- మెదక్‌లో రైతుల రాస్తారోకో
మెదక్: ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెదక్ మండల రైతులు మంగళవారం పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మల్లేశం, బిజేవైఎం మండల అధ్యక్షుడు నాగరాజు, రైతులు మాట్లాడుతూ మెదక్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, 3వ విడుదల రుణమాఫీని విడుదల చేయాలన్నారు.
సీఎం కేసీఆర్ స్పందించి జిల్లాలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులకు పంట నష్టపరిహారం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో ఖాజిపల్లి ఉప సర్పంచ్ నర్సింలు, నాగులు, పెద్ద నర్సింలు, మైసయ్య, లచ్చయ్య, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.