పరిహారం ఇస్తారా.. ప్రాణాలు తీసుకోమంటారా?
పురుగుల మందుతో తహసీల్ ఎదుట రైతు కుటుంబం బైఠాయింపు
జైనథ్: తనకు రావాల్సిన పరిహారం మరో రైతుకు ఇచ్చారంటూ ఓ రైతు కుటుంబంతో సహా మంగళవారం తహసీల్ ఎదుట పురుగుల మందు డబ్బాలతో బైఠాయించాడు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడ గ్రామ పంచాయతీ పరిధి రాంపూర్‌కు చెందిన గోదారి చిన్నయ్య తనకున్న మూడు ఎకరాల 16 గుంటల(సర్వే నంబరు 57) భూమిని కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ఈయన భూమి నుంచి పెన్‌గంగా కాలువ వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే, గోదారి చిన్నయ్య కాస్తు చేస్తున్న భూమి, అతని పట్టాలో ఉన్న భూమి ఒకటి కాదని అధికారులు గోదారి చిన్నయ్యకు తెలిపారు. ఈ భూమి 57 సర్వే నంబరులో కొనుగోలు చేసిన గోదారి చిన్నయ్య పొరపాటుగా రికార్డుల ప్రకారం 56 సర్వే నంబరులో కాస్తు చేస్తున్నాడని, 56 సర్వే నంబరులో భూమిని కొనుగోలు చేసిన అదే గ్రామానికి చెందిన ముకినేపల్లి చిన్నయ్య 57 నంబరులో కాస్తులో ఉన్నాడని అధికారులు నిర్ధారించారు. ఇదే క్రమంలో ప్రభుత్వం నుంచి రూ.13.52 లక్షలు పరిహా రాన్ని అధికారులు ముకినేపల్లి చిన్నయ్యకు అందజేశారు. దీంతో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గోదారి చిన్నయ్య కుటుంబసభ్యులతో కలసి పురుగుల మందు డబ్బాలతో బైఠాయించాడు. డిప్యూటీ తహసీల్దార్ సమీర్, ఇతర అధికారులు, తహసీల్దార్ బొల్లెం ప్రభాకర్ వారిని సముదాయించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి.. ఆందోళన విరమింపజేశారు.