ఏఐ పాఠాలు.. ఉద్యోగులకు శిక్షణ: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy On AI Foundation Academy established with Microsoft | Sakshi
Sakshi News home page

ఏఐ పాఠాలు.. ఉద్యోగులకు శిక్షణ: సీఎం రేవంత్‌

Published Fri, Feb 14 2025 4:21 AM | Last Updated on Fri, Feb 14 2025 4:21 AM

CM Revanth Reddy On AI Foundation Academy established with Microsoft

ఏఐ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం మైక్రోసాఫ్ట్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఎంఓయూతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, సంస్థ ప్రతినిధులు

500 ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు తర్ఫీదు: సీఎం రేవంత్‌రెడ్డి 

ఏఐ ఫౌండేషన్‌ అకాడమీ ‘అడ్వాంటేజ్‌ తెలంగాణ’ ద్వారా నిర్వహణ

పరిపాలన, ప్రజాసేవలోనూ కృత్రిమ మేధ వినియోగం 

ఫ్యూచర్‌ సిటీలో మైక్రోసాఫ్ట్‌ ఏఐ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ 

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్‌ కొత్త భవనాన్ని ప్రారంభించిన సీఎం 

ప్రభుత్వ భాగస్వామ్యంతో 3 కార్యక్రమాలు: మైక్రోసాఫ్ట్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్‌ సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఏఐ ఫౌండేషన్‌ అకాడమీ ‘అడ్వాంటేజ్‌ తెలంగాణ’కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 500 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పరిపాలన, ప్రజాసేవలోనూ ఏఐ సాంకేతికతను వినియోగిస్తామని చెప్పారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలో 1.2 లక్షల మందికి ఏఐ సాంకేతికతలో శిక్షణ కు 3 కొత్త కార్యక్రమాలను మైక్రోసాఫ్ట్‌ ప్రారంభించింది. సంస్థ కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌ గచ్చిబౌలిలో కొత్తగా నిర్మించిన భవనాన్ని సీఎం గురువారం ప్రారంభించారు.  

భవిష్యత్తు ఏఐ సాంకేతికతదే.. 
‘మైక్రోసాఫ్ట్, హైదరాబాద్‌ నడుమ సుదీర్ఘ భాగస్వామ్యం ఉంది. అంతర్జాతీయ ఆవిష్కరణలపై హైదరాబాద్‌ నుంచి మైక్రోసాఫ్ట్‌ ఎంతో ప్రభావాన్ని చూపింది. సంస్థ కార్యకలాపాల విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభి స్తాయి. వారి సాధికారతకు కూడా ఇది దోహదపడుతుంది. భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీదే. మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘అడ్వాంటేజ్‌ తెలంగాణ’కార్యక్రమం ప్రారంభమైంది. 

మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు తెలంగాణలో స్టార్టప్‌ వాతావరణాన్ని బలోపేతం చేస్తాయి. ఏఐ టూల్స్‌తో, ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్‌ ఫ్యూచర్‌ సిటీలో ‘ఏఐ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేస్తోంది. ఏఐ నాలెడ్జ్‌ హబ్‌ సహా క్లౌడ్‌ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను ఈ సెంటర్‌ అభివృద్ధి చేస్తుంది. ఆవిష్కరణలపై మైక్రోసాఫ్ట్‌కు ఉన్న నిబద్ధత తెలంగాణ పురోగామి విధానాలకు తోడ్పాటును అందిస్తుంది’అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. 

అతిపెద్ద డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్‌బాబు 
హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ‘మెట్రో రైలు విస్తరణ, రీజనల్‌ రింగురోడ్డు, ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీ, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, విద్యుత్‌ వాహనాల ఉత్పత్తి కేంద్రం, క్వాంటమ్‌ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్‌ తదితరాలతోపాటు మూసీ పునరుజ్జీవ పథకం ద్వారా హైదరాబాద్‌ సుస్థిర అభివృద్ధి సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. మూడు దశాబ్దాలుగా హైదరాబాద్‌తో అనుబంధం కలిగిన మైక్రోసాఫ్ట్‌ రూ.15 వేల కోట్లతో భారీ ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌ దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ల హబ్‌గా మారుతోంది. ఏఐ సిటీలో మైక్రోసాఫ్ట్‌ ఏఐ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది..’అని శ్రీధర్‌బాబు తెలిపారు. 

అధునాతన ప్రమాణాలతో కొత్త క్యాంపస్‌ 
మైక్రోసాఫ్ట్‌ గచ్చిబౌలిలో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో కొత్త భవనం నిర్మించింది. ఈ సంస్థకు హైదరాబాద్‌లో ఇప్పటికే మూడు భవనాలు ఉన్నాయి. కొత్త క్యాంపస్‌లో 2,500 మంది ఉద్యోగులకు సరిపడా సదుపాయాలు ఉన్నాయి. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌కు 20 వేల మంది ఉద్యోగులు ఉండగా, సగం మంది హైదరాబాద్‌ నుంచే పనిచేస్తున్నారు. కాగా నూతన భవన ప్రారంభం పురస్కరంచుకుని సంస్థ గురువారం పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలో 1.2 లక్షల మందికి ఏఐ సాంకేతికతలో శిక్షణ అందించేందుకు మూడు కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. 

‘అడ్వాంటేజ్‌ తెలంగాణ’పేరిట 500 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 50 వేల మంది విద్యార్థులకు ఏఐ పాఠాలతో శిక్షణ ఇస్తుంది. ‘ఏఐ ఇండస్ట్రీ ప్రో’పేరిట 20 వేల మంది ఉద్యోగులకు ఏఐ నైపుణ్యంలో తర్ఫీదు ఇస్తుంది. ‘ఏఐ గవర్నర్‌ ఇనిషియేటివ్‌’పేరిట సుమారు 50 వేల మంది ప్రభుత్వ అధికారులకు ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ప్రొడక్టవిటీ వంటి కీలక రంగాల్లో శిక్షణ ఇస్తుంది.  

ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌పై ఎంవోయూ 
ప్రభుత్వ భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌లో ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌తో పాటు ఏఐ నాలెడ్జ్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. హైపర్‌ స్కేల్‌ ఏఐ డేటా సెంటర్లలో పెట్టుబడులు రెట్టింపు చేయడంతో పాటు, రాబోయే రోజుల్లో అదనంగా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. దీంతో హైదరాబాద్‌ ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు అతిపెద్ద డేటా హబ్‌ గా అవతరించనుంది. 

ఇలావుండగా ఏఐ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి మైక్రోసాఫ్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఎండీ, ప్రెసిడెంట్‌ రాజీవ్‌కుమార్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement