చంద్లాపూర్ పంపుహౌస్ వద్ద సబ్ స్టేషన్‌లో పూజలు నిర్వహిస్తున్న ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు నిరంతరం విద్యుత్‌సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. మల్లన్నసాగర్‌కు నీళ్లు తరలించడానికి సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ పంపుహౌస్ వద్ద 134.8 మెగావాట్ల సామర్థ్యం గల పంపునకు అవసరమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను సోమవారం ఆయన ప్రారంభించారు. ఇందులో 400 కేవీ సబ్ స్టేషన్, నీటిపంపింగ్ వ్యవస్థను నియంత్రించే కంట్రోల్ రూమ్ ఉన్నాయి. అక్కడి విద్యుత్‌లైన్లు, మోటార్లు, టన్నెల్‌ను ప్రభాకర్‌రావు పరిశీలించారు. ఏర్పాట్లపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
నీటి పంపింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. ప్రాజెక్టు కోసం ప్రతి పంపుహౌస్ వద్ద డెడికేటెడ్ సబ్‌స్టేషన్, ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన పంపుసెట్లు వాడుతున్నందున అన్ని సాంకేతిక అం శాలపై ముందు జాగ్రత్తచర్యలు తీసుకున్నామన్నారు. పంపుసెట్ల పనితీరును ఒకటికి రెండుసార్లు పరీక్షించుకున్నట్లు వెల్లడించారు. పంపుసెట్లకు అవసరమైన విద్యుత్ కోసం ఏర్పాట్లు చేయడంతోపాటు భవిష్యత్తులో నిర్వహణకు సంబంధించి కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు.
నీటిని ఎత్తిపోయడం అత్యంత ముఖ్యం
తెలంగాణకు లైఫ్‌లైన్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని లిఫ్ట్ చేయడం అత్యంత ముఖ్యమైన విషయమని ప్రభాకర్‌రావు చెప్పారు. నీటిని లిఫ్టు చేయడానికి సకాలంలో సబ్ స్టేషన్లు నిర్మించి, లైన్లు ఏర్పాటు చేసిన అధికారులను అభినందించారు. మిడ్‌మానేరుకు చేరిన నీరు అక్కడి నుంచి అంతగిరి రిజర్వాయర్ చేరుకుంటుంది. అంతగిరి నుంచి రంగనాయక్ సాగర్‌కు వస్తుంది. రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్నసాగర్‌కు నీరు చేరాలంటే 110 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది.
ఇందుకోసం 539.20 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన పంపులతో లిఫ్టు చేయాల్సి ఉంది. దీనికోసం ఒక్కోటి 134.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్లను బిగించారు. దీనికి కావాల్సిన విద్యుత్‌ను ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా చేసేందుకు చంద్లాపూర్ లో 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మించారు. అక్కడే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ట్రాన్స్ కో జేఎండీ సి.శ్రీనివాస రావు, డైరెక్టర్లు సూర్యప్రకాశ్, జగత్ రెడ్డి, నర్సింగ్ రావు, నీటి పారుదల శాఖ ఈఎన్సీ హరేరామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment