నిమ్జ్.. వేగిరం | Nimj of the project the farmers concerned compensation | Sakshi
Sakshi News home page

నిమ్జ్.. వేగిరం

Published Wed, Mar 23 2016 3:45 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

నిమ్జ్.. వేగిరం - Sakshi

నిమ్జ్.. వేగిరం

ఇటు నిమ్జ్ పనులు ముమ్మరం
అటు ఆందోళనలో రైతాంగం
భూసేకరణపై మండిపాటు
పరిహారం చాలదంటున్న రైతులు
భూమికి భూమేనంటూ డిమాండ్
పట్టించుకోని అధికారులు


ఒకవైపు నిమ్జ్ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా.. మరోవైపు రైతులు ఆందోళన బాట పడుతున్నారు. సరిపడా పరిహారం ఇవ్వకుండానే భూములను బలవంతంగా లాక్కుంటున్నారని మండిపడుతున్నారు. తాజా బడ్జెట్‌లో ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించడంతో పాటు త్వరలోనే దీన్ని ప్రారంభిస్తామని ప్రకటించడం తెలిసిందే. ప్రస్తుతం భూసేకరణ పనులు వేగవంతమయ్యాయి. మొదటి విడత భూసేకరణను నెలాఖరకు పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అయితే భూములు కోల్పోతున్న రైతులు మాత్రం నిరసన గళాన్ని విన్పిస్తున్నారు. భయపెట్టి మొక్కుబడి పరిహారమిస్తున్నారని అంటున్నారు. వారిచ్చిన మొత్తంతో మరోచోట భూమి కొనే పరిస్థితి లేదంటు న్నారు. భూమికి భూమైనా ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.     - జహీరాబాద్

జహీరాబాద్: నిమ్జ్ (జాతీయ పెట్టుబడుల ఉత్పత్తి మండలి)కి ప్రభుత్వం ఇప్పటికే రూ.వంద కోట్లు విడుదల చేసింది. మొదటి విడతగా 3,501 ఎకరాలు సేకరించాలని ప్రతిపాదించింది. ఇందుకు గాను సర్వే కూడా పూర్తయింది. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారాన్ని కూడా అందజేస్తోంది. ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు 1,500 ఎకరాల మేర భూములకు సంబంధించిన పరిహారాన్ని రైతులకు చెక్కుల రూపంలో అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు మొదటి విడత భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. దాదాపు 30 మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఇందులో పాల్పంచుకుంటున్నారు. భూసేకరణ, పరిహారం చెక్కుల పంపిణీ బాధ్యతను పలువురు తహశీల్దార్లకు అప్పగించారు. పరిహారం చెల్లించిన వెంటనే సదరు భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.

 మొదటి విడతలో గుర్తించిన గ్రామాలు...
ఝరాసంగం మండలం బర్దీపూర్, చీలపల్లి, చీలపల్లి తండా, ఎల్గోయి, న్యాల్‌కల్ మండలం రుక్మాపూర్, రుక్మాపూర్ తండా, ముంగి గ్రామాల్లోని భూములను మొదటి విడత కింద సేకరించారు. ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లోని 18 గ్రామాల్లో నిమ్జ్ కోసం భూములను గుర్తించారు.

 ప్రతిపాదిత ఎకరాలు...
నిమ్జ్ కోసం 12,636 ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రతిపాదించారు. ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో మొత్తం 11,252 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్, పట్టా భూములు ప్రాజెక్టు ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూమి, అసైన్‌మెంట్ భూమి, పట్టా భూములు ఎంత మేర ఉన్నాయో గుర్తించారు. ఝరాసంగం మండలంలో మొత్తం గుర్తించిన భూమి 3,212.08 ఎకరాాలు, ప్రభుత్వ భూమి 725.38 ఎకరాలు, అసైన్డ్ భూమి 2,227.25 ఎకరాలు, పట్టాభూమి 258.25 ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు. న్యాల్‌కల్ మండలంలో మొత్తం 8,040.18 ఎకరాలుగా గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూమి 1,259.22 ఎకరాలు, పట్టా భూమి 2,260.20 ఎకరాలు ఉన్నట్టు నిర్ధారించారు.

 పరిహారం ఇలా...
భూములు కోల్పోయిన రైతులకు పరిహారాన్ని అధికారులు నిర్ణయించారు. రైతులు సాగు చేసుకుంటున్న అసైన్‌మెంట్ భూమిఎకరాకు రూ.4 లక్షలు, సాగులో లేకుండా పడావు వేసిన అసైన్‌మెంట్ భూమికి రూ.3.25 లక్షలు చెల్లిస్తున్నారు. పట్టా భూములకు మాత్రం ఎకరాకు రూ.5.65 లక్షలుగా నిర్ణయించారు.

ఉపాధి అవకాశాలు కల్పించాలి...
పరిహారంతోపాటు తమ కుటుంబాలకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఉద్యోగాలిచ్చే విషయంలో మాత్రం ఎలాంటి హామీ ఇవ్వడం లేదంటున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని బాధిత రైతులు కోరుతున్నారు.

 పరిహారంపై మండిపాటు
తమ భూములకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం ఏ మాత్రం సరిపోదని రైతులు అంటున్నారు. పట్టా భూములకు రూ.10 లక్షలకు పైగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేయాలన్నా ఎకరాకు రూ.12 నుంచి రూ.15 లక్షల మేర వెచ్చించాల్సి వస్తుందంటున్నారు. పరిహారం సరిపోదంటూ మొ దట్లో రైతులు చెక్కులను తీసుకునేం దుకు నిరాకరించారు. నిరసనలు సైతం తెలిపారు. దీంతో అధికారులు దిగివచ్చి స్వల్పంగా పెంచారు. భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే భయపెట్టి మరీ తీసుకుంటున్నారని పలువురు  వాపోతున్నారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించక తప్పదని వారంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement