72 ఊళ్ల త్యాగం.. సింగూరు జలం
- మెతుకు సీమ కన్నీరు.. హైదరాబాద్‌కు తాగునీరు
- ప్రాజెక్టు కింద 72 గ్రామాల మునక
- భూములు కోల్పోయిన 42 వేల మంది రైతులు
- అప్పట్లో ఎకరానికి రూ. 12,500
- ఇళ్లకు రూ. 2వేల చొప్పున పరిహారం
- కోర్టులో సవాల్ చేసిన బాధితులు
- నేటికీ కోర్టు చుట్టూ ప్రదక్షిణలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:సింగూరు.. పరిహారం నేటికీ అందలేదు.. నాడు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులు పరిహారం కోసం ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. భూసేకరణ దశలో తాతలు, ప్రాజెక్టు పూర్తి అయ్యాక తండ్రులు, తాజాగా కొడుకులు తిరుగుతున్నారు. జిల్లాకు గుక్కెడు నీళ్లివ్వని సింగూరు జలాశయంలో 72 ఊర్లు మునిగిపోయాయి.
42 వేల రైతాంగం తమ బతుకును త్యాగం చేశారు. ఈనేపధ్యంలోనే తాజాగా మల్లన్నసాగర్ తెరమీదకు వచ్చింది. సింగూరు అనుభవంతోనే మల్లన్నసాగర్ రైతాంగం భయపడుతోంది.. 25 టీఎంసీల సామర్థ్యం ఉన్న సింగూరు ప్రాజెక్టు 1976 ఫిబ్రవరి 15న
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డి.దేవ్‌రాజ్ శంకుస్థాపన చేశారు. 1986లో ప్రాజెక్టు పూర్తయ్యింది. మొదట 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు తరువాత మరో 5 టీఎంసీలకు అదనంగా పెంచారు.
నిజానికి బీదర్ సమీపంలో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును అప్పటి కర్ణాటక అభ్యంతరం చెప్పటంతో సింగూరు వద్ద కట్టాలని నిర్ణయించారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా నిర్మించిన సింగూరు ప్రాజెక్టు కింద పుల్కల్, మునిపల్లి, ఝరాసంఘం, రాయికోడ్, న్యాల్‌కల్, మనూర్, న్యాల్‌కల్ మండలాల పరిధిలోని 49 గ్రామాలు పూర్తిగా, 23 గ్రామాలు పాక్షికంగా మునిగిపోయాయి. 42 వేల మంది రైతుల వద్ద నుంచి 37, 478 వేల ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించింది. మొదట 36 వేల ఎకరాలు సరిపోతాయని అంచనా వేసిన ప్రభుత్వం ఆ తరువాత మరో 1023 ఎకరాల తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణ ప్రారంభం సమయంలో మెదక్ జిల్లాలో 40 వేల ఎకరాలకు సాగు నీళ్లు అందిస్తామని మాటిచ్చారు.
అప్పట్లో ఎకరా భూమికి రూ.12,500 చొప్పున, ఇళ్లకు రూ 2000 నుంచి 3000 చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించింది. భూములు ఇవ్వబోమని ఎదరుతిరిగిన రైతులను బలవంతంగా ఈడ్చి వేసిందని, పోలీసులను పెట్టి కొట్టి బయటికి పంపారని అప్పటి ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. చెల్లించిన పరిహారానికి సంతృప్తి చెందని రైతులు తాము విలువైన భూములను కోల్పోయినందున అదనంగా చెల్లించాలని హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టుకు తీర్పు వస్తే రైతులకు నష్టపరిహారం ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుందని భయపడిన ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనికి కూడా అంగీకరించలేదు. కనీసం ప్రస్తుతం నడుస్తున్న మార్కెట్ ధర ప్రకారమైన భూముల ధర కట్టివ్వాలని న్యాల్‌కల్, పుల్కల్ , మునిపల్లి, మండలాలకు చెందిన రైతులు ప్రస్తుతం నడుస్తున్న రేట్ల ప్రకారం విలువ చెల్లించాలని 5 సంవత్సరాల క్రితం రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇంకా కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కోర్టులో కేసు కొనసాగుతోంది.
సింగూరు భయపెడుతోంది.....
గోదావరి నదిపై కాళేశ్వరం కింద 50 టీఎంసీలతో నిర్మస్తున్న కొమరవెల్లి మలన్నసాగర్ కింద 5 గ్రామాలు పూర్తిగా 4 గ్రామాలు పాక్షికంగా మునిగిపోతున్నాయి. ప్రభుత్వం మొత్తం 20 వేల ఎకరాలను సేకరించే పనిలో పడింది. కానీ సింగూరు రైతుల అనుభవమే ఇప్పుడు మలన్నసాగర్ రైతాంగాన్ని భయపెడుతోంది. ముంపు గ్రామాల ప్రజలు తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని చెప్తున్నారు. మెరుగైన ప్యాకేజీ కోసమే తమ పోరాటం అంటున్నారు. చట్టాలు, ఉత్తర్వులతో తమకు పనిలేదని మంత్రి హరీశ్‌రావు మాట ఇస్తే చాలని చెప్తున్నారు. సింగూరు రైతుల మాదిరిగా తరాలతరబడి కోర్టుల చుట్టూ తిప్ప వద్దని వారు కోరుతున్నారు.
ఒట్టేసి చెప్తున్నా..
రైతుల త్యాగానికి దండం పెడుతున్నా.. ముంపు ప్రజలకు ఏమిచ్చినా తక్కువే. వాళ్లను కడుపుల పెట్టుకొని చూసుకుంటా. సింగూరు ప్రాజెక్టు అనుభవాన్ని చూసి రైతులు భయపడటం సహజమే. 72 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 42 వేల మంది రైతులు భూములు కోల్పోయారు. కానీ రైతులకు ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. భూములు కోల్పోయిన వాళ్లంతా నష్టపరిహారం కోసం కోర్టు చుట్టూ తిరిగుతున్నారు.
చట్టాలు, జీవోలు ఏం చెప్పినా సర్వం కోల్పోతున్న నిర్వాసితుల పట్ల ప్రభుత్వం మానవతాదృక్పథంతో ఆలోచన చేసి వారికి అండగా నిలబడాలి. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టకుంటా. ఊరును పోలిన ఊరును కట్టిస్తా, ప్రాజెక్టు నిర్మాణంతో పాటే ఊళ్ల నిర్మాణం చేస్తాం. . ఎకరానికి దాదాపు రూ. 6 లక్షలు ఇస్తున్నాం. బోరు, చెట్టు, బావికి పైపు లైన్లు ఇలా ఏమి ఉంటే వాటికి కూడా అదనంగా నష్టపరిహారం కట్టిస్తున్నాం.. ఈ డబ్బు కూడా రైతులు భూములు రిజిసే్ట్రష¯ŒS చేసిన 15 నుంచి 20 రోజుల్లోనే డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ఇళ్లు కోల్పోతున్న వారికి రూ 5 .4 లక్షల నష్టపరిహారంతో(డబుల్ బెడ్‌రూంకు అయ్యే ఖర్చు) పాటు, కొత్త ఇళ్లు కట్టుకోవడానికి మరో రూ 5.4 లక్షల ఆర్థిక సహకారం అందిస్తున్నాం. మల్లన్న సాగర్‌లో చేపలు పట్టే హక్కులు ముంపు గ్రామాలకే ఇస్తాం.
– హరీశ్‌రావు, భారీనీటి పారుదలశాఖ మంత్రి