రూ.30 వేల కోట్లు ఇవ్వండి!
- కాళేశ్వరం, పాలమూరు కింద రెండేళ్ల పని ఏడాదిలో చేసేస్తాం
- ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ వ్యయ ప్రణాళికల సమర్పణ
- కాళేశ్వరానికి రూ.15,938 కోట్లు,పాలమూరుకు రూ.15,018 కోట్లు కోరిన అధికారులు
- ఆ మేరకు సిమెంట్, కాంక్రీట్ పనులు చేస్తామని వివరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు తమకు వచ్చే ఏడాదికిగానూ రూ.30 వేల కోట్లు ఇవ్వాలని నీటిపారుదల శాఖ సర్కార్‌కు విన్నవించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు నెల వారీగా తాము ఖర్చు చేయాలనుకున్న వ్యయం, చేయాల్సిన పనులపై ప్రభుత్వానికి సమగ్రమైన వివరణ ఇచ్చింది. ఒక్కో ప్రాజెక్టు కింద రమారమి రూ.15 వేల కోట్ల మేర పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ లక్ష్యాల మేర పనులు జరగాలంటే ఈ మేరకు నిధుల విడుదల తప్పనిసరి అని స్పష్టం చేసింది. భూసేకరణ, ఇతరత్రా కారణాల వల్ల ఈ ఏడాది పనులు జరగకపోయినా.. వచ్చే ఏడాదిలో రెండేళ్ల పనులు చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని వివరించింది.
డబ్బులిస్తే ‘డబుల్’వేగంతో..
నిజానికి ఈ ఏడాది బడ్జెట్‌లో కాళేశ్వరం కింద రూ.6,286 కోట్లు కేటాయించగా అందులో ఇప్పటివరకు రూ. 3,283.63 కోట్ల మేర ఖర్చయ్యాయి. మరో రూ.3 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా ఇటీవల బడ్జెట్‌ను రూ.6,643.08 కోట్లకు సవరించారు. పాలమూరు కింద బడ్జెట్‌లో రూ.7,860 కోట్లు కేటాయించినా.. ప్రాజెక్టు పరిధిలో 26,913 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా, 13,777 ఎకరాలు మాత్రమే పూర్తి కావడంతో దీనిని రూ.1,340.64 కోట్లకే పరిమితం చేశారు. దీంతో ఈ ఏడాది పనులు ముందుకు కదల్లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది చేసే పనుల లక్ష్యాలు, వాటికయ్యే వ్యయం నెలవారీ అంచనాలను సమర్పించాలని ఆదేశించడంతో.. ప్రాజెక్టు అధికారులు వాటిని ఉన్నతాధికారులకు సమర్పించారు.
పాలమూరు కింద మొత్తంగా 35.34 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపని, 52 లక్షల కాంక్రీట్ పనులు చేయాల్సి ఉందని, ఇందులో 2017 డిసెంబర్ నాటికి 19.68 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తి చేస్తామని, మరో 22 లక్షల కాంక్రీట్ పని చేస్తామని నివేదించారు. ఈ పనులు చేసేందుకు నెలకు రూ.700 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు బడ్జెట్ విడుదల చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక కాళేశ్వరం కింద భూసేకరణ సమస్యలు కొలిక్కి వచ్చిన దృష్ట్యా వచ్చే ఏడాది నుంచి పనులు వేగిరం చేస్తామని.. ప్రతీ నెలా రూ.వెయ్యి కోట్లకు తక్కువ కాకుండా మట్టి, కాంక్రీట్ పనులు చేస్తామని వెల్లడించారు. మొత్తంగా వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పాలమూరుకు రూ.15,018 కోట్లు, కాళేశ్వరానికి రూ.15,938 కోట్ల మేర పనులు చేస్తామని తెలిపారు. 2016–17లో వివిధ సమస్యలతో పనులు జరుగకున్నా, వచ్చే ఏడాది మాత్రం రెండేళ్ల పనులు ఒక్క ఏడాదిలో డబుల్ వేగంతో చేస్తామని వివరించారు. ఈ నివేదికలను కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్‌కు నీటిపారుదల శాఖ సమర్పించినట్లుగా తెలిసింది.