సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరువైంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరున్న జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 1050.30 అడుగుల (6.37 టీఎంసీ) కు పడిపోయింది. ఎండల తీవ్రతకు ప్రతిరోజూ రెండు వందలకు పైగా క్యూసెక్కుల నీరు ఆవిరవుతుండగా, కాకతీయ కాలువకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో భారీగా పూడిక నిండిపోవడంతో ఐదు టీఎంసీల మట్టానికి తగ్గితే బురద నీరు మారే అవకాశాలున్నాయి. తాగునీటి అవసరాల కోసం ఒకటిన్నర టీఎంసీలే అందుబాటులో ఉంటాయి.
ఐదు జిల్లాల తాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టే ఆధారం. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఈ గ్రిడ్ నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. జగిత్యాల, కోరుట్ల తాగునీటి కోసం ప్రతిరోజు 54 క్యూసెక్కులు, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల తాగునీటి కోసం 29 క్యూసెక్కులు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కోసం మరో 54 క్యూసెక్కుల నీటిని పంపు చేస్తున్నారు. ఆవిరి నష్టాలతో కలిపి మొత్తం ప్రతిరోజు 394 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఏటా ఈ ప్రాజెక్టుకు ఆగస్టులో ఇన్‌ఫ్లో ఉంటుంది. అప్పటి వరకు తాగునీటి అవసరాలకు ఈ నీటినే వినియోగించాల్సి ఉంటుంది.
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్టం- 6.37టీఎంసీలు
- ప్రతిరోజూ తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్న నీరు- 394క్యూసెక్కులు..
- ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ నీటి మట్టం- 5టీఎంసీలు
ఆగస్టులో భారీగా ఇన్‌ఫ్లో..
మహారాష్ట్రతో పాటు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిస్తే ఈ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కానీ ఈ ఏడాది ప్రాజెక్టు క్యాచ్‌మెంట్ ఏరియాలో సరిగ్గా వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండ లేదు. ఈసారి 2018 ఆగస్టులో వచ్చిన వరద కొంత మేరకు ఊరటనిచ్చింది. ఒక్కోరోజు సుమారు 4లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. కొన్నిరోజులు లక్ష క్యూసెక్కుల చొప్పున వరద జలాలు వచ్చి చేరాయి. ఏడాది మొత్తానికి 77.92 టీఎంసీలు వచ్చాయి. దీంతో 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నీటిమట్టం గరిష్టంగా 83 టీఎంసీలకు చేరింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో యాసంగి పంటల కోసం కాకతీయ కాలువ ద్వారా సాగు నీటిని విడుదల చేశారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు నీటిని వదిలారు. ఎగువ ఎల్‌ఎండీ వరకు ఆయకట్టుకు సుమారు 20 టీఎంసీలు సాగునీరు సరఫరా చేశారు.
తాగునీటికి ఏ మాత్రం ఇబ్బంది లేదు..
తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం ప్రాజెక్టు 6.37 టీఎంసీల నీరుంది. దీంతో ఆగస్టు మాసాంతం వరకు తాగునీటిని సరఫరా చేయవచ్చు. ఏటా ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రాజెక్టు ఇన్‌ఫ్లో ఉంటుంది. -శ్రీనివాస్‌రెడ్డి, పర్యవేక్షక ఇంజనీర్
Comments
Please login to add a commentAdd a comment