డెడ్ స్టోరేజీ నీటిని తరలించడం దారుణం
నంద్యాలరూరల్ : రాయలసీమలో తీవ్ర కరువు నెలకొని తాగునీటి ఎద్దడి ఏర్పడి అల్లాడుతుంటే శ్రీశైలం జలాశయంలోని డెడ్ స్టోరేజీ నీటిని ప్రభుత్వం కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలించడం దారుణమని జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. నంద్యాల టెక్కె మార్కెట్ యార్డు ఆవరణంలో సిద్దేశ్వరం సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ స్థాయి రైతు ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బొజ్జాదశరథరామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమవాసుల కష్టాలను గుర్తించి తక్షణమే తాగునీరు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ ఏకపక్ష ధోరణి వల్ల మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రాయలసీమలో రానుందని హెచ్చరించారు.
జులై రెండో వారంలో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి సుమారు 50వేల మందితో కలిసి ‘మనజలం, మనసిద్దేశ్వరం’ నినాదంతో ఉద్యమం చేపడుతున్నామని వెల్లడించారు. నంద్యాల మార్కెట్‌యార్డు చైర్మన్ సిద్ధం శివరాం, కుందూ నది పోరాట సమితి అధ్యక్షుడు కామిని వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా వరి ఉత్పత్తి దారుల సంఘం కన్వీనర్ వైఎన్‌రెడ్డి, రాయలసీమ జలసాధన సమితి కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.