సత్య నాదెళ్లకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రభుత్వ ప్రయత్నాలకు మైక్రోసాఫ్ట్ మద్దతివ్వాలి
కంపెనీ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్లకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
ఏఐ, జెన్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్‌పై ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్లు వెల్లడి.. మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌తో కలిసి భేటీ
ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటామన్న సత్య నాదెళ్ల
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక రంగంలో హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏఐ, జెన్ (జెనరేటివ్) ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, ఈ నేపథ్యంలో వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. సీఎం సోమవారం.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి బంజారాహిల్స్‌లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలపై చర్చించారు. రీజినల్ రింగు రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్తగా మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్య శిక్షణ వంటి అంశాలను వివరించారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను పెంచడంపై రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు.
నైపుణ్యాభివృద్ధితో టాప్ ఫిఫ్టీకి: సత్య నాదెళ్ల
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటామని సత్య నాదెళ్ల ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగిన రీతిలో మౌలిక సదుపాయాలు మెరుగు పరిచే అంశంలో ముఖ్యమంత్రి దార్శనికతను ఆయన ప్రశంసించారు. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహద పడతాయని, హైదరాబాద్‌ను ప్రపంచంలోని 50 అగ్రశ్రేణి నగరాల జాబితాలో చేర్చుతాయని చెప్పారు.
హైదరాబాద్‌లో ఏర్పాటైన తొలి సాంకేతిక సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఇక్కడ పది వేల మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడి పెట్టామని గుర్తుచేశారు. సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.
ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటు చేయండి: శ్రీధర్‌బాబు
సీఎం భేటీ అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సత్య నాదెళ్లతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఇటీవల కొత్తగా మరో 4వేల ఉద్యోగాల కల్పనకు మైక్రోసాఫ్ట్ ముందుకు రావడంపై మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. చందనవెల్లిలో రెండు, మేకగూడ, షాద్‌నగర్‌లో ఒక్కో సెంటర్ చొప్పున మొత్తంగా 600 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల ఏర్పాటును స్వాగతించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా నిర్మించే ఏఐ సిటీలో ‘ఏఐ సాంకేతికత’కు సంబంధించి ప్రత్యేక పరిశోధన, అభివృద్ధి కేంద్రం (ఆర్ అండ్ డీ), ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఏఐ, జెన్ ఏఐ కోర్సుల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వాలని శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment