మీడియాతో మాట్లాడుతున్న హరీశ్‌రావు.
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ విష ప్రచారం చేస్తూ రాక్షసానందం పొందుతోందని మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పాడైపోవాలని, మూత పడాలని బీజేపీ కోరుకుంటోందని.. చవకబారు రాజకీయం చేస్తున్న ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి కాళేశ్వరం పంపుహౌజ్‌లను పునరుద్ధరించి యధావిధిగా నీటిని ఎత్తిపోస్తామని తెలిపారు.
ప్రాజెక్టులో రెండు పంపుహౌజ్‌లు మినహా మిగతావన్నీ పనిచేస్తున్నాయని వివరించారు. గురువారం టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాణిక్‌రావు, సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను సీఎం కేసీఆర్ ఎండగడుతున్నందునే బీజేపీ నేతలు కడుపు మంటతో విమర్శలు చేస్తున్నారన్నారు. ఆ ప్రాజెక్టులో అవినీ తి జరిగితే కేంద్రం అనుమతులు ఎలా ఇచ్చిందని.. మీకు నచ్చితే నీతి..లేదంటే అవినీతా అని నిలదీశా రు. తెలంగాణపై కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.
పార్లమెంటు సాక్షిగా నిజాలు.. బయట పచ్చి అబద్ధాలు
ప్రధాని మోదీ గతంలో పార్లమెంటు సాక్షిగా కేసీఆర్ ప్రభుత్వ తీరును మెచ్చుకున్న విషయాన్ని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. నాటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర జల సంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ శర్మ తదితరులు కాళేశ్వరం ప్రాజెక్టుపై కురిపించిన ప్రశంసల వీడియోలను మంత్రి ప్రదర్శించారు.
అలాంటిది ఇప్పుడు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదంటూ కేంద్రమంత్రి విశ్వేశ్వర్ తుడు పార్లమెంటులో ప్రకటించారని.. ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ తీరును తప్పుపడుతున్నందునే కాళేశ్వరంపై బీజేపీ మా ట మార్చి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
గోదావరి నది చరిత్రలో 1986లో భారీ వరద వచ్చిందని.. ఆ మట్టాన్ని పరిగణనలోకి తీసుకునే మేడిగడ్డ బ్యారేజీ, కరకట్టలు నిర్మించామని వివరించారు. కానీ అంతకన్నా 1.2 మీటర్లు అదనపు ఎత్తుతో వరద వ చ్చిందని.. 220 కేవీ సబ్‌స్టేషన్ దెబ్బతిన్నదని తెలిపారు. అన్నారం పంపుహౌజ్ సురక్షితంగా ఉందని, కన్నెపల్లిలోని 17 పంపుల్లో మూడు మాత్రమే దెబ్బతిన్నాయని తెలిపారు. నీట మునిగిన పంపులను పునరుద్ధరించే బాధ్యత కాంట్రాక్టు ఏజెన్సీదేనన్నారు.
బీజేపీది దిగజారుడు రాజకీయం
ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ప్రమాదాన్ని డిజైన్, నాణ్యత లోపమంటూ బీజేపీ నేతలు సంకుచిత, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. కేవలం రెండు పంపుహౌజ్‌లు నీటి మునిగితే మొత్తం ప్రాజెక్టు మునిగిందంటూ విపక్షాలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. పంపులను నెల రోజుల్లో పునరుద్ధరిస్తామని, యాసంగి పంట కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment