చెరువులో అడుగంటుతున్న నీరు
జహీరాబాద్: మల్‌చల్మలోని ఈరన్న వాగు ప్రాజెక్టులోకి నీరు అంతగా చేరలేదు. దీని కింద 508 ఎకరాల ఆయకట్టు ఉంది. డెడ్‌స్టోరేజీ కారణంగా తూముల వద్దకు కూడా నీరు రాకపోవడంతో పొలాలకు అందని పరిస్థితి నెలకొంది. వర్షాధారంపైనే రైతులు మినుము, పెసర, కంది, సోయాబీన్ సాగు చేసుకున్నారు. గతంలో ఈ చెరువు కింద చెరకు, అల్లం, అరటి పంటలు సాగు చేసేవారు. వర్షాలు లేక చెరువులోకి నీరు రాక రైతులు బోర్లు, బావులు తవ్వుకుని పంటలు సాగు చేసుకుంటున్నారు. మిగతా రైతులు వర్షాధార పంటలు సాగు చేస్తున్నారు.
చెరువుతో ఉపయోగం లేదు
నాలుగేళ్లుగా చెరువులోకి నీరు రావడం లేదు. తగినన్ని వర్షాలు లేకపోవడమే కారణం. ప్రస్తుతం కొందరు రైతులు బోర్లు వేసుకుని సాగు చేసుకుంటున్నారు. నేను కూడా బోరు కిందే సాగు చేస్తున్నా. అనేక మంది రైతులు మినుము, పెసర, కంది, సోయాబీన్ పంటలు వేసుకున్నారు. ప్రస్తుతం చెరువులో నీరు డెడ్ స్టోరేజీ చేరుకుంది. - పి.మాణిక్‌రెడ్డి, రైతు, మల్‌చల్మ
బోరు ఆధారంగానే సాగు
బోరులో ఉన్న నీటి మేరకు చెరకు వేశా. మిగతా పొలాల్లో వర్షాధార పంటలు వేశా. గత నాలుగేళ్లుగా వర్షాభావం ఉంది. చెరువులోకి నీరు రావడం లేదు. చెరువు వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. గతంలో ఈ చెరువు ఆయకట్టు మొత్తం సాగయ్యేది. చెరకు, పసుపు ఇతర వాణిజ్య పంటలు వేసుకునే వారం. ఇప్పుడు వర్షాధార పంటలతోనే సరిపెట్టుకుంటున్నాం. - హెచ్.నాగిరెడ్డి, రైతు, మల్‌చల్మ