టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సేవలందించే కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ వాటిలో ప్రాంతీయంగా స్థానిక భాషలో సేవలందించే కంపెనీలు కొన్నే ఉంటాయి.
అందులో భాగంగా ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ దేశంలో ప్రతిఒక్కరికి సాఫ్ట్‌వేర్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్‌లో ఇండియన్ డెవలప్‌మెంట్ సెంటర్(ఐడీసీ)ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ ఐడీసీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని క్యాంపస్‌లో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ రాజీవ్‌కుమార్ కేక్ కట్‌చేసి మాట్లాడారు.
‘భారతదేశంలో ప్రాంతీయ భాషల్లో సాఫ్ట్‌వేర్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని మైక్రోసాఫ్ట్ 1998లో ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్(ఐడీసీ)ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఐడీసీ సెంటర్ రెడ్‌మండ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయం తర్వాత రెండో అతిపెద్ద రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రంగా ఉంది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, నోయిడా బ్రాంచిల్లో కంపెనీ ఐడీసీ ద్వారా సేవలందిస్తోంది. ఇందులో నిపుణులైన ఇంజినీర్లు, డిజైనర్లు, పరిశోధకులు పనిచేస్తున్నారు. వినియోగదారుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు రూపొందిస్తున్నారు. దేశంలోని విభిన్న సంప్రదాయాలు, భాషలు ఉండడంతో అందరూ ఇంగ్లిష్ వినియోగించడం కష్టం అవుతోంది. దాంతో ఎన్నో ఉపయోగకరమైన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు అందరికీ చేరువకావడంలేదు. అయితే స్థానికంగా దేశంలోని అందరికీ అలాంటి సాఫ్ట్‌వేర్ సేవలు అందుబాటులో ఉండాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. అందులో భాగంగానే ఐడీసీను ప్రారంభించాం. ఇప్పటికీ 25 ఏళ్ల నుంచి సేవలందిస్తున్నాం. కంపెనీ ఇటీవల ‘మైక్రోసాఫ్ట్ 365’ అనే యాప్‌ను ప్రారంభించింది. అందులో ఏదైనా ఇమేజ్ రూపంలో ఉన్న టెక్ట్స్‌ను ఫొటో తీస్తే అది పూర్తిగా టెక్ట్స్ ఫార్మాట్‌లో మారిపోయి మనం ఎంపిక చేసిన భాషలోకి ట్రాన్స్‌లేట్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతిఒక్కరూ వారి ప్రాంతీయ భాషలో సమాచారాన్ని తెలుసుకునే వీలుంది. ఇండస్ట్రీలో కొన్ని కంపెనీలు ఇలాంటి సేవలు అందిస్తున్నా.. సైబర్ దాడుల నేపథ్యంలో ఎన్ని కంపెనీలు వినియోగదారుల డేటాకు సెక్యూరిటీ కల్పిస్తాయో ప్రశ్నార్థకమే. కానీ మైక్రోసాఫ్ట్ వినియోగదారుల డేటా ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఇలాంటి యాప్‌ల వల్ల చదువురాని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కూడా ఎంతో సమాచారం తెలుసుకోవచ్చు’ అని చెప్పారు.
ప్రతిష్టాత్మక ఐడీసీ ప్రాజెక్ట్‌లపై ఆయన స్పందిస్తూ ‘జుగల్‌బంది అనే కోపైలట్ టూల్ ద్వారా ఇంగ్లిష్‌ను ప్రాంతీయ భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసి వాయిస్‌రూపంలో అందించేలా మైక్రోసాఫ్ట్ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి రైతుకు అది ఎంతో ఉపయోగపడుతుంది. అందులో ప్రభుత్వ పథకాలు, అర్హతలు, ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని మనకు కావాల్సిన భాషలో పొందవచ్చు. దాంతో చదువురానివారికి సైతం పథకాలపై అవగాహన అందించేలా కంపెనీ కృషి చేస్తోంది. ప్రస్తుతం తెలుగుతో సహా దేశంలోని 10 భాషల్లో దీన్ని అభివృద్ధి చేశాం. త్వరలో 22 ప్రాంతీయ భాషలకు విస్తరిస్తాం. ఈ టూల్‌కోసం మైక్రోసాఫ్ట్ అజూర్ ఓపెన్‌ఏఐను వినియోగిస్తున్నాం. త్వరలో ‘భాషిణి’ అనే చాట్‌బాట్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నాం. దీని ద్వారా నేరుగా మనకు తెలిసిన భాషలో సందేహాలు అడిగితే జనరేటివ్ ఏఐ సహాయంతో అందుకు అనువుగా సమాధానాలు చెబుతుంది’ అని రాజీవ్‌కుమార్ వివరించారు. కంపెనీ ఉద్యోగుల కృషితోనే ఇదంతా సాధ్యమవుతోందని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: తెలంగాణను దాటేసిన ఏపీ..!
మైక్రోసాఫ్ట్ ఐడీసీ మైక్రోసాఫ్ట్ 365తోపాటు జుగల్‌బందీ, అజూర్ స్పెషలైజ్డ్ ఏఐ సూపర్‌కంప్యూటర్‌ను ఆవిష్కరించింది. విండోస్ 11లో వాయిస్ యాక్సెస్ ఫీచర్‌ను డెవలప్ చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment