రూ.92 వేల కోట్ల గ్రాంట్లు ఇవ్వండి | Give Rs 92000 crore grants | Sakshi
Sakshi News home page

రూ.92 వేల కోట్ల గ్రాంట్లు ఇవ్వండి

Published Fri, Feb 15 2019 3:03 AM | Last Updated on Fri, Feb 15 2019 3:03 AM

Give Rs 92000 crore grants - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు, మిషన్‌ భగీరథ నిర్వహణ, విద్య, వైద్యం తదితర 13 అంశాలకు సంబంధించి రూ.92,809 కోట్లు అవసరమని, వీటిని గ్రాంట్స్‌–ఇన్‌–ఎయిడ్‌గా ఇచ్చేందుకు సిఫార్సు చేయాలని తెలంగాణ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘాన్ని కోరనుంది. వచ్చేవారంలో తెలంగాణకు సందర్శించి ఆర్థిక పరిస్థితి అంచనా వేయనున్న 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌ నేతృత్వంలోని బృందానికి సమర్పించేందుకుగాను నివేదిక తయారు చేసింది. 15వ ఆర్థిక సంఘం అక్టోబర్‌లో తన సిఫార్సుల నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఈ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తాయి. ఐదేళ్లపాటు అమలులో ఉంటాయి. ఎత్తిపోతల పథకాల నిర్మాణం, నిర్వహణకు రూ.40,169 కోట్లు, మిషన్‌ భగీర థకు రూ.12,722 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. 

కోటీ 24 లక్షల ఎకరాలకు నీళ్లు.. 
ప్రతి నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలకు సాగునీరందేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున ఎత్తిపోతల పథకాల నిర్వహణకు నిధులివ్వా లని కోరనుంది. నిర్మాణంలో ఉన్న 23 భారీ, 13 మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని నివేదికలో పేర్కొంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్ల అంచనా వ్యయం ఉందని వివరించనుంది. గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులను రీఇంజనీరింగ్‌ చేస్తున్నామని, ప్రాజెక్టులు పూర్తయితే కోటీ 24 లక్షల ఎకరాలకు నీళ్లందించే సామర్థ్యం ఏర్పడనుందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. గోదావరి, కృష్ణా నదుల నుంచి నీళ్లు గ్రావిటీ ద్వారా వచ్చే పరిస్థితి లేనందున ఎత్తిపోతలపై ఆధారపడాల్సి వస్తోందని, వీటి నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉంటుందని వివరించనుంది.  

భగీరథకు రూ.12,722 కోట్లు కావాలి 
మిషన్‌ భగీరథకు రూ.12,722 కోట్లు కావాలని ప్రభుత్వం ప్రతిపాదించనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.44,979 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. 23,968 ఆవాసాలకు తాగునీరందించనున్న ఈ వాటర్‌గ్రిడ్‌ నిర్వహణకు గ్రామీణ ప్రాంతాల్లో 2020 నుంచి 2025 మధ్యకాలానికి రూ.10,141 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో రూ.2,580 కోట్లు అవసరమని ప్రతిపాదించనుంది. ప్రాజెక్టు నిర్వహణకు ఐదేళ్లకుగాను రూ.12,722 కోట్లు అవసరమని పేర్కొన్నట్లు తెలిసింది.  

ముఖ్య రంగాలకు ఇలా.. 
ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం విభాగంలో వెయ్యి ఆరోగ్య ఉపకేంద్రాలు, కేన్సర్‌ కేర్‌ సెంటర్ల నిర్మాణం, వైద్య వర్సిటీల బలోపేతం.. ఇలా మొత్తంగా రూ.1,085 కోట్లు కావా లని కోరనుంది. 24 గంటల విద్యుత్తుకు భారీ పెట్టుబడులు అవసరమయ్యాయని, పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాల్సి వస్తోందని నివేదికలో పే ర్కొంది. విద్యుత్తు అవసరాలకు రూ.4,442 కోట్లు అవసరమని ప్రతిపాదించనుంది. పాఠశాల విద్యలో భాగం గా బాలికలకు హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్స్‌కు రూ.549 కో ట్లు, ఆధార్‌ బయోమెట్రిక్‌ హాజరు యంత్రాలకు రూ. 201 కోట్లు, ఐసీటీ, డిజిటల్‌ విద్యకు రూ.1,741 కోట్లు అవసరమని ప్రతిపాదించ నుంది. పాఠశాల విద్యకు రూ.7,584 కోట్ల గ్రాంట్లు మంజూరు చేయాలని కోరనుంది. స్థానిక సంస్థల విభా గం ద్వారా రూ.7,866 కోట్ల ప్రతిపాదనలు సమర్పించనుంది. జిల్లాల వర్గీకరణ, కొత్త పంచాయతీల ఏర్పాటు, పంచాయతీ కార్యదర్శుల నియామ కం తదితర అవసరాలకయ్యే వ్యయాన్ని వివరించనుంది. హోంశాఖకు రూ.7,610 కోట్ల నిధులు కోరనుంది. కానిస్టేబుళ్ల నియామకం, ఇతర మౌలిక వసతుల కల్పన, కోర్టు భవనాల నిర్మాణం తదితర అవసరాలకూ ప్రతిపాదనలు సమర్పించనుంది. రెసిడెన్షియల్‌ పాఠశాలలు, హాస్టల్‌ భవనాల నిర్మాణం తదితర అంశాలను నివేదికలో పొందుపరిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement