సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 68వ జన్మదినం సందర్భంగా టీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘనంగా సంబరాలు జరుపుకొన్నారు. రాష్ట్రంతోపాటు దేశవిదేశాల్లో వేడుకలు చేసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు కేక్‌లు కట్ చేశారు. కేసీఆర్ చిత్రపటాలు, కటౌట్లకు పాలాభిషేకాలు, ర్యాలీలు, రక్తదానాలు, ఆస్పత్రుల్లో పండ్ల పంపిణీ, దివ్యాంగులకు వాహనాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
మంత్రి హరీశ్‌రావు రంగనాయకసాగర్ ఎడమ కాల్వ ద్వారా రైతులకు గోదావరి నీటిని విడుదల చేసి.. ఆ రిజర్వాయర్ కట్టపైనే కేక్ కట్ చేశారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో 50 అడుగుల భారీ కటౌట్‌కు మంత్రి గంగుల కమలాకర్ పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీఎన్జీవో భవన్‌లో రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల వెళ్లిన ఆమె రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, ఇద్దరు ముఖ్యమంత్రులు ఆయురారోగ్యాలతో ఉండాలని వేంకటేశ్వరుడిని వేడుకుంటున్నట్టు చెప్పారు.
టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో బ్రిటన్, అమెరికా, గల్ఫ్ దేశాల్లో కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఇక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను ఎంపీ కేకే కట్ చేశారు. అనంతరం కేసీఆర్ జీవిత చరిత్ర, ఉద్యమ నేపథ్యంతో 3డీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో హిందీలో రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకల్లో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హరితహారంలో కేసీఆర్
కడియం: సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలోని గ్రీన్‌లైఫ్ నర్సరీ రైతు తిరుమలశెట్టి వాసు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రకాల కూరగాయలు, మొక్కలు, నవధాన్యాలు, పువ్వులతో తెలంగాణ రాష్ట్రం నమూనా మధ్య కేసీఆర్ చిత్రాన్ని రూపొందించారు. హరితహారంతో కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేసీఆర్ చేపట్టారని, ఆయన జన్మదినాన్ని ఇలా జరుపుకొంటున్నామని వాసు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment