గజ్వేల్ పట్టణ శివారులో ఎండిపోయిన మొక్కజొన్న చేను
- జాడలేని చినుకు
- జూలై చివరి వారం నుంచీ..
- పంటలు ఎండుముఖం
- చెల్క నేలల్లో ఇప్పటికే భారీ నష్టం
- నల్ల రేగడి భూములకూ కష్టకాలమే
- జిల్లాలో మరోసారి దుర్భిక్ష పరిస్థితులు
- లబోదిబోమంటున్న రైతన్న
- అప్రమత్తం కావాలంటూ శాస్త్రవేత్తలు
- పత్తిలో రసం పీల్చు పురుగులు ఆర్థిక వయోపరిమితి(ఈటీఎల్) దాటినట్లయితే పచ్చదోమ ఆకుకు 2, పేనుబంక మొక్కకు 10-20, తెల్లదోమ ఆకుకు 6-20, తామర పురుగులు ఆకుకు 10 ఉన్నట్లయితే వీటి నివారణకు ట్రైజోఫాస్ లీటరు నీటికి 2మి.లీ, క్రోఫినోపాస్ లీటరు నీటికి 2మి.లీ కలిపి పిచికారీ చేయాలి. లేదా వేపనూనె లీటరు నీటికి 5మి.లీ కలిపి పిచికారీ చేయాలి.
- మొక్కజొన్నలో మానుక మచ్చల పురుగు నివారణకు క్లోరోఫ్యూరాన్ గుళికలను ఎకరాకు 3కిలోల చొప్పున ఆకు సుడులలో వేయాలి.
- సోయాబీన్‌లో కాండం తొలిచే ఈగ ఆశిస్తుంది. దీని నివారణకు మోనోక్రొటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎసిఫేట్ ఒక గ్రాము.. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- కందిలో ఎండు తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. జొన్నతో పంట మార్పిడి చేయాలి.
- చెరుకులో వేరు పురుగు నివారణకు ఎకరాకు 150మి.లీ లాసెంటా అనే మందును 20 లీటర్ల నీటిలో కలిపి మొక్క మొదళ్లు తడపాలి.
- వర్షాభావ పరిస్థితుల వల్ల వాడుతున్న మొక్కజొన్న, జొన్న, పత్తి పంటలకు 2శాతం(20 గ్రాములు) యూరియా లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
- పప్పు దినుసుల పంటలైన సోయా, మినుము పంటలకు ప్రస్తుతం పూత దశనుంచి కాత ఏర్పడే దశలో ఉన్నాయి. వర్షాభావం వల్ల దిగుబడి తగ్గకుండా మల్టి-కే ఎకరాకు కిలో లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
గజ్వేల్: కమ్ముకున్నాయి కరువు మేఘాలు... జాడ లేని చినుకు.. ఆకాశం వైపు రైతన్న చూపు.. వెరసి ఈ యేడు కూడా తప్పని కరువు. వరుసగా రెండేళ్లు కరువును చూసిన రైతులు ఈ సారి కూడా అవే ఛాయలు కన్పిస్తోండడంతో తల్లడిల్లిపోతున్నారు. జూన్‌లో మురిపించిన వర్షాలు... పంటలు ఎదిగే కీలక సమయం జూలై చివరి వారం నుంచి ఇప్పటివరకు చినుకు జాడే కరువైంది.
పంట చేలు ఎండుముఖం పట్టాయి. చెల్క నేలల్లో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొద్దిరోజులు గడిస్తే నల్ల రేగడి భూముల్లోనూ పంటలు నాశనమయ్యే దయనీయ పరిస్థితి నెలకొంది. ఇదివరకే పుట్టెడు అప్పుల్లో కూరుకుపోయి.. తాజాగా మరోసారి అప్పు చేసి పెట్టుబడి పెట్టిన అన్నదాతలు కన్నీటిపర్యంతమవుతున్నారు.
జిల్లాలో 4.34 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను ఇప్పటివరకు కేవలం 3.72లక్షల హెక్టార్లకుపైగా పంటలు సాగులోకి వచ్చాయి. నిజానికి జూన్ నెల నుంచి ఆగస్టు 20వరకు 482.1మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 369.6 మి.మీ మాత్రమే నమోదైంది. ఈ లెక్కన 23.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రధాన పంటలు మొక్కజొన్న, పత్తి విషయానికొస్తే ముందుగా కురిసిన వర్షాలకు విత్తనాలు మొలకెత్తాయి.
కానీ కీలక సమయం జూలై చివరి వారం నుంచి వర్షాలు పత్తాలేక మొక్కజొన్న ఎండిపోతోంది. చెల్క నేలల్లో ఇప్పటికే ఈ పంటకు భారీ నష్టం సంభవించింది. మరో రెండు మూడు రోజులు వర్షాలు రాకపోతే నల్లరేగడి భూముల్లోనూ పంట పూర్తిగా దెబ్బతినే అవకాశముంది. పత్తి పంట పరిస్థితి సైతం ఇదే విధంగా తయారైంది. మొక్కజొన్న, పత్తి పంటల విత్తనాలు, పెట్టుబడుల రూపంలో ఇప్పటికే జిల్లావ్యాప్తంగా రూ.200 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.
జిల్లాలో ప్రధాన పంటల సాగు వివరాలు (హెక్టార్లలో)..
పంట సాధారణ సాగు విస్తీర్ణం సాగు విస్తీర్ణం
మొక్కజొన్న 1,13,490 1.22 లక్షలు
పత్తి 1,22,436 84,175
వరి 82,206 34,272
కంది 26,678 40,593
సోయాబీన్ 15,421 29,396
పెసర్లు 24,994 27,351
మినుములు 13,714 16,287
జొన్న 10,753 8,738
చెరుకు 21,532 6,814
రైతు గౌటి సాయి పరిస్థితి ఇలా..
గజ్వేల్ పట్టణానికి చెందిన గౌటి సాయి తనకున్న మూడెకరాల భూమిలో బోరుబావి ఆధారంగా 10 గుంటలలో వరి, మరో రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. మిగతా దానిలో కూరగాయ పంటలు సాగుచేస్తున్నాడు. 25 రోజులకుపైగా చినుకు జాడలేక మొక్కజొన్న ఏపుగా పెరిగినా ఎండుముఖం పట్టింది.
దీంతో ఆ చేనుపై ఆశలు వదులుకున్నాడు. వరి పంట పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. భూగర్భ జలాలు పడిపోయి బోర్లల్ల నుంచి నల్లా వచ్చినట్లు నీళ్లు పోస్తున్నాయి. కూలీగాక మొక్కజొన్నకే రూ.40వేల పెట్టుబడి అయ్యింది. ఎర్రటి ఎండలు కొడుతుండడంతో పంట నాశనమైపోయిందని ఆందోళన వ్యక్తం చేశాడు. పెట్టుబడి పోయింది... నా కష్టం కూడా బూడిదలో కలిసింది అంటూ వాపోయాడు.
రైతన్న అప్రమత్తం కావాలి
వర్షాలు తగ్గుముఖం పట్టినందున రైతులు అప్రమత్తం కావాలని సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ సూచిస్తున్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లో... జిల్లాలో రెండు వారాలకుపైగా వర్షాభావ పరిస్థితులు అలుముకున్నాయి. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 23.3మి.మీల తక్కువ వర్షపాతం నమోదైంది.
తేలిక నేలల్లో సాగులో ఉన్న మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ తదితర పంటలలో వర్షాభావ పరిస్థితుల కారణంగా తెగుళ్ల ఉధృతి పెరిగింది. పత్తిలో రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక దాడి పెరుగుతోంది. ఈ సమయంలో రైతులు తగు నివారణ చర్యలు చేపడితే కొంత ఉపశమనం లభించే అవకాశముంది.