ఖమ్మం, న్యూస్‌లైన్: పంటనష్ట పరిహారం విషయంలో వ్యవసాయశాఖ అధికారుల వైఖరి పరిహాసమాడినట్లు ఉందని రైతులు విమర్శిస్తున్నారు. శాస్త్రీయపద్ధతుల్లో అంచనాలు వేస్తామన్న ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో జిల్లా రైతులకు పరిహారం అందే సూచనలు కనిపించడం లేదు. ఇదే అదనుగా అధికారపా ర్టీ నాయకులు కూడా పరిహారం విషయం లో తప్పించుకుంటున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రబృందం జిల్లావైపు కన్నెత్తయినా చూడకపోవడంపై స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొనసాగుతున్న నిర్లక్ష్యం
తుపాను ప్రభావంతో పంటలు నష్టపోతున్న రైతులపై మొదటి నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూనే ఉందని రైతుసంఘాలు అంటున్నాయి. గత సంవత్సరం వచ్చిన నీలం తుపానుతో జిల్లావ్యాప్తంగా 3.18 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. దీనివిలువ రూ.171 కోట్ల మేరకు ఉంటుందని రైతుసంఘాల నాయకులు, అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో పర్యటించారు. పంటనష్టం జరి గిన ప్రాంతాల్లో రైతులు కన్నీళ్లు పెట్టడాన్ని చూ సి...‘కేంద్ర బృందం వస్తుంది.. పంటనష్టాన్ని అంచనా వేస్తుంది..’అని హామీ ఇచ్చారు. కానీ రైతుల మొఖం చూసిన నాథుడే కరువయ్యారు. జిల్లా అధికారులు పంటనష్టం అంచనాలు వేయడంలో నిర్లక్ష్యం వహించారు. జిల్లావ్యాప్తంగా 21వేల మంది రైతులకు రూ. 10.5 కోట్ల మేర పంట నష్టం జరిగిందని నివేదిక పంపించారు. దీనిపై కూడా ఆంక్షలు విధించి ప్రభుత్వం ఇందులోనూ కొంత కోతపెట్టి కేవలం రూ. 6.5 కోట్లు మాత్రమే కేటాయించింది. దీనిలోనూ రూ.4.5 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
కొండంతకు గోరంత..
పంటనష్టాలను అంచనావేసేందుకు వచ్చిన కేంద్రబృందం జిల్లావైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తుపాను వచ్చినప్పుడు హడావుడి చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు బలరాంనాయక్, వెంకటరెడ్డి ఆ తర్వాత రైతుల క్షేమాన్నే మరిచిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. గతనెలలో కురిసిన తుపానుతో జిల్లాలో 3.37 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. కేంద్ర బృందం వచ్చి పంటనష్టాలను అంచనావేస్తుందని మంత్రులు చెప్పారు. మరోవైపు వ్యవసాయశాఖ అధికారులు కొండంత నష్టం జరిగితే గోరంత జరిగినట్లు అంచనాలను పంపించినట్లు తెలిసింది. జిల్లాలో కేవలం 75 ఎకరాల్లో మాత్రమే పంటనష్టం జరిగినట్లు ప్రకటించడం విడ్డూరం. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్నలు, నీటమునిగిన ధాన్యం తమ పరిధిలోకి రాదని అధికారులు చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు. పక్కనే ఉన్న నల్లగొండ, కృష్ణా జిల్లాల్లో పర్యటించిన కేంద్రబృందం జిల్లాలో పర్యటించకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని అంటున్నారు. మంత్రులు, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పటికీ పరిహారం ఇవ్వట్లేదు
ఆరుగాలం కష్టపడి పంటలు పండి స్తే చేతికందే తరుణంలో తుపానులు దెబ్బతీస్తున్నాయి. గత సంవత్సరం నీలం తుపానుతో నష్టపోయిన పంటలకు ఇంతవరకు పరిహారం రాలేదు. ఇటీవల కురిసన తుపానుకు ఐదు ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. పెట్టుబడులు కూడా వచ్చేలా లేవు. అయినా పరిహారం ఇచ్చేలా లేరు.
- మల్లెల నాగేశ్వరరావు, తిరుమలాయపాలెం
ప్రకటనలే తప్ప పరిహారం లేదు
పంటలు నష్టపోయినప్పుడు హడావుడి చేసే ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. నీలం తుపానుతో మిరప తోట దెబ్బతిన్నప్పటికీ పరిహారం రాలేదు. మొన్నటి తుపానకు పత్తి దెబ్బతింది. దీనికి కూడా పరిహారం వస్తుందన్న నమ్మకం లేదు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది తప్ప పరిహారం ఇచ్చేలా లేదు.
- నంద్యాల శ్యాంసుందర్‌రెడ్డి, ఏలువారిగూడెం
మళ్లీ మొండిచెయ్యే!
Published Sat, Nov 23 2013 5:29 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement