పథకాలను త్వరగా పూర్తిచేయాలి
‘ఎత్తిపోత’లపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి అభివృద్ధి సంస్థ(ఐడీసీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలన్నీ నిర్వీర్యం అయ్యాయంటూ ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. మంగళవారం ఎత్తిపోతల పథకాలపై జిల్లాల వారీగా ఐడీసీ కార్యాలయంలో సుదీర్ఘంగా సమీక్షించారు. ఇప్పటికే చేపట్టిన ఎత్తిపోతలు, పునరుద్ధరణ చేస్తున్నవి, కొత్త గా మంజూరైన ఎత్తిపోతల పథకాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చేపట్టిన 73 ఎత్తిపోతల పథకాల ద్వారా 1.20లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందని.. దీని కోసం రూ.542 కోట్లు ఖర్చు చేశామ ని అధికారులు తెలిపారు.
మిగతా పనులకు మరో రూ.162.12 కోట్లు అవసరమవుతాయని వివరించారు. వివిధ కారణాల వల్ల పూర్తిగా విని యోగం లేకుండా పోయిన 117 ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని, దీని ద్వారా 49,376 ఎకరాల కు ఆయకట్టు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి రూ.76.84 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశామన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పథకాల పరిధిలోని లబ్ధిదారులైన రైతులను భాగస్వాములను చేయాలని, పనుల వేగవంతానికి శాసనసభ్యులు చొరవ చూపాలన్నారు. పనులు సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లను సస్పెండ్ చేసి అవసరమైతే కొత్తగా టెండర్లు పిలవాలని సూచించారు. ఈ సమావేశంలో శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, ఐడీసీ ఎండీ శ్రీదేవి, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండేలు పాల్గొన్నారు.