విద్యుదుత్పత్తి పెరగాలి | KCR Visits Ramagundam NTPC | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం 

Published Sun, May 19 2019 2:07 AM | Last Updated on Sun, May 19 2019 4:59 AM

KCR Visits Ramagundam NTPC - Sakshi

చిత్రంలో ప్రభాకర్‌రావు, సీఎస్‌ ఎస్‌కే జోషి

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణ విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుదుత్పత్తి జరగాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, ఐటీ, సాగునీటి ప్రాజెక్టులకు నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగేలా ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ) ఆధ్వర్వంలో రామగుండంలో నిర్మిస్తున్న తెలంగాణ విద్యుత్‌ కార్మాగారాన్ని శనివారం సీఎం సందర్శించారు. అనంతరం ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్‌ సింగ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శులు స్మితా సబర్వాల్, నర్సింగరావు, సింగరేణి సీఎండీ ఎన్‌. శ్రీధర్‌ తదితరులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ విద్యుత్‌ అవసరాలు, ప్రస్తుత ఉత్పత్తి, భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమయ్యే డిమాండ్‌ వంటి అంశాలపై వీరితో సమీక్ష నిర్వహించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావొచ్చిందని.. రోజుకు 2టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు పనులు వేగవంతమయ్యాయన్నారు. వచ్చే సంవత్సరం జూన్‌ నాటికి రోజుకు 3టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని, దానికి దాదాపు 6వేల మెగావాట్ల విద్యుత్‌ అవసరమవుతుందని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా.. పునర్విభజన చట్టంలో 4వేల మెగావాట్ల పవర్‌ప్లాంట్లను కేటాయించినందున.. తెలంగాణ విద్యుత్‌ కర్మాగారానికి ప్రధానమంత్రి 2016 ఆగస్టులో శంకుస్థాపన చేశారని ఎన్టీపీసీ అధికారులు గుర్తుచేశారు. వేగంగా ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో అల్ట్రాసూపర్‌ టెక్నాలజీని వినియోగిస్తూ.. ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు. 1,600 మెగావాట్ల సామర్థ్యమున్న మొదటి ప్లాంట్‌ను అక్టోబర్‌ 2020లోగా.. 2,400 మెగావాట్ల సామర్థ్యమున్న రెండవ యూనిట్‌ను ఫిబ్రవరి 2021 వరకు పూర్తి చేస్తామని తెలిపారు. అయితే.. నిర్ణీత గడువుకంటే ముందే ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం వారిని కోరారు. తెలంగాణలో రైతులకు సాగునీరందించడానికి గోదావరి నుంచి నీటిని ఎత్తిపోయడం ఒకటే మార్గమని, దానికి విద్యుత్‌ అందించేందుకు ఎన్టీపీసీ సైతం సహకరించాలని సీఎం కోరారు. ప్రస్తుతం నడుస్తున్న ఎన్టీపీసీ ప్లాంట్ల ద్వారానే విద్యుత్‌ తీసుకుంటే వెంటనే మన అవసరాలు తీరతాయని, ధర కూడా కలిసొస్తుందని సీఎం అన్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు.. ఈ విషయంపై సమన్వయం చేస్తారని ముఖ్యమంత్రి చెప్పారు. 

బొగ్గు విధానం మార్చాలి 
విద్యుదుత్పత్తి కోసం చేసే బొగ్గు కేటాయింపు విధానంలో ఉత్పత్తి వ్యయం తగ్గించేలా సమూల మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో త్వరలో ఏర్పడే కొత్త ప్రభుత్వం దగ్గర తానే చొరవ తీసుకుంటానన్నారు. తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్నందున ఎన్టీపీసీ నుంచి 2వేల మెగావాట్లు సరఫరా చేయాలని కోరారు. విద్యుదుత్పత్తి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్టీపీసీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తుందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లపై సౌర విద్యుదుత్పత్తి కోసం ఎన్టీపీసీకి అనుమతిస్తామని హామీ ఇచ్చారు. మొదట పైలట్‌ ప్రాజెక్టు కింద చిన్న రిజర్వాయర్‌ కేటాయిస్తామని, తర్వాత పెద్ద రిజర్వాయర్లను కేటాయిస్తామని వెల్లడించారు. విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరుగుతోందన్నారు. పీజీసీఎల్‌ విద్యుత్‌ సరఫరా లైన్ల నిర్మాణం, నిర్వహణ విషయంలో కూడా మెరుగైన విధానం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబరుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ఎన్టీపీసీ సంస్థ 13.5లక్షల మొక్కలు నాటినందుకు సీఎం అభినందించారు. 

బొగ్గు గనుల వద్దే ప్లాంట్లుండాలి 
‘విద్యుత్‌ ప్లాంట్లకు బొగ్గు కేటాయింపులు చేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం సరిగా లేదు. రామగుండం ఎన్టీపీసీ ప్లాంటుకు పక్కనే ఉన్న సింగరేణి నుంచి కాకుండా.. 950 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలోని మందాకిని నుంచి బొగ్గు తెచ్చి వాడుతున్నారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. విద్యుత్‌ ధర పెరుగుతుంది. అంతిమంగా ప్రజలపై భారం పడుతుంది. దేశవ్యాప్తంగా ఎక్కడ విద్యుత్‌ కేంద్రం ఉంటే, దానికి దగ్గరలోని గనుల బొగ్గును వాడాలి. పిట్‌హెడ్‌ ప్లాంట్ల స్థాపన లక్ష్యం కూడా అదే. దూర ప్రాంతాల నుంచి బొగ్గు తేవడం వల్ల రవాణా చార్జీలు పెరుగుతాయి. తెలంగాణ జెన్‌కో సింగరేణి బొగ్గునే వాడుతోంది. రామగుండం ఎన్టీపీసీ కూడా సింగరేణి బొగ్గునే వాడాలి. విద్యుత్‌ ప్లాంట్లకు బొగ్గు కేటాయించే విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వానికి తానే లేఖ రాస్తానని, విధానంలో మార్పు తీసుకురావడానికి చొరవ చూపుతా’అని సీఎం స్పష్టం చేశారు. 2,400 మెగావాట్ల ఎన్టీపీసీ స్టేజ్‌–2కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పవర్‌ పర్చేస్‌ అగ్రిమెంట్‌ (పీపీఏ) పూర్తి కాలేదని అధికారులు సీఎంకు వెల్లడించారు. నిర్మాణానికి ఎన్‌టీపీసీ సిద్ధంగా ఉన్నప్పటికీ, పీపీఏ పూర్తయితేనే పనులకు ఆమోదం లభిస్తుందని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఈనెలలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రితో చర్చించి స్టేజ్‌–2కి సంబంధించిన అగ్రిమెంట్‌ పూర్తయ్యేలా కృషిచేస్తానని హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. 

ఈ ఏడాది నుంచే రామగుండం ఫర్టిలైజర్స్‌ 
రామగుండంలో ఫర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మూతపడ్డ ఎఫ్‌సీఐని తిరిగి తెరిపించేందుకు తాను కేంద్ర ప్రభుత్వంతో పోరాడాల్సి వచ్చిందన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచే ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎఫ్‌సీఐఎల్‌ సీఈఓ రాజన్‌ థాపర్‌ చెప్పారు. రామగుండలో ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైతే.. తెలంగాణ రైతులకు కావాల్సిన ఎరువులు ఇక్కడ నుంచే తీసుకోవచ్చని సీఎం అన్నారు. సింగరేణి సీఎండీ శ్రీధర్‌ నాయకత్వంలో బొగ్గు ఉత్పత్తి పెరుగుతోందని ప్రశంసించారు. తెలంగాణలో ప్రభుత్వరంగ సంస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ జె.సంతోష్‌ కుమార్, ఎమ్మెల్యేలు చందర్, మనోహర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సలహాదారు అనురాగ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాలరావు, సింగరేణి సీఎండీ శ్రీధర్, కలెక్టర్‌ దేవయాని తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం సీఎం ఎన్టీపీసీ జ్యోతినగర్‌లో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు.

కన్నెపల్లికి నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌
సాక్షి ప్రతినిధి, వరంగల్‌: సీఎం కేసీఆర్‌ ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లిలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. దాదాపు 7గంటల పాటు ఆయన కన్నెపల్లి, మేడిగడ్డ వద్ద జరుగుతున్న పనుల తీరును పర్యవేక్షిస్తారు. ఉదయం 6.30 గంటలకు పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ గెస్ట్‌హౌస్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో జయశంకర్‌ భూపాపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కన్నెపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీ కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు. స్వామి దర్శనం తర్వాత కన్నెపల్లికి అక్కడినుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డ బ్యారేజీకి వెళ్తారు. మధ్యాహ్నం 1.30 వరకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పనుల పరిశీలన, ప్రగతిపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు. అక్కడినుంచి రామగుండంలో మధ్యాహ్న భోజనం, విరామం తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement