
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, వాటి నిర్వహణకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని అన్ని బ్యారేజీలు, పంపుహౌజ్‌ల వద్ద సిబ్బంది బస చేయడానికి వీలుగా క్వార్టర్లు, వాచ్‌టవర్లు నిర్మించాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద పోలీసు క్యాంపు, బ్యారేజీల వద్ద రెండు చొప్పున హెలిప్యాడ్లు నిర్మించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పులువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బ్యారేజీల వద్ద నది ప్రవాహాం ఎంత ఉధృతంగా ఉన్నప్పటికీ ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగని రీతిలో హైప్లడ్‌లెవెల్‌కు చాలా ఎత్తులో వాచ్‌టవర్, క్వార్టర్లు ఉండాలని సీఎం చెప్పారు. ప్రాజెక్టుల పరిధిలోని కాల్వల ద్వారా చెరువులను నింపడానికి చేసిన ఏర్పాట్లను సీఎం అడిగి తెలుసుకున్నారు. గతంలో చెరువులు నింపుకోడానికి రైతులు కాల్వలు తెంపే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి తలెత్తకుండా ప్రభుత్వమే కాలువలకు తూములు ఏర్పాట్లు చేస్తోందని సీఎం చెప్పారు. ప్రాజెక్టుల ద్వారా వచ్చిన నీటితో చెరువులు నిండడంతో పాటు వర్షం ద్వారా కూడా నీరు వస్తుందని, దీంతో తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని సీఎం అన్నారు.