సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా ప్రజలు మంజీరా నదీ జలాలను తమహక్కుగా భావిస్తారని, సంగ మేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు చేపట్టడం ద్వారా ఈ హక్కును కాపాడుకోగలుగుతారని శుక్రవారం రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు శాసనసభలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, ఎం.భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు తదితరులు లేవనెత్తిన ఓ ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.
సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 11 మండలాల పరిధిలో ఉన్న 231 గ్రామాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్‌ఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లోని 8 మండలాలు, 166 గ్రామాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు.
సింగూరు బ్యాక్‌వాటర్ నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామన్నారు. ఆందోల్ నియోజక వర్గంలో సంగమేశ్వర, బసవేశ్వర, సింగూరు, కాళేశ్వరం ద్వారా కలిపి మొత్తం 1,74,673 ఎకరాలు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో 1,55,920 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. త్వరలో లిఫ్ట్‌లకు శంకుస్థాపన జరుగుతుందని, నాబార్డ్ ద్వారా నిధులు సమకూరనున్నాయని తెలిపారు.
పురోగతిలో తెలంగాణనే మిన్న..
పురోగతి విషయంలో దేశం కన్నా రాష్ట్రమే ముందుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జీఎస్‌డీపీపై టీఆర్‌ఎస్ సభ్యుడు గాదరి కిశోర్‌కుమార్ వేసిన ఓ ప్రశ్నకు మంత్రి బదు లిస్తూ రాష్ట్రం ఏర్పడినప్పుడు అఖిల భారత స్థూల దేశీయ ఉత్పత్తిలో స్థూల రాష్ట్ర ఉత్పత్తి వాటా 4.06 శాతమని, 2020–21 నాటికి అది 4.97 శాతానికి చేరిందన్నారు.
పరిశ్రమలు, తయారీ, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ప్రతిఏడాది జీఎస్‌డీపీ వాటా పెరుగుతోందని, దేశం కన్నా రాష్ట్రం ప్రగతిరేటు ఎక్కువగా ఉందని అన్నారు. పెద్దఎత్తున ప్రాజెక్టులు నిర్మించి, సాగునీరం దించడం, రైతుబీమా పథకం, రైతు రుణమాఫీ, మైక్రో ఇరిగేషన్ వంటి పురోగతి చర్య లు రాష్ట్ర ఆర్థికప్రగతికి కారణాలుగా మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment