సదాశివనగరం సమీపంలో ఎండుతున్న వరిపంట
- ముఖం చాటేసిన వర్షాలు
- ఎండుతున్న పంటలు
- ఆందోళనలో రైతులు
కొల్చారం: ఊరించిన వర్షాలు ముఖం చాటేయడంతో పంటలు ఎండుతున్నాయి. ఏపుగా పెరిగిన పంటలు కళ్లెదుటే ఎండుతుంటే రైతు గుండె బరువెక్కుతోంది. దిగులుతో రోగాల బారిన పడి మంచం పడుతున్నారు రైతులు. కష్టాల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమవుతోంది.
కొల్చారం మండలంలో గత రెండేళ్ల నుంచి పంటల సాగు అంతంతగానే ఉంది. మండలంలో పంటల సాగు సాధారణ విస్తీర్ణం 5,706 హెక్టార్లు కాగా ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో 4,748 హెక్టార్లలో పంటలను సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులను ముందుగానే పసిగట్టిన రైతులు ఎక్కువగా ఆరుతడి పంటలు మొక్కజొన్న, పప్పు దినుసులు, పత్తి సాగు చేశారు.
వరి 2,875 హెక్టార్లు, మొక్కజొన్న 941హెక్టార్లు, పత్తి 344 హెక్టార్లు, జొన్న 32 హెక్టార్లు, పెసర 117 హెక్టార్లు, కంది 240 హెక్టార్లలో సాగు చేశారు. ఇతర పంటలనూ సాగు చేశారు. సాగు సమయంలో వర్షాలు అడపాదడపా ఓ మోస్తలు కురియడంతో పంటలు కాస్త ఏపుగా పెరిగే దశకు వచ్చాయి. ఇంతలోనే వర్షాలు ముఖం చాటేశాయి.
బోర్లు వట్టిపోవడంతో తాగేందుకు నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. పంటలు ప్రస్తుతం ఎండుతుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంటల సాగు కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కానరాక.... ప్రభుత్వం ఇస్తామన్న మూడో దఫా రుణమాఫీ ఇప్పటికీ అమలు కాకపోవడంతో ఏ రైతును కదిలించినా బాధతో కూడిన భావాలను వ్యక్తం చేస్తున్నారు.
కనీసం మండలస్థాయి వ్యవసాయధికారులు కూడా పొలాల వైపు వచ్చి చూసింది లేదని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తాము బతికేది ఎలా అంటూ నిట్టూరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొల్చారం మండల రైతులకు భరోసా కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
రూ.60 వేల పెట్టుబడి
ఐదు ఎకరాల్లో ఈ సంవత్సరం బోరు కింద వరి పంట సాగు చేశాను. రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. బోరు కాస్త నీళ్లు పోయడం ఆగింది. వర్షం కూడా తగినంత కురవకపోడంతో ప్రస్తుతం వరి పంట పూర్తిగా ఎండుముఖం పడుతోంది. పంట సాగు కోసం చేసిన పెట్టుబడి చేతికందని పరిస్థితులు కనిపిస్తున్నాయి. - మహేందర్‌రెడ్డి, వై.మాందాపూర్
కలిసిరాని కాలం
రెండేళ్ల నుంచి కాలం కలిసి రావడం లేదు. ఈ సంవత్సరం నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశాను. పంట బాగా పండి అప్పుల నుంచి బయట పడదామనుకుంటే వర్షాలు కురవడం లేదు. పంట పూర్తిగా ఎండిపోయింది. అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన పొలం వైపు రావడం లేదు. - సత్తయ్య, కోనాపూర్
రోగాలతో చస్తున్నాం
నా మూడెకరాల పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాను. పంటను చూస్తే దుఃఖమొస్తోంది. నీళ్లందక పంట పూర్తిగా ఎండిపోయే దశకు చేరింది. రోగాలు వచ్చి పదిహేనురోజులుగా ఇబ్బంది పడుతున్నా. కనీసం అధికారులు వచ్చి మా పొలాలను చూసి భరోసా ఇవ్వకపోవడం దారుణం. అధికారులు స్పందించాలి. - నర్సింలు, రైతు