సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొత్తగా పలు ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సాగునీటి వసతి కల్పించాలన్న డిమాండ్లు, కల్పించేందుకు అవకాశాలు ఉన్న నాలుగు ప్రాంతాలను గుర్తించింది.
కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో గట్టు, మంజీరా, సాగర్ టెయిల్‌పాండ్‌లోని హాలియా, తుంగపాడు బంధం ఎత్తిపోతలను చేపట్టేందుకు.. సుమారు రూ.1,400 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. వీటికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు సిద్ధమవగా.. త్వరలోనే మంత్రివర్గ ఆమోదం తీసుకుని, శంకుస్థాపనలు చేయాలని భావిస్తోంది.
కొత్తగా నాలుగు..
గద్వాల నియోజకవర్గం పరిధిలో కృష్ణా జలాల ఆధారంగా మరో ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నీటిని తీసుకుంటూ.. కొత్తగా గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. రూ.550 కోట్లతో గద్వాల జిల్లాలోని గట్టు, ధరూర్ మండలాల పరిధిలోని 33 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా దీనిని నిర్మించనున్నారు. దీని పనులను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇటీవలే అధికారులను ఆదేశించారు.
ఇక నిజాంసాగర్ కింద మంజీరా నదిపై పిట్లం, బిచ్కుంద మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో 30,646 ఎకరాలకు నీరిచ్చేలా.. నిజాంసాగర్ మండలం మల్లూర్ సమీపంలో రూ.456 కోట్లతో మంజీరా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2.90 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టే ఈ పథకానికి నాలుగైదు రోజుల్లో అధికారిక అనుమతులు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్‌లో కొత్తగా హాలియా ఎత్తిపోతలను రూ.191 కోట్లతో చేపట్టేలా ప్రణాళిక సిద్ధమైంది.
1.32 టీఎంసీల నీటిని తీసుకుని 12,400 ఎకరాలకు నీరిచ్చేలా దీన్ని రూపొందించారు. ఇదే టెయిల్‌పాండ్ కింద తుంగపాడు బంధం వద్ద 0.95 టీఎంసీల సామర్థ్యంతో 8 వేల ఎకరాలకు నీరిచ్చేలా రూ.191 కోట్లతో మరో ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ నాలుగు ఎత్తిపోతల పథకాలకు కూడా దుమ్ముగూడెంలో వృథాగా ఉన్న మోటార్లను వినియోగించనున్నారు. వీటన్నింటికీ వచ్చే నెల రెండో వారానికల్లా అధికారిక అనుమతులు పూర్తి చేసి.. జూన్, జూలై నాటికి పనులు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
గరిష్ట ఆయకట్టుకు నీరే లక్ష్యం
రాష్ట్రంలో లభ్యతగా ఉన్న ప్రతి నీటిచుక్కను వినియోగంలోకి తేవడం, నీటి నిల్వలను పెంచడం ద్వారా గరిష్ట ఆయకట్టుకు నీరు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులను చేపడుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు ప్రాజెక్టులను మొదలుపెట్టగా.. ఇంకా డిమాండ్ ఉన్న చోట్ల మరిన్ని కొత్త పథకాలకు ప్రణాళికలు వేస్తోంది. ఈ మేరకు కడెం ప్రాజెక్టు కింది ఆయకట్టు స్థిరీకరణతో పాటు అవసరమైనపుడు కుంటాల జలపాతానికి నీరు విడుదల చేసేలా కుఫ్టి ఎత్తిపోతలకు ఇటీవలే ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
5.32 టీఎంసీల సామర్థ్యంతో రూ.744 కోట్లతో రిజర్వాయర్ నిర్మించేందుకు అనుమతించింది. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక దేవాదుల ప్రాజెక్టు కింద అదనపు నీటి నిల్వ కోసం 10.78 టీఎంసీల సామర్థ్యంతో జనగామ జిల్లా మల్కాపూర్ గ్రామ పరిధిలోని లింగపల్లి వద్ద రూ.3,227 కోట్లతో రిజర్వాయర్ చేపడుతోంది. ఈ రిజర్వాయర్‌తోపాటు పైప్‌లైన్ వ్యవస్థ, పంపుహౌజ్‌ల నిర్మాణాలకు అనుమతులతో పాటు టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment