా నేరుగా మనకు తెలిసిన భాషలో సందేహాలు అడిగితే జనరేటివ్ ఏఐ సహాయంతో అందుకు అనువుగా సమాధానాలు చెబుతుంది’ అని రాజీవ్‌కుమార్ వివరించారు. కంపెనీ ఉద్యోగుల కృషితోనే ఇదంతా సాధ్యమవుతోందని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: తెలంగాణను దాటేసిన ఏపీ..! మైక్రోసాఫ్ట్ ఐడీసీ మైక్రోసాఫ్ట్ 365తోపాటు జుగల్బందీ, అజూర్ స్పెషలైజ్డ్ ఏఐ సూపర్‌కంప్యూటర్‌ను ఆవిష్కరించింది. విండోస్ 11లో వాయిస్ యాక్సెస్ ఫీచర్‌ను డెవలప్ చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
10 శాతం పెరిగిన ట్యాబ్‌ల అమ్మకాలు
ఐడీసీ... సెప్టెంబర్ క్వార్టర్ గణాంకాలు న్యూఢిల్లీ: ట్యాబ్లెట్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలిపింది. గత ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 8,60,000 గా ఉన్న ట్యాబ్‌ల విక్రయాలు ఈ ఏడాది ఇదే క్వార్టర్‌కు 10 శాతం వృద్ధితో 9,40,000కు పెరిగాయని పేర్కొంది. ఏడాది కాలంలో ఇదే గరిష్టమైన వృద్ధి అని తెలిపింది. ప్రభుత్వ, వాణిజ్య సంస్థల నుంచి డిమాండ్ పెరగడం, పండుగల సీజన్ కారణంగా అమ్మకాలు పెరిగాయని వివరించింది. ట్యాబ్లెట్ల విక్రయాల్లో శామ్‌సంగ్‌దే అగ్రస్థానం. 22 శాతం మార్కెట్ వాటాతో ఈ కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమ్యాక్స్(10.9 శాతం), ఐ బాల్(10.6 శాతం), డేటా విండ్(8.2 శాతం), యాపిల్ (6.7 శాతం) ఉన్నాయి. -
పనిచేయని పథకాలు
భద్రాచలం: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాలు మూలనపడ్డాయి. మరమ్మతులకు గురైన పథకాలను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించకపోవటంతో అవి ఉత్తిపోతలుగానే మిగిలాయి. అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం, పినపాక, వైరా, ఇల్లెందు నియోజకవర్గాల్లో 177 ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. ఈ ఆరు నియోజకవర్గాల్లో వీటి ద్వారా దాదాపుగా 31,033 ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ఐటీడీఏ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక సాగునీటి విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపంతో ఈ ఎత్తిపోతల పథకాలు తరచూ మరమ్మతులకు వస్తున్నాయి. మరమ్మతులపై అశ్రద్ధ ఏజెన్సీలోని 177 ఎత్తిపోతల పథకాల్లో ప్రస్తుతం 46 పనిచేయటం లేదని, మరికొన్నిటికి సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. 2013లో వరదల కారణంగా మరో 85 ఎత్తిపోతల పథకాలు ముంపుకు గురై పనిచేయటం లేదని వారు తెలిపారు. వీటికి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలంటే రూ.210.93 లక్షలు అవసరమవుతాయంటూ ప్రభుత్వానికి నివేదించారు. అయినప్పటికీ ఇప్పటివరకు చిల్లి గవ్వ కూడా రాలేదు. వరద ముంపునకు గురైన పథకాల ద్వారా 9244 ఎకరాలకు సాగు నీరందాల్సుందని అధికారులు చెబుతున్నారు. ఇది జరిగి ఏడాదవుతున్నా మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. నూతన పథకాలదీ అదే తీరు ఏజెన్సీ ప్రాంతంలోని ఆరు నియోజకవర్గాల్లో కొత్తగా తొమ్మిదిచోట్ల రూ.85.92లక్షల వ్యయంతో 9642 ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని చేపట్టారు. చాలాచోట్ల ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. భద్రాచలం మండలంలోని నెల్లిపాక, రాయన్పేట సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాలు పూర్తయినప్పటకీ, పైపుల ద్వారా నీరు లీకవుతోంది. పాల్వంచ మండలం గుడిపూడి, టేకులపల్లి మండలం గొల్లపల్లి వద్ద ఎత్తిపోతల పథకాల నిర్మాణం సగంలోనే ఆగింది. ముంపు మండలాల్లోనే ఎక్కువగా ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి మరమ్మతు పనులపై రంపచోడవరం ఐటీడీఏ అధికారులు ప్రతిపాదనలు చేయాల్సుంది. సాగునీటి రంగంపై సమీక్ష ఏదీ గిరిజనుల వ్యవసాయ సాగుకు తగిన సహకారమందిస్తామని పాలకులు చెబుతున్నప్పటికీ అది ఆచరణలో కనిపించటం లేదు. వచ్చే అరకొర నిధులతో చేపట్టే పనులతో అరకొరగా పనులు చేసి ఐడీసీ అధికారులు కాజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఐటీడీఏలోని సాగునీటి శాఖ అధికారుల పనితీరుపై కూడా తగిన సమీక్ష లేకపోవటంతో వారు విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎత్తిపోతల పథకాలకు మరమ్మత్తులు చేయకపోవటంతో ఈ ఖరీఫ్ సీజన్లో రైతాంగం తీవ్రమైన నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. కేవలం చెరువుల్లో ఉన్ననీటితో, బోరుబావులపైనే ఆధారపడుతూ ఖరీఫ్ సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వీటిపై దృష్టిసారించి మరమ్మత్తులకు గురైన ఎత్తిపోతల పథకాలను పునరుద్దరించేందుకు తగుచర్యలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు కోరుతున్నారు.