'మేఘా' రికార్డు! | MEIL is record with the construction of Kaleshwaram | Sakshi
Sakshi News home page

'మేఘా' రికార్డు!

Published Thu, Jun 20 2019 2:50 AM | Last Updated on Thu, Jun 20 2019 2:50 AM

MEIL is record with the construction of Kaleshwaram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచంలోనే అత్యంత భారీ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అనతి కాలంలో పూర్తి చేయడంలో మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిర్ణీత గడువుకు ముందే పంప్‌హౌజ్‌లు, విద్యుత్‌ సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసి ఈ నెల 21న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రారంభోత్సవంలో గోదావరి నీటి ఎత్తిపోతలకు మార్గం సుగమం చేసింది. ముఖ్యంగా లింక్‌–1 లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎత్తిపోతల కేంద్రాలను, లింక్‌– 2లోని ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్‌ కేంద్రం ప్యాకేజీ–8లను రెండేళ్లలోనే సిద్ధం చేసి మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు నీటి తరలింపు ప్రక్రియకు రాచమార్గం పరిచింది. 

ప్రపంచంలోనే తొలిసారి.. 
కాళేశ్వరం ద్వారా రోజూ గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మిస్తున్న ఈ భారీ పథకంలో 22 ఎత్తిపోతల కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, అందులో 17 కేంద్రాల నిర్మాణాలను మేఘా చేపట్టింది. ఇందులో మొత్తం 120 మెషీన్‌లను (ప్రతి మెషీన్‌లోను ఒక పంపు, ఒక మోటారు ఉంటాయి) ఏర్పాటు చేస్తుండగా, అందులో 105 మెషీన్‌లను మేఘానే ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌజ్‌లను, ప్యాకేజీ–8 పనులను పూర్తి చేసి పాక్షికంగా నీటిని పంపింగ్‌ చేసేలా పనులు పూర్తి చేసింది. మొదటిదశలో 63 మెషీన్ల ఏర్పాటు లక్ష్యంగా ఎంఈఐఎల్‌ పనులు ప్రారంభించగా రెండేళ్ల కాలంలో 33 మెషీన్లను పంపింగ్‌కు సిద్ధం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ–8, ప్యాకేజీ–14లోని పంపుహౌజ్‌లు నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకాలుగా అమెరికాలోని కొలరాడో, ఈజిప్ట్‌లోని గ్రేట్‌ మేన్‌మేడ్‌ రివర్‌కు పేరు పొందగా, వీటి పంపు సామర్థ్యం హార్స్‌పవర్‌లోనే ఉంది. వీటి నిర్మాణానికి మూడు దశాబ్దాల సమయం పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో హంద్రీనీవా, దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, పట్టిసీమ, పురుషోత్తపట్నం వంటి ఎత్తిపోతల పథకాలు చేపట్టినా, 40 మెగావాట్ల సామర్థ్యం గల భారీ మెషీన్లను కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోనే ఉపయోగించారు. కానీ కాళేశ్వరంలో 139 మెగావాట్ల సామర్థ్యం గల పంపులను వినియోగిస్తున్నారు. తొలిదశలో 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు 4,992 మెగావాట్ల విద్యుత్‌ అవసరముండగా, ఇందులో 3,057 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా వ్యవస్థ, అందులో సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్మాణ పనులను ఎంఈఐఎల్‌ సిద్ధం చేసింది. 

ప్యాకేజీ–8లో ఆవిష్కృతం.. 
అద్భుతమైన పంపింగ్‌ స్టేషన్‌ను భూ ఉపరితలానికి 330 మీటర్ల లోతున మేఘా నిర్మించింది. 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్‌ పంపుల యూనిట్లను ఇక్కడ సిద్ధం చేసింది. ప్రతి పంపు మోటారు బరువు 2,376 మెట్రిక్‌ టన్నులు ఉందంటే ప్రతి యూనిట్‌ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఈ పంప్‌ హౌజ్‌లో ప్రతి అంతస్తులోనూ 87,995 చదరపు అడుగుల కాంక్రీటు నిర్మాణం చేసింది. ట్రాన్స్‌ఫార్మర్‌ బేలు, కంట్రోల్‌ రూంలు రెండు చొప్పున, బ్యాటరీ రూం, మోటార్‌ రూమ్‌ ఒక్కొక్కటి చొప్పున నిర్మించగా, ఎల్‌టీ ప్యానెల్స్, పంప్‌ ఫ్లోర్, కంప్రెషర్‌లు కలిపి మొత్తం 4 అంతస్తుల్లో నిర్మించారు. ఈ పంపుమోటార్లను భూ అంతర్భాగంలో ఏర్పాటు చేసినందున భవిష్యత్తులో ఎలాంటి సాంకేతిక సమస్యలూ ఎదురుకాకుండా అత్యంత శ్రద్ధతో వీటి నిర్మాణాలు చేశారు. మొత్తం పనిలో 40 శాతం వాటా కింద బీహెచ్‌ఈఎల్, మోటార్లు, పంపులు, యంత్ర పరికరాలు, విడిభాగాలు రూపంలో సరఫరా చేయగా, వాటిని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ప్యాకేజీ–8 వద్దకు తీసుకొచ్చాక వాటిని బిగించే 60 శాతం పనిని ఎంఈఐఎల్‌ తన ఇంజనీరింగ్‌ సాంకేతిక నైపుణ్యంతో పూర్తి చేసింది. 

గడువుకు ముందే మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ల పంప్‌హౌజ్‌ల నిర్మాణం 
గోదావరి నీటి ఎత్తిపోతలకు పనులు పూర్తి చేసిన మేఘా 
3,057 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేసేలా పనులు పూర్తి 
ప్రపంచంలోనే అతిపెద్ద పంపింగ్‌ స్టేషన్‌ ప్యాకేజీ–8లో సిద్ధంగా ఉంచిన మేఘా 

ఇది మా అదృష్టం
‘ఈ ఎత్తిపోతల పథకంలో భాగస్వాములం కావడం మా అదృష్టం. ఈ ఇంజనీరింగ్‌ అద్భుతం లో పాలు పంచుకుని పర్యవేక్షించే భాగ్యం కలిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద అండర్‌గ్రౌండ్‌ పంప్‌హౌజ్‌ను, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లో 6 మెషీన్లను 10 నెలల సమయంలో పూర్తి చేయడం ప్రపంచ రికార్డు. బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా ఇది చరిత్రలో నిలుస్తుంది’  
- బి.శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement