crops dried
-
పంటలు ఎండిపోకుండా చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటలు ఎండిపోయే పరిస్థితి లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి వచ్చే ఖరీఫ్‌లో పంటలకు నీరందిస్తామని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, నల్లమోతు భాస్కర్‌రావు, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, చెన్నమనేని రమేశ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు హరీశ్ సమాధానమిచ్చారు. ‘‘పదేళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉదయ సముద్రం ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ కమీషన్ల కోసం కేవలం పంపులు, పైపులు తెచ్చిపెట్టి బిల్లులు తీసుకున్నారు. 2014 వరకు పనులు కదలలేదు. కరువు పీడిత ప్రాంతాలకు జీవమిచ్చే ప్రాజెక్టు కావడంతో.. టీఆర్ఎస్ ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. వచ్చే వానాకాలం నుంచి ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకు సాగునీరిస్తాం. 40 చెరువులను నింపుతాం..’’అని చెప్పారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్ కుడి, ఎడమ కాల్వలను ఆధునీకరిస్తున్నామని, ప్రాజెక్టు కింద 58 వేల ఎకరాలకు నీరందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి రైతులకు పాస్‌పుస్తకాలు: మహమూద్ అలీ రైతులకు ఏప్రిల్ 20వ నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి మహముద్ అలీ తెలిపారు. ధరణి వెబ్సైట్లో భూములకు సంబంధించిన అన్ని వివరాలను పొందుపరుస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, అరూరి రమేశ్, శ్రీనివాస్‌గౌడ్, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.34 కోట్ల ఎకరాల్లో 93 శాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తయిందని పేర్కొన్నారు. 6,180 మందికి పునరావాసం: పద్మారావుగౌడ్ రాష్ట్రంలో గుడుంబా తయారీని పూర్తిగా రూపుమాపామని ఎౖMð్సజ్ మంత్రి పద్మారావుగౌడ్ తెలిపారు. గుడుంబా అంశంపై దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పద్మారావు సమాధానమిచ్చారు. గుడుంబా విక్రేతల్లో ఇప్పటివరకు 6,180 మందికి పునరావాసం కల్పించామని చెప్పారు. అందరికీ ఉపాధి కల్పిస్తేనే గుడుంబా నిర్మూలన అవుతుందని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. ధూల్‌పేటలో ఐదెకరాల్లో ఏదైనా పరిశ్రమను నెలకొల్పుతామని మంత్రి వెల్లడించారు. మహిళల కోసం 102 అంబులెన్స్ సేవలు: లక్ష్మారెడ్డి గ్రామీణ మహిళలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 102 అంబులెన్స్ సర్వీసును అమలు చేస్తున్నట్లు వైద్యారోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 241 వాహనాలను ఈ సేవలకు వినియోగిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖ, బొడిగె శోభ, కోవ లక్ష్మి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మరో 3 వేల ఆలయాలకు ధూపదీప నైవేద్యం: ఇంద్రకరణ్‌రెడ్డి దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రవ్యాప్తంగా మరో 3 వేల ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకాన్ని వర్తింపజేసేందుకు ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు. ప్రస్తుతం 1,805 ఆలయాలకు ఈ పథకం అమలవుతోందన్నారు. ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఒడితెల సతీశ్‌కుమార్, పుట్ట మధుకర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు: హరీశ్ మున్సిపాలిటీల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందుకు భారీగా నిధులను ఇవ్వబోతోందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో పద్దులపై చర్చ అనంతరం సభ్యుల ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. లైబ్రరీల్లో ఇంటర్నెట్, వైఫై: కడియం అన్ని జిల్లాల కేంద్ర గ్రంథాలయాల్లో విద్యార్థులకు ఉపయోగపడే పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ గ్రంథాలయాల్లో ఇంటర్నెట్, వైఫై సేవలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సభ్యులు పాతూరి సుధాకర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 21 కొత్త జిల్లాల్లో నిర్మించే గ్రంథాలయాలకు ఒకే రకమైన డిజైన్ రూపొందించామని, ఒక్కోదానికి రూ.కోటిన్నర ఖర్చుచేయనున్నామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యం: మహేందర్‌రెడ్డి డ్రైవర్ల వైద్య పరీక్షలకు ఆర్టీసీ ప్రాధాన్యం ఇస్తోందని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సంస్థలో పని చేస్తున్న 56 వేల మంది ఉద్యోగుల కోసం ఏటా రూ.48 కోట్లతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. తార్నాకలోని 200 పడకల ఆర్టీసీ ఆస్పత్రిలో, కరీంనగర్‌లోని 12 పడకల ఆస్పత్రితో పాటు రాష్ట్రంలోని మరో 15 డిస్పెన్సరీల్లో ఆర్టీసీ సిబ్బందికి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. విద్యుత్ టారిఫ్ రేట్లను సవరించే ప్రతిపాదన లేదు: జగదీశ్‌రెడ్డి రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్ స్లాబులు, రేట్లను సవరించే విషయం పరిశీలనలో లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ‘డిస్కంల భారాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఉదయ్ పథకంలో చేరడం ద్వారా రూ.8,923 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. అయినా రూ.1,610 కోట్ల మేర డిస్కంల మీద ఇప్పటికీ భారం ఉంది’అని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల్లేవ్: సండ్ర ఆర్‌డబ్ల్యూఎస్‌లోని 4,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు పది నెలలుగా జీతాలు అందటం లేదని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. రోజుకు 500–600 గ్రానైట్ లారీల ప్రయాణంతో సత్తుపల్లి రోడ్డు మృత్యుమార్గంగా మారిందని, దాన్ని నాలుగు వరుసలకు విస్తరించటంతోపాటు డ్రైవర్లకు సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించాలని కోరారు. పాత పైపులైన్లతో సమస్యే: ఆర్.కృష్ణయ్య మిషన్ భగీరథ పథకం కింద గ్రామం వరకు కొత్త పైపులైన్లు నిర్మించి గ్రామాల్లో అప్పటికే ఉన్న పాత లైన్లనే వాడబోతున్నారని, అవి అస్తవ్యస్తంగా ఉన్నందున ప్రజల ఆరోగ్యాలకు మళ్లీ ఇబ్బంది తప్పదని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు మండల కేంద్రాల్లో కార్యాలయాలు నిర్మించాలని కోరారు. నేనొచ్చిన బస్సు 3 సార్లు ఆగిపోయింది: సున్నం రాజయ్య ఆర్టీసీ బస్సుల కండిషన్ అధ్వానంగా తయారైందని, తన నియోజకవర్గం నుంచి హైదరాబాద్‌కు తానొచ్చిన బస్సు నార్కెట్‌పల్లి–చౌటుప్పల్ మధ్య మూడు సార్లు ఆగిపోయిందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య.. సభ దృష్టికి తెచ్చారు. వాటిని బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీలో తెల్ల బెల్లం కనిపిస్తే ఎక్సైజ్ పోలీసులు కేసులు పెడుతున్నారని, శ్రీరామ నవమికి పానకం కోసం బెల్లం కొనాలంటే జనం భయపడుతున్నారని పేర్కొన్నారు. గుడుంబాను నియంత్రించాలని కోరారు. -
బరువెక్కుతున్న రైతు గుండె
ముఖం చాటేసిన వర్షాలు ఎండుతున్న పంటలు ఆందోళనలో రైతులు కొల్చారం: ఊరించిన వర్షాలు ముఖం చాటేయడంతో పంటలు ఎండుతున్నాయి. ఏపుగా పెరిగిన పంటలు కళ్లెదుటే ఎండుతుంటే రైతు గుండె బరువెక్కుతోంది. దిగులుతో రోగాల బారిన పడి మంచం పడుతున్నారు రైతులు. కష్టాల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమవుతోంది. కొల్చారం మండలంలో గత రెండేళ్ల నుంచి పంటల సాగు అంతంతగానే ఉంది. మండలంలో పంటల సాగు సాధారణ విస్తీర్ణం 5,706 హెక్టార్లు కాగా ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 4,748 హెక్టార్లలో పంటలను సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులను ముందుగానే పసిగట్టిన రైతులు ఎక్కువగా ఆరుతడి పంటలు మొక్కజొన్న, పప్పు దినుసులు, పత్తి సాగు చేశారు. వరి 2,875 హెక్టార్లు, మొక్కజొన్న 941హెక్టార్లు, పత్తి 344 హెక్టార్లు, జొన్న 32 హెక్టార్లు, పెసర 117 హెక్టార్లు, కంది 240 హెక్టార్లలో సాగు చేశారు. ఇతర పంటలనూ సాగు చేశారు. సాగు సమయంలో వర్షాలు అడపాదడపా ఓ మోస్తలు కురియడంతో పంటలు కాస్త ఏపుగా పెరిగే దశకు వచ్చాయి. ఇంతలోనే వర్షాలు ముఖం చాటేశాయి. బోర్లు వట్టిపోవడంతో తాగేందుకు నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. పంటలు ప్రస్తుతం ఎండుతుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంటల సాగు కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కానరాక.... ప్రభుత్వం ఇస్తామన్న మూడో దఫా రుణమాఫీ ఇప్పటికీ అమలు కాకపోవడంతో ఏ రైతును కదిలించినా బాధతో కూడిన భావాలను వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండలస్థాయి వ్యవసాయధికారులు కూడా పొలాల వైపు వచ్చి చూసింది లేదని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తాము బతికేది ఎలా అంటూ నిట్టూరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొల్చారం మండల రైతులకు భరోసా కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రూ.60 వేల పెట్టుబడి ఐదు ఎకరాల్లో ఈ సంవత్సరం బోరు కింద వరి పంట సాగు చేశాను. రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. బోరు కాస్త నీళ్లు పోయడం ఆగింది. వర్షం కూడా తగినంత కురవకపోడంతో ప్రస్తుతం వరి పంట పూర్తిగా ఎండుముఖం పడుతోంది. పంట సాగు కోసం చేసిన పెట్టుబడి చేతికందని పరిస్థితులు కనిపిస్తున్నాయి. - మహేందర్‌రెడ్డి, వై.మాందాపూర్ కలిసిరాని కాలం రెండేళ్ల నుంచి కాలం కలిసి రావడం లేదు. ఈ సంవత్సరం నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశాను. పంట బాగా పండి అప్పుల నుంచి బయట పడదామనుకుంటే వర్షాలు కురవడం లేదు. పంట పూర్తిగా ఎండిపోయింది. అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన పొలం వైపు రావడం లేదు. - సత్తయ్య, కోనాపూర్ రోగాలతో చస్తున్నాం నా మూడెకరాల పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాను. పంటను చూస్తే దుఃఖమొస్తోంది. నీళ్లందక పంట పూర్తిగా ఎండిపోయే దశకు చేరింది. రోగాలు వచ్చి పదిహేనురోజులుగా ఇబ్బంది పడుతున్నా. కనీసం అధికారులు వచ్చి మా పొలాలను చూసి భరోసా ఇవ్వకపోవడం దారుణం. అధికారులు స్పందించాలి. - నర్సింలు, రైతు -
ఈరన్నవాగు డెడ్‌స్టోరేజీ
జహీరాబాద్: మల్చల్మలోని ఈరన్న వాగు ప్రాజెక్టులోకి నీరు అంతగా చేరలేదు. దీని కింద 508 ఎకరాల ఆయకట్టు ఉంది. డెడ్‌స్టోరేజీ కారణంగా తూముల వద్దకు కూడా నీరు రాకపోవడంతో పొలాలకు అందని పరిస్థితి నెలకొంది. వర్షాధారంపైనే రైతులు మినుము, పెసర, కంది, సోయాబీన్ సాగు చేసుకున్నారు. గతంలో ఈ చెరువు కింద చెరకు, అల్లం, అరటి పంటలు సాగు చేసేవారు. వర్షాలు లేక చెరువులోకి నీరు రాక రైతులు బోర్లు, బావులు తవ్వుకుని పంటలు సాగు చేసుకుంటున్నారు. మిగతా రైతులు వర్షాధార పంటలు సాగు చేస్తున్నారు. చెరువుతో ఉపయోగం లేదు నాలుగేళ్లుగా చెరువులోకి నీరు రావడం లేదు. తగినన్ని వర్షాలు లేకపోవడమే కారణం. ప్రస్తుతం కొందరు రైతులు బోర్లు వేసుకుని సాగు చేసుకుంటున్నారు. నేను కూడా బోరు కిందే సాగు చేస్తున్నా. అనేక మంది రైతులు మినుము, పెసర, కంది, సోయాబీన్ పంటలు వేసుకున్నారు. ప్రస్తుతం చెరువులో నీరు డెడ్ స్టోరేజీ చేరుకుంది. - పి.మాణిక్‌రెడ్డి, రైతు, మల్చల్మ బోరు ఆధారంగానే సాగు బోరులో ఉన్న నీటి మేరకు చెరకు వేశా. మిగతా పొలాల్లో వర్షాధార పంటలు వేశా. గత నాలుగేళ్లుగా వర్షాభావం ఉంది. చెరువులోకి నీరు రావడం లేదు. చెరువు వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. గతంలో ఈ చెరువు ఆయకట్టు మొత్తం సాగయ్యేది. చెరకు, పసుపు ఇతర వాణిజ్య పంటలు వేసుకునే వారం. ఇప్పుడు వర్షాధార పంటలతోనే సరిపెట్టుకుంటున్నాం. - హెచ్.నాగిరెడ్డి, రైతు, మల్చల్మ -
ఉరిమిన కరువు మేఘం
జాడలేని చినుకు జూలై చివరి వారం నుంచీ.. పంటలు ఎండుముఖం చెల్క నేలల్లో ఇప్పటికే భారీ నష్టం నల్ల రేగడి భూములకూ కష్టకాలమే జిల్లాలో మరోసారి దుర్భిక్ష పరిస్థితులు లబోదిబోమంటున్న రైతన్న అప్రమత్తం కావాలంటూ శాస్త్రవేత్తలు గజ్వేల్: కమ్ముకున్నాయి కరువు మేఘాలు... జాడ లేని చినుకు.. ఆకాశం వైపు రైతన్న చూపు.. వెరసి ఈ యేడు కూడా తప్పని కరువు. వరుసగా రెండేళ్లు కరువును చూసిన రైతులు ఈ సారి కూడా అవే ఛాయలు కన్పిస్తోండడంతో తల్లడిల్లిపోతున్నారు. జూన్‌లో మురిపించిన వర్షాలు... పంటలు ఎదిగే కీలక సమయం జూలై చివరి వారం నుంచి ఇప్పటివరకు చినుకు జాడే కరువైంది. పంట చేలు ఎండుముఖం పట్టాయి. చెల్క నేలల్లో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొద్దిరోజులు గడిస్తే నల్ల రేగడి భూముల్లోనూ పంటలు నాశనమయ్యే దయనీయ పరిస్థితి నెలకొంది. ఇదివరకే పుట్టెడు అప్పుల్లో కూరుకుపోయి.. తాజాగా మరోసారి అప్పు చేసి పెట్టుబడి పెట్టిన అన్నదాతలు కన్నీటిపర్యంతమవుతున్నారు. జిల్లాలో 4.34 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను ఇప్పటివరకు కేవలం 3.72లక్షల హెక్టార్లకుపైగా పంటలు సాగులోకి వచ్చాయి. నిజానికి జూన్ నెల నుంచి ఆగస్టు 20వరకు 482.1మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 369.6 మి.మీ మాత్రమే నమోదైంది. ఈ లెక్కన 23.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రధాన పంటలు మొక్కజొన్న, పత్తి విషయానికొస్తే ముందుగా కురిసిన వర్షాలకు విత్తనాలు మొలకెత్తాయి. కానీ కీలక సమయం జూలై చివరి వారం నుంచి వర్షాలు పత్తాలేక మొక్కజొన్న ఎండిపోతోంది. చెల్క నేలల్లో ఇప్పటికే ఈ పంటకు భారీ నష్టం సంభవించింది. మరో రెండు మూడు రోజులు వర్షాలు రాకపోతే నల్లరేగడి భూముల్లోనూ పంట పూర్తిగా దెబ్బతినే అవకాశముంది. పత్తి పంట పరిస్థితి సైతం ఇదే విధంగా తయారైంది. మొక్కజొన్న, పత్తి పంటల విత్తనాలు, పెట్టుబడుల రూపంలో ఇప్పటికే జిల్లావ్యాప్తంగా రూ.200 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. జిల్లాలో ప్రధాన పంటల సాగు వివరాలు (హెక్టార్లలో).. పంట సాధారణ సాగు విస్తీర్ణం సాగు విస్తీర్ణం మొక్కజొన్న 1,13,490 1.22 లక్షలు పత్తి 1,22,436 84,175 వరి 82,206 34,272 కంది 26,678 40,593 సోయాబీన్ 15,421 29,396 పెసర్లు 24,994 27,351 మినుములు 13,714 16,287 జొన్న 10,753 8,738 చెరుకు 21,532 6,814 రైతు గౌటి సాయి పరిస్థితి ఇలా.. గజ్వేల్ పట్టణానికి చెందిన గౌటి సాయి తనకున్న మూడెకరాల భూమిలో బోరుబావి ఆధారంగా 10 గుంటలలో వరి, మరో రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. మిగతా దానిలో కూరగాయ పంటలు సాగుచేస్తున్నాడు. 25 రోజులకుపైగా చినుకు జాడలేక మొక్కజొన్న ఏపుగా పెరిగినా ఎండుముఖం పట్టింది. దీంతో ఆ చేనుపై ఆశలు వదులుకున్నాడు. వరి పంట పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. భూగర్భ జలాలు పడిపోయి బోర్లల్ల నుంచి నల్లా వచ్చినట్లు నీళ్లు పోస్తున్నాయి. కూలీగాక మొక్కజొన్నకే రూ.40వేల పెట్టుబడి అయ్యింది. ఎర్రటి ఎండలు కొడుతుండడంతో పంట నాశనమైపోయిందని ఆందోళన వ్యక్తం చేశాడు. పెట్టుబడి పోయింది... నా కష్టం కూడా బూడిదలో కలిసింది అంటూ వాపోయాడు. రైతన్న అప్రమత్తం కావాలి వర్షాలు తగ్గుముఖం పట్టినందున రైతులు అప్రమత్తం కావాలని సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ సూచిస్తున్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లో... జిల్లాలో రెండు వారాలకుపైగా వర్షాభావ పరిస్థితులు అలుముకున్నాయి. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 23.3మి.మీల తక్కువ వర్షపాతం నమోదైంది. తేలిక నేలల్లో సాగులో ఉన్న మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ తదితర పంటలలో వర్షాభావ పరిస్థితుల కారణంగా తెగుళ్ల ఉధృతి పెరిగింది. పత్తిలో రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక దాడి పెరుగుతోంది. ఈ సమయంలో రైతులు తగు నివారణ చర్యలు చేపడితే కొంత ఉపశమనం లభించే అవకాశముంది. పత్తిలో రసం పీల్చు పురుగులు ఆర్థిక వయోపరిమితి(ఈటీఎల్) దాటినట్లయితే పచ్చదోమ ఆకుకు 2, పేనుబంక మొక్కకు 10-20, తెల్లదోమ ఆకుకు 6-20, తామర పురుగులు ఆకుకు 10 ఉన్నట్లయితే వీటి నివారణకు ట్రైజోఫాస్ లీటరు నీటికి 2మి.లీ, క్రోఫినోపాస్ లీటరు నీటికి 2మి.లీ కలిపి పిచికారీ చేయాలి. లేదా వేపనూనె లీటరు నీటికి 5మి.లీ కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో మానుక మచ్చల పురుగు నివారణకు క్లోరోఫ్యూరాన్ గుళికలను ఎకరాకు 3కిలోల చొప్పున ఆకు సుడులలో వేయాలి. సోయాబీన్లో కాండం తొలిచే ఈగ ఆశిస్తుంది. దీని నివారణకు మోనోక్రొటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎసిఫేట్ ఒక గ్రాము.. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కందిలో ఎండు తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. జొన్నతో పంట మార్పిడి చేయాలి. చెరుకులో వేరు పురుగు నివారణకు ఎకరాకు 150మి.లీ లాసెంటా అనే మందును 20 లీటర్ల నీటిలో కలిపి మొక్క మొదళ్లు తడపాలి. వర్షాభావ పరిస్థితుల వల్ల వాడుతున్న మొక్కజొన్న, జొన్న, పత్తి పంటలకు 2శాతం(20 గ్రాములు) యూరియా లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పప్పు దినుసుల పంటలైన సోయా, మినుము పంటలకు ప్రస్తుతం పూత దశనుంచి కాత ఏర్పడే దశలో ఉన్నాయి. వర్షాభావం వల్ల దిగుబడి తగ్గకుండా మల్టి-కే ఎకరాకు కిలో లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
పంటనష్టం చెల్లించాలి
మెదక్‌లో రైతుల రాస్తారోకో మెదక్: ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెదక్ మండల రైతులు మంగళవారం పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మల్లేశం, బిజేవైఎం మండల అధ్యక్షుడు నాగరాజు, రైతులు మాట్లాడుతూ మెదక్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, 3వ విడుదల రుణమాఫీని విడుదల చేయాలన్నారు. సీఎం కేసీఆర్ స్పందించి జిల్లాలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులకు పంట నష్టపరిహారం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో ఖాజిపల్లి ఉప సర్పంచ్ నర్సింలు, నాగులు, పెద్ద నర్సింలు, మైసయ్య, లచ్చయ్య, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.